చిరంజీవితో సినిమా తీసేదెవరు.?

వినాయక్‌, పూరి జగన్నాథ్‌, రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి.. ఒకరేమిటి చిరంజీవితో సినిమా చెయ్యాలని ఒకప్పుడు కోరుకోని దర్శకుడే లేరు. చిరంజీవి 150వ సినిమా చేస్తే అది తన దర్శకత్వంలోనేనని గతంలో వినాయక్‌ ప్రకటించేసుకున్నాడు. ‘అవును,…

వినాయక్‌, పూరి జగన్నాథ్‌, రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి.. ఒకరేమిటి చిరంజీవితో సినిమా చెయ్యాలని ఒకప్పుడు కోరుకోని దర్శకుడే లేరు. చిరంజీవి 150వ సినిమా చేస్తే అది తన దర్శకత్వంలోనేనని గతంలో వినాయక్‌ ప్రకటించేసుకున్నాడు. ‘అవును, వినాయక్‌ డైరెక్షన్‌లో చేస్తా..’ అని చిరంజీవి కూడా చెప్పారు. కానీ, ఆ సినిమా సెట్స్‌ మీదకు రాలేదు. అంతకు ముందు వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే.

ఇక, చిరంజీవి ` వినాయక్‌ కాంబినేషన్‌లో సినిమాకి అప్పుడే రూపకల్పన చేశారు పరుచూరి బ్రదర్స్‌. కానీ ఏం లాభం.? రాజకీయాలపై మోజుతో చిరంజీవి, సినిమాల్ని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా చిరంజీవికి పని లేకుండా పోయింది. ఆయన ఇప్పుడు కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే. దాంతో, చిరంజీవి మళ్ళీ సినిమాలపై దృష్టిపెట్టారట.

కాగా, చిరంజీవి 150 తానే తీస్తానంటున్నాడు రచయిత చిన్నికృష్ణ. ‘ఇంద్ర’ సినిమాకి కథ అందించింది ఈయనగారే. కానీ, ఇప్పుడు చిన్నికృష్ణ కెరీర్‌ ఏమంత గొప్పగా లేదు. మరోపక్క, మణిరత్నంతో చిరంజీవి టచ్‌లో వున్నారన్న ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్‌ కూడా, చిరంజీవి కోసం ఓ కథ తయారు చేసుకున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. వర్మ సంగతి సరే సరి. చిరంజీవితో సినిమా చేస్తా.. అనేది పబ్లిసిటీ స్టంట్‌గానే మిగిలిపోయింది వర్మ విషయంలో.

ఇంతకీ చిరంజీవి 150వ సినిమా చేస్తున్నట్టా.? లేదా.? చిరంజీవి ఊ… అనాలేగానీ సినిమా నిర్మించడానికి ఆయన కుమారుడు చరణ్‌ రెడీగా వున్నాడు.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ కూడా ‘సై’ అనేందుకు సిద్ధంగా వుంది.. బోల్డంతమంది నిర్మాతలూ వున్నారు. కానీ చిరంజీవే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇంకో ఐదేళ్ళకైనా ఈ సస్పెన్స్‌కి తెరపడ్తుందో లేదో.!