పవన్ కళ్యాణ్ కు జనం అమాయకుల్లా కనిపిస్తున్నారో, లేక ఆయనే అమాయకుడో అని అనుమానంగా వుంది. ఎందుకంటే బలవంతంగా భూ సేకరణ వద్దు, రెండు మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకోవద్దు అని గతంలోనూ అన్నారు ఇప్పుడూ అన్నారు. భలే కామెడీగా వుంది ఈ స్టేట్ మెంట్. రాజధాని ప్రాంతంలో భూములు నూటికి యాభై మందికి పైగా బలవంతంగానే ఇచ్చారని మీడియా కోడై కూసింది. దాని మీద కొన్ని గొడవలు కూడా జరిగాయి. కానీ గతంలోనూ, ఇప్పుడూ కూడా బలవంతంగా తీసుకోవద్దు అనడం తప్ప పవన్ చేసిందేముంది? అంత ప్రేమ పండిపోతే, రాజధాని ప్రాంతంలో ఓ వారం పర్యటించి,. ఎవరి దగ్గర బలవంతంగా తీసుకున్నారో, ఎవరి దగ్గర ఇష్ట పూర్వకంగా తీసుకున్నారో, తనే స్వయంగా తెలుసుకోవచ్చుగా. అప్పుడు వస్తుంది మజా..పవన్ కు షాక్ కొట్టే నిజాలు తెలుస్తాయి. కానీ ఆయన ఆ పని చేయరు. తను వున్నాను అని గుర్తు చేయడానికి మాత్రం, లేస్తే మనిషిని కాను అనే టైపు ప్రకటనలు పడేస్తుంటారు. జనాలు వీటిని నమ్మి, మా పవన్ బాబు దేవుడు అనేసుకునేంత అమాయకులు కారు. బలవంతంగా భూములు పోయిన వారి కన్నీళ్లను పవన్ ప్రకటనలు తుడవలేవు.
ఇది సరే, రెండు మూడు పంటలు పండే భూములు బలవంతంగా తీసుకోవద్దు. ఇదో స్టేట్మెంట్..కండిషన్స్ అప్లయ్ అనే ప్రకటనల్లా. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు వున్నాయి. రెండు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరుతో నాశనం చేయవచ్చా? దానికి పవన్ ఓకెనా? కాదు అంటే, ఆయన ప్రకటన మారాలి. తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్పాలి కానీ, బలవంతంగా తీసుకోవద్దు అనడం కాదు. ప్రభుత్వం మేం బలవంతంగా తీసుకోలేదు. వాళ్లే ఇచ్చారనే అంటుంది.
అసలు సేకరణ వద్దు అంటారు పవన్. ప్రభుత్వానికి కూడా సేకరణ ఇష్టం లేదు. దానికీ సమీకరణే కావాలి. అందుకే కోర్టుకు సమీకరణ ఆపేసాం..ఇక సేకరణే అని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంకా లోపాయికారీగా సమీకరణే సాగిస్తోంది. 20 అంటూ తాజా తేదీ ప్రకటించింది. ఈ తేదీ కూడా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. పాతిక ముఫై వేల ఎకరాలు అని చెప్పి, దానికి డబుల్ గా తీసుకుంటోంది. ఇవన్నీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలు. కానీ పవన్ కే తెలియవో? లేక తనకు తెలియవని, ప్రజలను నమ్మించ చూస్తున్నారో?
దీని ఫలితం ఇప్పుడు తెలియదు జనసేన అధిపతికి..భవిష్యత్ లో ఎన్నికలు వచ్చినపుడు తెలుస్తుంది. అంతవరకు ఆయన ఇలా అటుఇటు కాని ట్వీట్ లు చేసుకుంటూపోతే, ఇక అంతే సంగతులు.