ఉత్తరాంధ్రపై బాబు గురి

తరచూ పర్యటనలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అధికారంతో మరింతగా బలపడే యోచన Advertisement ఉత్తరాంధ్ర జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఎపుడూ పట్టుకొమ్మలు లాంటివే. 193లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత దాదాపు రెండు దశాబ్దాల…

తరచూ పర్యటనలు
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
అధికారంతో మరింతగా బలపడే యోచన

ఉత్తరాంధ్ర జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఎపుడూ పట్టుకొమ్మలు లాంటివే. 193లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ జిల్లాలు టీడీపీ వెంటనే ఉన్నాయి. ఆ కంచుకోటను బద్దలుకొట్టడం ఒక్క వైఎస్‌ఆర్ వల్లనే అయింది. 2004, 2009 ఎన్నికలలో ఆయన వరుసగా తన నాయకత్వంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలలో మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీ స్ధానాలను కైవశం చేసుకున్నారు. ఆయన మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి టీడీపీ పుంజుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో  ఈ మూడు జిల్లాలలో వైసీపీ బలంగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ, ఎన్నికల వేళ మాత్రం టీడీపీకే భారీ మొగ్గు కనిపించింది. మొత్తం అయిదు పార్లమెంటు స్ధానాలకు గానూ నాలుగింటిని, 35 ఎమ్మెల్యే స్ధానాలకు గానూ పాతికకు పైగా సాధించి పసుపు జెండాను ఎగురవేసింది. అయితే, ఉత్తరాంధ్రలో వైసీపీ కూడా బలంగానే ఉండడంతో రానున్న రోజులలో ఎదురు లేకుండా చేసుకునేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. తరచూ పర్యటనలు చేయడం ద్వారా ఉత్తరాంధ్రను టీడీపీకి తిరుగులేనిదిగా చేయాలని సంకల్పించారు. అందులో భాగంగానే పలు చర్యలను తీసుకుంటున్నారు. ఫలితంగా అటు అధికారులు,  ఇటు ప్రజా ప్రతినిధులు కూడా చురుకుగా పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నది బాబు ఆలోచనగా ఉంది. మొత్తం మీద ఉత్తరాంధ్రపై బాబుది రాజకీయ ప్రేమ, నిజమైన ప్రేమ అన్నది తేలాల్సిన అవసరం ఉంది.

తొలి కేబినెట్ విశాఖలోనే…

ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ విడిపోయాక పదమూడు జిల్లాలతో పూర్వపు రాష్ట్రం ఏర్పడింది. ఈ పదమూడు జిల్లాలలో భౌగోళికంగానే కాదు, అభివృద్ధిపరంగానూ విశాఖ నగరమే బహు పెద్దది. దాంతో, విభజన తరువాత ఏపీకి విశాఖపట్నం రాజధాని అవుతుందని అంతా భావించారు. కానీ టీడీపీలో భారీ ఎత్తున జరిగిన లాబీయింగ్ పుణ్యమాని విజయవాడ రాజధాని అయిపోయింది. అయితే ఈ విషయాలు ముందు నుంచే తెలిసిన బాబు తెలివిగా విశాఖను ఏ విధంగానూ తగ్గించడం లేదన్న సూచనలు తన చేతల ద్వారా చూపించే యత్నం చేశారు. అందులో భాగమే విశాఖలో టీడీపీ తొలి మంత్రివర్గ సమావేశం. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రాయూనివర్శిటిలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ద్వారా విశాఖ ప్రాముఖ్యతను ఆయన కావాలనే చాటారు. తమ సర్కార్ విశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్న బలమైన సంకేతాలను బయటకు పంపించారు. ఆ తరువాత రాజధానిపై అసెంబ్లీలో ప్రకటన చేసే సమయంలోనూ విశాఖ జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించారు. అందులో మొదటిది చాలాకాలంగా విశాఖ వాసులు ఎదురుచూస్తున్న రైల్వే జోన్. ఇది విజయవాడలోనా, రాయలసీమలోనా అన్న మీమాంసను బాబు తొలగించారు.

అలాగే, ఐఐటి ఇస్తారన్న ప్రచారం ఉన్నా ఐఐటీ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తరువాత విశాఖ జిల్లాలో బాబు వరుస పర్యటనలు చేస్తూ వచ్చారు. తాజాగా ఇటీవల నగరానికి అతి సమీపంలో ఉన్న మధురవాడలో ఐటీకి సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. మధురవాడలో సిగ్నేచర్ టవర్‌ను నిర్మిస్తామని, ఐటీ హబ్‌గా విశాఖను రూపుదిద్దుతామని కూడా ఆయన చెప్పారు. అతి త్వరలోనే హైదరాబాద్‌ను మించిన సైబరాబాద్‌గా ఈ జిల్లాను మారుస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. విశాఖలో పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో పాటు, మెట్రో రైలు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలాగే, పర్యాటకం పరంగానూ విస్తరిస్తామని చెప్పారు. ఆర్ధిక రాజధానిని చేస్తామని, సినీ రాజధానిగా మారుస్తామని కూడా భరోసా ఇచ్చారు. విశాఖ విమానాశ్రయాన్ని శంషాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు కూడా ప్రకటించారు. ఈ నేపధ్యంలో విశాఖవాసులు ఎంతో ఆశతో టీడీపీ సర్కార్ హామీల అమలు కోసం చూస్తున్నారు

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోనూ పలు ప్రాజెక్టులు

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాలని బాబు సర్కార్ ప్రతిపాదిస్తోంది. శ్రీకాకుళం కొవ్వురు వద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. అలాగే, ఇక్కడ పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్ధాపనలు చేశారు. రానున్న రోజులలో ఈ రెండు జిల్లాలలోనూ పరిశ్రమలు భారీ ఎత్తున నెలకొల్పడం ద్వారా ఉపాధిని కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ మధ్యలో పలుమార్లు జిల్లాల పర్యటనకు వచ్చిన బాబు ఈ జిల్లాలు తనకు చాలా ముఖ్యమని చెప్పారు. ఇక్కడ నుంచి నిరుద్యోగులు, యువత  ఉపాధి కోసం వలస పోతున్నారని, వారికి అటువంటి పరిస్థితి రాకుండా ఇక్కడే పరిశ్రమలు స్ధాపిస్తామని చెప్పారు. బాబు హామీలతో సిక్కోలు, విజయనగరం జనం సంతోషిస్తున్నా అమలు ఎలా అన్నదే మేధావుల ప్రశ్నగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన వివక్షకు గురి అయిన శ్రీకాకుళం, విజయనగరం  పేరుకు మాత్రమే జిల్లాలుగా ఉన్నాయి తప్ప, అభివృద్ధి విషయంలో ఎక్కడా పొంతన లేదు. జిల్లా కేంద్రాల తీరు చూస్తే అది అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అసలే నిధుల కొరతతో సతమతమవుతున్న టీడీపీ సర్కార్ ఏ విధంగా అభివృద్ధి పనులు చేపడుతుందన్నది ఆసక్తిగా మారింది.

పెదవి విరుస్తున్న  పారిశ్రామికవేత్తలు 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీల విషయంలో పారిశ్రామికవేత్తల నుంచి ఆశించిన స్పందన కరవు అవుతోంది. విశాఖను ఐటీ హబ్‌గా చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ఐటీ కంపెనీల యజమానులతో ఓ సమావేశాన్ని విశాఖలో ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు యజమానులు తమ అసంతృప్తిని సీఎం ఎదుటే వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలను కల్పించకుండా తమను రమ్మనడం భావ్యం కాదని కరాఖండీగా చెప్పేశారు. 200 నాటి పరిస్థితులే ఇపుడు ఉన్నాయని, కనీసం విద్యుత్ నిరంతరంగా సరఫరా చేసే పరిస్థితి లేదని వాపోయారు. ఇక, ఐఐటీ కోరితే ఐఐఎం ఇస్తున్నట్లుగా సీఎం అసెంబ్లీలో ప్రకటించడం పట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలలోనే అసంతృప్తి ఉంది. అలాగే, జిల్లాలో కేంద్ర విద్యా సంస్ధలు వస్తాయన్న ప్రచారం తప్పించి ఇంతవరకూ ఆ దాఖలాలు లేవు. రైల్వే జోన్ సంగతి కూడా అతీ గతీ లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో బాబు జిల్లాకు వచ్చిన ప్రతీ సారీ పాత హామీలనే వల్లె వేస్తున్నారన్న నిర్వేదం కూడా జనంలో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కూడా పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. వీలుంటే విశాఖ జిల్లాలోనే తమ పెట్టుబడులు పెట్టాలని పలువురు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తేనే తప్ప విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పారిశ్రామిక కళ కనిపించేట్టు లేదన్నది నిజం.

రాజకీయ కోణంలోనే…

బాబు సీఎం హోదాలో చేస్తున్న పర్యటనలు అన్నీ రాజకీయ కోణంలో నుంచే చూడాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ విజయ కేతనం ఎగురవేసినా అంతే స్దాయిలో వైసీపీ కూడా బలంగానే ఉంది. బీజేపీతో పొత్తు, నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ పట్ల ఉన్న మోజు టీడీపీకి సీట్లు, ఓట్లు అందించాయి. అయినా సరే, చాలా నియోజకవర్గాలలో వేయి నుంచి అయిదు వేల ఓట్ల తేడాతో వైసీపీ ఓటమి చవి చూసింది. ఆ పార్టీకి ఈ మూడు జిల్లాలలో బలమైన నాయకులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి ఉద్దండులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి సాంబశివరాజు, సీనియర్ నేతలు సుజయకృష్ణ రంగారావు, రాజన్న దొర వంటి వారు కొమ్ము కాస్తున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ, కరణం ధర్మశ్రీ వంటి వారు అండగా ఉన్నారు. టీడీపీకి ఎన్నికల నాటి ఆదరణ ఇపుడు లేదు, నాలుగు నెలల వ్యవధిలో ఆ పార్టీ గ్రాఫ్ బాగా తగ్గుతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటి విషయాలలో బాబు హామీలు నెరవేర్చుకోకపోవడంతో పల్లెలలో అసంతృప్తి రేగుతోంది. ఇది మరింత ముదిరితే ప్రత్యర్ధి వైసీపీకి బాగా లాభిస్తుంది.

దాంతో, బాబు టీడీపీకి ఉత్తరాంధ్రను దూరం కాకుండా చేసుకోవడానికే తరచూ పర్యటనలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఆయన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇంకా అమలుకాలేదు, ఆయన ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెప్పిన మాటనే చెబుతూ పోతే రానున్న రోజులలో జనం నమ్మే పరిస్థితి ఉండదని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే వాపోతున్నారు. ఆర్భాటపు హామీలతో ఎంతకాలం జనాన్ని మభ్యపెట్టగలమని, నిర్ధిష్ట కార్యాచరణ ద్వారానే వారి మనసులను గెలుచుకోగలమని తలపండిన తమ్ముళ్లు సూచిస్తున్నారు. ఏది ఏమైనా బాబు మాత్రం సీఎం హోదాలో నోట్లోనే బూర్లు వండే కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇచ్చిన హామీలలో కొన్ని అయినా కార్యరూపం దాల్చకపోతే ఇబ్బడి ముబ్బడిగా ప్రజా వ్యతిరేకత చెలరేగితే దానికి బాబు తప్ప ఇంకెవరూ బాధ్యులు కారన్నది నిజం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం