మొబైల్స్ పనిచేయడంలేదు.. కరెంటు లేదు.. పెనుగాలులు, భారీ వర్షం విశాఖను అతలాకుతలం చేసేస్తున్నాయి. విశాఖ నగరంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. మీడియాకి సైతం అన్ని ప్రాంతాల నుంచీ సమాచారం అందని పరిస్థితి. హుద్‌హుద్ తుపాను బీభత్సం గురించి ‘అలా.. ఇలా..’ అనే వార్తలు తప్ప, పరిస్థితి ఎలా వుందో ఎవరికీ తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది.
తుపాను బీభత్సం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం అంచనా వేసినదానికన్నా నష్టం అత్యంత తీవ్రంగా వుందని స్థానికుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తుపాను ‘ఐ’ తీరాన్ని రెండున్నర గంటల సమయంలో దాటినా, పూర్తిగా తుపాను తీరాన్ని దాటడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో విధ్వంసం మాత్రం యధాతథంగా కొనసాగుతోందనే చెప్పాలి.
ఉదయం నుంచీ కొనసాగిన తుపాను బీభత్సం మధ్యాహ్నం సమయంలో కాస్త తగ్గింది. తుపాను ‘ఐ’ తీరాన్ని తాకే సమయంలో కాస్సేపు ఈ ప్రశాంతత వుంటుందని అధికారులు ముందు నుంచీ చెబుతున్నారు. కాస్త పరిస్థితి తెరిపిన పడిందన్న కోణంలో సాధారణ ప్రజానీకం రోడ్లమీదకు వచ్చే ప్రయత్నం చేయడం.. ఆ వెంటనే మళ్ళీ గాలులు, వర్ష బీభత్సం పెరగడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.
ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. అయితే తుపాను పూర్తిగా తీరం దాటితేనే పరిస్థితి ఎలా వుందన్నదానిపై ఓ అంచనాకి రావొచ్చు. అప్పటిదాకా విశాఖ నగరంలో పరిస్థితేంటన్నదానిపై ఊహాగానాలే తప్ప స్పష్టమైన సమాచారం అందే అవకాశం కన్పించడంలేదు. విశాఖ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని ఘోర విపత్తు ఇది.