పేరు : తీగల కృష్ణారెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థి. (గెలిచే పార్టీ ఏదైనా సరే, నిన్నటి వరకూ తెలుగుదేశం అనుకున్నాను: ఇప్పుడు టీఆర్‌ఎస్ అనుకుంటున్నాను.)
ముద్దు పేర్లు : ‘గౌనుల’ కృష్ణారెడ్డి.(నేను మేయర్ గా వున్నప్పుడు, ఎప్పుడూ ‘గౌను’లోనే వుండేవాడిని. ఎయిర్ పోర్టు( అప్పుట్లో హైదరాబాద్‌లో వుండేది, బేగంపేట ఎయిర్ పోర్టు లెండి)కు ఎవరు వచ్చినా, గవర్నర్ తో పాటు, అప్పటి మేయరు గా నేను కనిపించే వాడిని. ‘మీసాల’ కృష్ణారెడ్డి (ఆంధ్రలో కనుమూరి బాపిరాజుకీ, నాకూ మీసాల మీద పేటెంటు హక్కు వుంది.)
‘విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ‘చేంజింగ్ కండువాస్’( బిసికె). నిన్న పచ్చకండువా; నేడు పసుపు కండువా.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను పెంచుకున్న మీసాలను ఇంగ్లీషులో ‘హ్యాండిల్ బార్’ మీసాలు. హ్యాండిల్ బార్ దేనికి వుంటుంది చెప్పండి. అవును. ‘సైకిల్’ కే. కానీ ఇప్పుడు సైకిల్ దిగి ‘కారు’ ఎక్కాను కాబట్టి, ‘స్టీరింగ్’ మీసాలు ట్రై చేయాలేమో!
రెండు: విమర్శకు, ప్రశంసకు తేడా తెలీదు. కొన్ని రోజుల క్రితమే కేసీర్ ‘తెలంగాణ వాదాన్ని అమ్మేశారు’ అని అన్నాను. ఇప్పుడు ‘తెలంగాణ వాదాన్ని నమ్మేశారు’ అంటున్నాను. ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు నేను మాట మార్చానంటే..!?
సిధ్ధాంతం : నాకు రాష్ర్టపతి పదవి కన్నా, గవర్నర్ పదవి కన్నా, ‘మేయర్ ’ పదవే కీలకం. దానికోసమే నేను పుట్టాననుకుంటాను. దానిని అందుకోవటానికి వెళ్ళాలంటే, ఏది వేగం వెళ్ళాలంటే, అది ఎక్కి వెళ్ళాలి. అదే మన సిధ్ధాంతం. కాంగ్రెస్‌లో వుంటే ‘చేతులూ’పుకుంటూ వెళ్ళొచ్చు. తెలుగుదేశంలో వుంటే ‘సైకిల్’ తొక్కుకుంటూ వెళ్ళవవచ్చు. అదే టీఆర్‌ఎస్‌లో వుంటే ‘కారె’క్కి వెళ్ళవచ్చు. ఇంకా ‘హెలికాప్టర్’ ఎన్నిక గుర్తు వున్న పార్టీ ఏదీ రాలేదు.. ఉంటే అప్పుడు మళ్ళీ అలోచించాల్సి వుంటుంది.
వృత్తి : గౌరవం పొందటం. హైదరాబాద్ ఎవరు వచ్చినా, గవర్నర్ తో పాటుగా గౌరవం పొందేది మేయర్. ఒక్కసారి ఈ వృత్తి చేపట్టాక, ఎవరు గౌరవం ఇవ్వక పోయినా నచ్చదు. కడకు చంద్రబాబు గౌరవం ఇవ్వకపోయినా నాకు నచ్చదు, కాక నచ్చదు.
హాబీలు :1. బోధించటం ఇష్టం. పాఠాలు కాదు; గుణ పాఠాలు. నాపేరు మీదనే కళాశాల వుంది. చంద్రబాబు చెప్పింది గుణపాఠమే.
2.పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించటం. నాతో పాటు చదువుకున్న సహ విద్యార్థులను నేను ఎప్పుడూ మరచిపోను. నేనూ, కేసీఆర్ ‘ఎన్టీఆర్ ట్రస్ట్’ లో కలసి ఒకే ‘సిలబస్’ చదువుకున్నాం. ఆయన ఇప్పుడు ‘ఓల్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడదాం కృష్ణా’ అంటే వెళ్ళాను. నా కన్నా ముందు తుమ్మల వెళ్ళాడు.
అనుభవం : రాజకీయాలు ‘లోకాన్ని’ చూసికున్న నేర్చుకున్న అపారమైన అనుభవం వుంది. ఇప్పుడు హఠాత్తుగా ‘లోకేష్’ ను చూసి నేర్చుకోమంటే ఎలావుంటుంది. (తెలుగుదేశం వ్యవహరాలను తెలంగాణలో లోకేష్ చూస్తాడంటే, దాని అర్థం అదే కదా!)
మిత్రులు : గుడికి వెళ్ళకముందే,ఎదురు వచ్చి చెవిలో ‘గులాబీ’ పెట్టే వాళ్ళు.
శత్రువులు : గోడ సగం దూకి వెనక్కి వచ్చి, పూర్తిగా దూకిన నా లాంటి వాళ్ళను చూసే వెక్కిరిస్తారే… వారే! ( టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళబోయిన మానుకున్న ఎర్రబెల్లిని గురించి కాదు సుమా!)
మిత్రశత్రువులు : నేను చేరిన పార్టీలో మేయర్ పదవికి పోటీ పడేవాళ్ళు..
వేదాంతం : ‘వారు మేస్తారు, వీరు మేస్తారు’ అని నేతల మీద ఆరోపణలు వుండేవి. కానీ నాకు మాత్రం అన్ని పార్టీల వారూ వీరు ‘మేయరు’ అని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఇదే నా జీవిత వేదాంతం.
జీవిత ధ్యేయం : ‘మేయరు’ గా హ్యాట్రిక్ చెయ్యాలి.
-సర్