ఆంధ్రకు రాజధాని ఎక్కడో తేల్చడానికి కేంద్రం ఒక కమిటీ వేసింది. అది రాష్ట్రమంతా తిరిగి వివరాలు సేకరించి, సాధ్యాసాధ్యాలు బేరీజు వేస్తోంది. ఈ లోపునే విజిఎంటి (విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి) ప్రాంతంలోనే రాజధాని అని యిప్పటికే నిర్ణయమై పోయిందని పేపర్లు రాసేస్తున్నాయి. చంద్రబాబు చర్యలు కూడా ఆ మాట నిజమే అనిపించేట్లు చేస్తున్నాయి. కమిటీలనేవి సూచనలు మాత్రమే చేస్తాయి. నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి. శ్రీకృష్ణ కమిటీ ఎంతో అధ్యయనం చేసింది, ఎన్నో సూచనలు చేసింది. ప్రభుత్వం పట్టించుకుందా? అసలు పార్లమెంటు సభ్యులకు చదవడానికైనా యిచ్చిందా? ఇప్పుడు ఆంధ్రలో ఏర్పడినది టిడిపి ప్రభుత్వం. వాళ్లు ఏం తలచుకుంటే అదే చేయగలుగుతారు. ఎక్కడ కావాలంటే అక్కడ రాజధాని పెడతారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని పెట్టి, అనంతపురంలో రెండో రాజధాని పెట్టి రాయలసీమవాసులను తృప్తి పరుస్తారని మరో న్యూస్. అసలు ఒక రాజధాని కట్టడానికే డబ్బుల్లేక ఛస్తూంటే, రెండు రాజధానులు ఎలా కడతారో నాకు అర్థం కాదు. రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట పెట్టడమే సబబైన పని.
1953లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేసి, హైకోర్టు గుంటూరులో పెట్టారు. అప్పుడు రాజధాని మాకు కావాలని విజయవాడ వాసులు చాలా ఆందోళన చేశారు. అప్పట్లో అది కమ్యూనిస్టు కంచుకోట కాబట్టి స్వతహాగా కాంగ్రెసువాదియైన ప్రకాశం గారు పెట్టనివ్వలేదని కమ్యూనిస్టులు ఆరోపిస్తూ వుంటారు. నేనూ కొంతకాలం దాన్ని నమ్మేవాణ్ని. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే కొన్ని వాస్తవాలు తట్టాయి. అప్పుడూ వాంఛూ కమిటీ వేశారు. వాళ్లూ కొన్ని సిఫార్సులు చేశారు. కమిటీలో వున్నవారికి రాజకీయవాస్తవాలు పట్టవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యాక్సెసబిలిటీ వంటి విషయాలే చూస్తారు. కానీ నాయకుడికి ప్రజాభీష్టం కూడా ముఖ్యం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి పూర్వం జరిగిన విషయాలు మనసులో పెట్టుకునే రాజకీయపరమైన ఆలోచన చేసి ప్రకాశం గారు కర్నూలుని రాజధానిగా ప్రకటించారు. ఉన్న విషయం ఏమిటంటే కోస్తా ప్రజలంటే – ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్లంటే – యితర ప్రాంతాల వాళ్లకు బెదురు. వాళ్లలో చురుకుదనం, చొరవ ఎక్కువ. కొత్త ప్రాంతాల్లో కూడా చొచ్చుకుపోయి ఉద్యోగాలు సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు, ఆస్తులు కూడబెడతారు, తద్వారా యిరుగుపొరుగులో అసూయ రేకెత్తిస్తారు. కొంతకాలానికి వారిని డామినేట్ చేయాలని చూస్తారు. ఇవన్నీ వ్యక్తిగత లక్షణాలే కానీ ఒక ప్రాంతానికి చెందిన చాలామందిలో యీ సామాన్యలక్షణం (కామన్ ఫ్యాక్టర్) కనబడేసరికి దాన్ని ఆ ప్రాంతానికి, లేదా కులానికి ఆపాదిస్తారు. బెంగాలీలు కళాప్రియులు, గుజరాతీలు వ్యాపారగుణం కలవారు, తమిళులు పొదుపరులు… యిలా బ్రాండ్ చేయడానికి యిదే కారణం.
కోస్తా వారికి, పంజాబీవారికి పోలికలు కనబడతాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కష్టపడి పనిచేయడం, ఖర్చుపెట్టడం, డాబు ప్రదర్శించడం, తమ ఉనికిని చాటుకోవడం.. యిలా అనేక లక్షణాలున్నాయి. వారి వలన వారున్న ప్రాంతాల్లో ఎకనమిక్ బయాన్సీ (ఆర్థికపరమైన చురుకుదనం) వస్తుంది. విభజన తర్వాత కోస్తావాసులు హైదరాబాదు విడిచివెళ్లిపోతే అక్కడి బయాన్సీ తగ్గుతుందేమోనన్న భయం అందుకే కలుగుతోంది. రియల్ ఎస్టేటు రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్రేషన్, ఎక్సయిజ్ ఆదాయం వగైరా యిప్పటికే తగ్గాయట. హోటల్స్, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ పై ప్రభావం మరింత తీవ్రంగా వుండబోతుంది. నార్త్ నుంచి ఎవరైనా వచ్చి భర్తీ చేస్తే ఆ లోటు కొంతమేరకు తీరవచ్చు.
కోస్తావాళ్లు యితర ప్రాంతాలకు వెళ్లి డామినేట్ చేస్తారన్న భయం వుండడం చేతనే రాయలసీమవాసులు వారితో కలిసి ఆంధ్రరాష్ట్రంగా విడిపోవడానికి యిష్టపడలేదు. మేం మద్రాసులోనే వుండిపోతాం అన్నారు. అప్పుడు వాళ్లని కోస్తా నాయకులు బతిమాలి, బామాలి మాతో రండి, మేం డామినేట్ చేయం అని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందం కాశీనాథుని నాగేశ్వరరావుగారి యింట్లో జరిగింది. ఆ యింటికి పేరు శ్రీ బాగ్. అందువలన దాన్ని 'శ్రీబాగ్ ఒప్పందం' అన్నారు. కాంగ్రెసువారు చేసుకునే అనేక ఒప్పందాల లాగానే దీన్నీ అటకమీద పడేశారు. రాయలసీమలో ఏ నాయకుడైనా రాజకీయంగా నిర్వ్యాపారంగా వుంటే వెంటనే 'శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలి, లేకపోతే రాయలసీమవాసులం విడిపోతాం' అంటూ నిరసన చేస్తూ వుంటారు. ఎన్టీయార్ సిఎంగా వున్నపుడు రాజకీయంగా ఆయన్ని ఎదుర్కోలేక వైయస్సార్ రాయలసీమ ఉద్యమం నడిపారు. మొన్నటికి మొన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డికి కూడా ఆ శ్రీబాగే అందివచ్చింది.
రాయలసీమ వాసులకు యీ భయాలెందుకు, కావాలంటే వాళ్లూ కోస్తా వాళ్లలా వుండవచ్చు కదా అని సులభంగా అనవచ్చు. నిజానికి వాళ్లు మద్రాసు, బెంగుళూరు, బొంబాయిలకు వెళ్లి అనేక వ్యాపారాలు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. తమ ప్రాంతాల్లో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే అడలగొట్టి పంపేసిన సందర్భాలూ వున్నాయి. తెలంగాణలో యిటువంటి సమస్య లేకపోవడం చేతనే అన్ని జిల్లాల వారూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. రాయలసీమవాసుల మనోభావాలు తెలిసిన ప్రకాశం గారు అందుకే కర్నూలును రాజధానిగా ఎంచుకుని వారిని శాంతింపచేశారు. అయితే విజయవాడవాళ్లు కోపగించుకున్నారు. అక్కడున్న ప్రకాశం గారి విగ్రహం పగలకొడతామని ప్రకటించారు. ఆ ముక్క ప్రకాశం గారికి చెపితే ఆయన శాంతంగా ''పగలకొట్టుకోమను. అది పెట్టమని నేనడిగానా? వాళ్ల యిష్టం కొద్దీ పెట్టుకున్నారు, యిప్పుడు వద్దనుకుంటే మానేయమను.'' అన్నారు. సరే ఎంతైనా కర్నూలు తాత్కాలిక రాజధానే కదా అని విజయవాడవాసులు చల్లబడ్డారు.
ఇప్పుడు మళ్లీ ఆనాటి ఆంధ్రరాష్ట్రం తిరిగి వచ్చింది. ఈ సారి ఛాన్సు పోగొట్టునీయకూడదని పట్టుదలపై వున్నారు. దానికి తోడు అక్కడివాళ్లు ఆదరించిన టిడిపియే అధికారంలోకి వస్తోంది. అందువలన అక్కడే రాజధాని అనే మాట బలంగా వినబడుతోంది. అది ఎంతవరకు అభిలషణీయం? అన్నదానిపై ఆలోచిస్తే – విజయవాడ, గుంటూరు ప్రాంతాలు యిప్పటికే అభివృద్ధి చెందినవి. విజయవాడకు లొకేషనల్ ఎడ్వాంటేజి చాలా వుంది. అక్కణ్నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లగల రవాణా సౌకర్యం వుంది. రైళ్లకు, రోడ్లకు కూడలి. వ్యాపారపరంగా అక్కడ ఎంతో బిజినెస్ జరగబోతోంది. రాష్ట్రం విడిపోయాక అన్ని కంపెనీలు తమ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను విజయవాడలో పెట్టవచ్చు. ఎందుకంటే అక్కణ్నుంచి గూడ్సు రైలు ద్వారా ఎక్కడికైనా అతి త్వరగా వస్తువులు చేరవేయవచ్చు. రోడ్డు ద్వారా పంపాలంటే నేషనల్ హైవే ఎలాగూ వుంది. ఇక బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాను ప్రోత్సహిస్తే మరీ మంచిది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వుంది. ఎక్కడికైనా డైరక్టు ట్రెయిన్ దొరక్కపోతే విజయవాడకు వచ్చేసి ఎలాగోలా వెళ్లిపోవచ్చు. పొరుగు రాష్ట్రాలకు కూడా. ఈ రకమైన సౌలభ్యం మరే నగరానికీ లేదు. – (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)