రెండు రాష్ట్రాల మధ్య ‘రసగుల్లా’ వార్…

విద్యుత్ కాంతుల కోసమో, నదీజలాల కోసమో, స్వదేశీ నిధుల కోసమో, విదేశీ పెట్టుబడుల కోసమో… పోరాడే రాష్ట్రాలు మనకు కొత్త కాదు. అయితే అలాంట గొడవల గురించి వినీ వినీ విసిగిపోయిన వారికిది ‘తియ్యని’కబురే.…

విద్యుత్ కాంతుల కోసమో, నదీజలాల కోసమో, స్వదేశీ నిధుల కోసమో, విదేశీ పెట్టుబడుల కోసమో… పోరాడే రాష్ట్రాలు మనకు కొత్త కాదు. అయితే అలాంట గొడవల గురించి వినీ వినీ విసిగిపోయిన వారికిది ‘తియ్యని’కబురే. ప్రస్తుతం భారతదేశంలోని రెండు రాష్ట్రాల మధ్య … రసగుల్లా అనే స్వీట్ గురించి వార్ జరుగుతోంది. అదేంటి? కావాలంటే చెరోటి కొనుక్కోని తినొచ్చుగా అని అమాయకులెవరైనా భావిస్తే ‘రస’ంలో కాలేసినట్టే. మిఠాయి ప్రియులకు తలచుకోగానే నోరూరించే ఈ స్వీట్… రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయిన వైనం వెనుక…

 వచ్చేను మావల్ల… నవ‘రస’గుల్లా…

అదండీ సంగతి. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన రసగుల్లాను మేం కనిపెట్టామంటే… మేం కనిపెట్టామని, దాని మీద సర్వహక్కులూ మావంటే మావంటూ కొట్టుకుంటున్నాయి ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు. మనకు తెలిసినంతవరకూ బెంగాలీ స్వీట్స్ అంటే రకరకాల రసగుల్లాలకు కేరాఫ్ అని. తెల్లవి, రంగు రంగుల్లో ఉండే బుల్లి బుల్లివి… ఇంకా చాలా రకాలుగా రసాలూరే వెరైటీలున్నాయని.  అయితే ఒడిషాలో దీని మూలాలుంటాయని ఆ రాష్ట్రం వాదిస్తోంది. ఇప్పడు అంత అర్జంటుగా దీని మీద హక్కుల కోసం పోరాటం ఎందుకు వచ్చిందయ్యా అంటే… దీనికో కారణం ఉంది. గత 2010లో ఈ స్వీట్‌కి ‘నేషనల్ డిసర్ట్’ అనే గుర్తింపు వచ్చింది. అవుట్‌లుక్ మేగ్‌జైన్ కోసం ముద్ర నిర్వహించిన సర్వే దీనికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. వెంటనే ఈ స్వీట్ తమదే అంటూ ఒడిషా ప్రముఖులు ప్రకటించారు. దీనికి వారు కొన్ని భౌగోళిక నిదర్శనాలు కూడా చూపెట్టారు.

 క్రియేటివ్ ‘వార్’సత్వం…

ఒడిషా వాదనతో ఉలిక్కిపడిన పశ్చిమబెంగాల్… కాదు కాదు ఇది మాదే అంటోంది. ‘‘దాదాపు 700 ఏళ్ల క్రితం దీన్ని డచ్, పోర్చుగీస్ జాతీయులు బెంగాల్ సంప్రదాయ పాకశాస్త్ర విధానాన్ని అనుసరించి కనిపెట్టారు అంటూన్నారు అనిమిక్ రాయ్. రగగుల్లాను కొలంబస్ ఆఫ్ రసగుల్లాగా పేరొందిన నోబిన్ చంద్రదాస్ సృష్టించారని బెంగాల్ ప్రాంతంలో చాలా మంది నమ్మే విషయం… ప్రస్తుతం ఆయన వారసుల్లో ఒకరైన అనిమిక్ రాయ్… రసగుల్లాపై తమ పట్టును నిలబెట్టుకోవడం కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు చరిత్రకారులు… పూరి జగన్నాధుడిని సైతం రసగుల్లా వివాదంలోకి లాక్కొచ్చేశారు. పూరిలోని జగన్నాధుని ఆలయం వెలుగు చూసిన దగ్గర్నుంచి, రధయాత్ర సందర్భంగా రసగుల్లాకు ప్రాధాన్యత ఉందని, దాదాపు 300 ఏళ్ల క్రితమే జగన్నాధుడు తన దేవేరి లక్ష్మిదేవికి రధయాత్ర అనంతరం నిర్వహించే నీలాద్రి బిజే పండుగ రోజున దీన్ని అందించాడనే పౌరాణి క మూలాలున్నాయంటున్నారు. 

బెంగాల్‌వారు చెబుతున్నదానికంటే 150 ఏళ్లకు ముందే ఇది ఒడిషాలో పుట్టిందని బ్రాహ్మిణ్ ఒడియా వంటవాళ్లు దీని తయారీ విధానాన్ని ఆవిష్కరించారని సాంస్కృతిక చరిత్రకారుడు అసిత్ మహంతి అంటున్నారు. ఓ పక్క ఈ వాదోపవాదాలు రోజు రోజుకూ ముదురుతుంటే… రసగుల్లా తమదేనంటూ నిరూపించుకునే అస్త్రశస్త్రాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖలు సిద్ధం చేస్తున్నాయి. ఒడిషాకు చెందిన పహలా రసగుల్లా అనే సంస్థ, బెంగాల్ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్వీట్ మీట్ ఛెయిన్ కెసి దాస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఈ పనిలో వీటికి బాసటగా నిలుస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి కంబైన్డ్‌గా హక్కులు పంచుకోవచ్చుగా అని కొందరు సూచిస్తున్న నేపధ్యంలో నోరూరించే రసగుల్లా… ఎవరిదో తేలాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో… ఎన్ని సంవత్సరాలే పడుతుందో… వాళ్ల గొడవ వాళ్లకి వదిలేసి ఈలోగా మనం మాత్రం హ్యాపీగా రసగుల్లాలు లాగించేద్దాం…

 -ఎస్బీ