సారీ చెప్పిన సత్య నాదెళ్ళ

మహిళల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎవరైనాసరే.. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. మంచే చెప్పాలనుకున్నా… తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం వుంది. మహిళల విషయంలో అనే కాదు, ఇటీవలి కాలంలో ఏ విషయమై తమ…

మహిళల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎవరైనాసరే.. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. మంచే చెప్పాలనుకున్నా… తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం వుంది. మహిళల విషయంలో అనే కాదు, ఇటీవలి కాలంలో ఏ విషయమై తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పాలని ఎవరు ప్రయత్నించినా ఏదో ఒకరకంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కారణాలు అనేకం. ప్రతి విషయాన్నీ మీడియా వివాదాస్పదం చేయడం వల్లే.. అనే వాదన ఇందులో ప్రముఖమైనది.

అసలు విషయమేంటంటే, వేతనాల పెంపు విషయమై ధైర్యంగా అడగలేని మహిళా ఉద్యోగులకు మీరిచ్చే సలహా ఏంటి.? అని మైక్రోసాఫ్ట్‌ సీఈఓని ఎవరో అడిగితే, దానికి ఆయన సమాధానమిస్తూ, ‘వారి పని వారు ధైర్యంగా చేసుకుంటూ వ్యవస్థ మీద నమ్మకం వుంచితే సరిపోతుంది.. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి..’ అని అన్నారు. అంతే, సామాజిక మాధ్యమాల ద్వారా అయ్యగారి మీద విమర్శలు ఎడా పెడా దూసుకెళ్ళాయి. ఇక చేసేది లేక సత్య నాదెళ్ళ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

‘నా అభిప్రాయం తప్పు’ అంటూ మహిళా లోకానికి సత్య నాదెళ్ళ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఎదిగిన విషయం విదితమే. ఇటీవలే ఆయన హైద్రాబాద్‌కి వచ్చి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.