టాలీవుడ్ లో వంశం..పరువు ప్రతిష్ట, మడమ తిప్పకపోవడం వంటి పదాలు వాడడంలో నందమూరి వంశీకుల తరువాతే ఎవరైనా. ఆ పదాలన్నింటిపై పేటెంట్ హక్కులు వారివే,. మనం సినిమా తరువాత టాలీవుడ్ పెద్దల ఆంతరంగిక మాటల్లో, చర్చల్లో నందమూరి బ్రదర్స్ వ్యవహారాలు వస్తున్నాయట. అంతమంది పిల్లల్ని కన్నా, వారు ఎన్టీఆర్ కోసం చేసింది ఏమీ లేదు.
నాగ్ ఒక్కడు న భూతో న భవిష్యత్ అన్నట్లు ఎఎన్నార్ కు ట్రిబ్యూట్ ఏర్పాటు చేసాడు. పోనీ సినిమా తీయకపోయినా, కనీసం ఆయన పేరిట అవార్డు పెట్టడమో, ఎప్పుడైనా ఫంక్షన్ చేయడమో లాంటివి ఏవీ జరగలేదు. పైగా ఎన్టీఆర్ ఘాట్ కూడా ప్రభుత్వమే నిర్మించింది. వారు చేసేదల్లా అడపా దడపా వెళ్లి నివాళి అర్పించి రావడమే.
నాగ్ అక్కినేనితో చివరి సినిమా తీయడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ దాన్ని సినిమా రంగంలోని దాదాపు ప్రతి ఒక్కరికి చూపించడం, అందుకోసం ఎఎన్నార్ పెయింటింగ్ లు వేయించడం, ఇలా ప్రతి ఒక్కటి ఓ కొడుకు బాధ్యతను ఎత్తిచూపాయి. ఆఖరికి మెమోరియల్ గురించి కూడా నాగ్ తానే స్వయంగా చేస్తానని చెప్పడం విశేషం.
నిజానికి నాగ్ అడిగితే ప్రభుత్వం కాదనదు. ఎందుకంటే తెలుగువారు గర్వించదగ్గ నటుల్లో అక్కినేని ఒకరు. అందువల్ల ఏ విజయవాడ, గుడివాడలోనో ఓ మెమోరియల్ నిర్మించడం చంద్రబాబు ప్రభుత్వానికి చిటికెలో పని. కానీ ఓ కొడుకుగా తానే అది కూడా చేయాలనుకోవడం నాగ్ కు మరింత గౌరవాన్ని పెంచుతుంది.
ఇదంతా ఇప్పుడెందుకు చెప్పడం అంటే 28న మహానుభావుడు ఎన్టీఆర్ జయంతి. ఇప్పటికైనా అంతమంది కొడుకులు వున్నారు. ఏదైనా మంచి కార్యక్రమం తలపెడితే మంచిది. కొడుకు ఎమ్మెల్యే. అల్లుడు ముఖ్యమంత్రి. కూతురు మాజీ కేంద్ర మంత్రి. అందరూ మహా మహులే. కానీ జరిగే కార్యక్రమమే కనిపించదు.