ఏపీ మంత్రి ఆర్కే రోజాకు లౌక్యం తెలియదు. నమ్మిన నాయకుడి కోసం గుడ్డిగా ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం మాత్రమే ఆమెకు తెలుసు. వాటి పర్యవసానాల గురించి రోజా అసలు ఆలోచించరు. తిరుపతి జిల్లా నగరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రోజా… గతంలో చంద్రబాబు హయాంలో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అసెంబ్లీలో ఆమె అడుగు పెట్టేందుకు అలుపెరగని పోరాటం చేశారు. అసెంబ్లీ ప్రాంగణలో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంతా చేసి రోజా వైసీపీ ప్రభుత్వం రాగానే ఏమైనా లబ్ధి పొందిందా? అంటే…లేదనే చెప్పాలి. జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరించిన విడదల రజినీ ఆ తర్వాత కాలంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైఎస్ జగన్ రెండో కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. రజినీ కీలకమైన వైద్యారోగ్యశాఖ మంత్రి పదవిని సాధించగా, రోజా మాత్రం పర్యాటక శాఖతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వైసీపీ అధికారంలోకి రాగానే రోజా హోంమంత్రి అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరలేదు. నగరి, హైదరాబాద్‌లలో ఆమె ఇళ్లకు మినిస్టర్ అయ్యారే తప్ప, ఎలాంటి కీలక పదవి వరించలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవితో సంతృప్తిపరిచారు. రోజా గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట ఏంటంటే… ఆమె అల్ప సంతోషి అని. ఎవరైనా రోజా అభిమానిస్తే… వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని మనస్తత్వం అని అంటుంటారు.
రోజా ఈ బలహీనతల్నే వైసీపీ సొమ్ము చేసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్‌పై ఈగ వాలనివ్వకుండా ఆమె రక్షణగా వుంటున్నారు. ఇప్పుడు జగన్ కోసం ఏపీలో గట్టిగా మాట్లాడే నాయకులు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. ముఖ్యంగా మహిళా మంత్రుల్లో కీలక శాఖలు దక్కించుకున్న వాళ్లు “తప్పించుకు తిరుగువారు ధన్యులు” అనే రీతిలో … మీడియా కంట పడకుండా తిరుగుతున్నారు.
“వైసీపీకి చిక్కిన ఏకైక ఎర్రిబాగుల్ది మా రోజా మాత్రమే” అని నగరి నియోజకవర్గంలోని ఆమె అభిమానులు వాపోతున్న పరిస్థితి. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసిన పవన్‌కల్యాణ్‌పై రోజా ముందూ వెనుకా ఆలోచించకుండా ఎంత ఘాటు విమర్శ చేయడానికైనా వెనుకాడటం లేదు. దీంతో ప్రత్యర్థులకు ఆమె టార్గెట్ అవుతున్నారు. రోజా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీచంగా మాట్లాడుతున్నారు. తద్వారా రోజాను కట్టడి చేసేందుకు టీడీపీ, జనసేన తమ ప్రయత్నాల్ని తీవ్రతరం చేశారు.
అయినా రోజా వెనక్కి తగ్గడం లేదు. అధికార పార్టీలోని కొంత మంది పెద్దలకు రోజా టార్గెట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. నగరి నియోజకవర్గంలో ఆమెతో సంబంధం లేకుండానే కొంత మంది నాయకులకు రాష్ట్రస్థాయి పదవులను కట్టబెట్టారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి, అలాగే ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కె.శాంతికి రోజా ప్రమేయం లేకుండానే పదవులు దక్కాయి. అలాగే నగరి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఆమెకు వ్యతిరేక గుంపు తయారైంది. పార్టీలోని పెద్దల అండ లేకుండానే రోజాకు వ్యతిరేకంగా పని చేస్తారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు.
నగరి నియోజకవర్గంలో రోజాకు సంబంధం లేకుండా కాంట్రాక్టు పనులు ఆమె వ్యతిరేకులకు ఇచ్చారని సమాచారం. తద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసి రోజాను ఎన్నికల్లో ఓడించడమే వ్యూహం. రోజా ఓడితే నష్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నగరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను కాదని వ్యతిరేకులకు పదవులు ఇచ్చినట్టు, ఇతర నియోజకవర్గాల్లోనూ ఆ పని చేయగలరా? అయినా ఇవన్నీ జగన్ ప్రోత్సాహం లేకుండానే రోజాను ఇబ్బంది పెట్టగలిగే సాహసం చేసే అవకాశం వుంటుందా? అని ఆమె అనుయాయులు ప్రశ్నిస్తున్నారు. తన కోసం ప్రత్యర్థులతో నానా మాటలు పడుతున్న రోజాకు అండగా నిలబడాల్సిన బాధ్యత జగన్‌కు లేదా? అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
నగరిలో రోజా ఇటు టీడీపీతో, అటు సొంత పార్టీలోని వ్యతిరేకులతో పోరాడాల్సిన పరిస్థితి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ వచ్చే లోపు, జగన్ అన్న వస్తాడని భావోద్వేగంగా చెప్పిన రోజా…చివరికి ఆమెను కాపాడేందుకు గన్, జగన్ మరెవరూ రాలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయినా జగన్ కోసం ఆమె పరితపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ పిల్లికి భిక్షం పెట్టదని ఘాటు విమర్శ చేయడం ఆమెకే చెల్లింది. ఇక పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడానికి రోజా ఒంటికాలిపై నిలిచి వుంటారు. ప్రతిగా ఆమెపై తిరుపతి కేంద్రంగా జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరకర విమర్శలు చేస్తుంటే, ఆమెకు మద్దతుగా ఏ ఒక్క వైసీపీ ప్రజాప్రతినిధి ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బు సంపాదనలో పడిన కొందరు అధికార పార్టీ నాయకులు జగన్‌ను ప్రత్యర్థులు దారుణంగా విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అక్రమార్జనలో వారి తీరిక లేదు. దురదృష్టవశాత్తు వారికే అధికార, పార్టీ పదవులు ఒకటికి రెండు చొప్పున సీఎం జగన్ కట్టబెట్టడాన్ని చూస్తున్నాం. తమ వ్యాపార, అధికార సామ్రాజ్యాలను విస్తరించుకోడానికి వైసీపీ ప్రజాప్రతినిధుల్లో కొందరికి జగన్ అధికారం కావాలి. కానీ జగన్ కష్టనష్టాలతో తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు.
కానీ జగన్ కోసమే నిత్యం పోరాడే రోజాకు ఇంటాబయటా కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. అందుకే రోజాను మెంటల్ కేసు అని అభిమానులు ఆగ్రహంతో అంటున్నారు. ఇలాగైతే రోజా రాజకీయంగా బతికి బట్టకట్టేదెట్టా? ఆమెను నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని నగరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం రోజానే చెప్పాలి.