రానా కెరీర్ లో చాన్నాళ్లుగా నలుగుతూ వస్తున్న ప్రాజెక్టు హిరణ్యకశ్యప. గుణశేఖర్ దర్శకత్వంలో రావాల్సిన సినిమా ఇది. దీనిపై గుణశేఖర్ చాలానే వర్క్ చేశాడు. అయితే ఆఖరి నిమిషంలో ప్రాజెక్టు అతడి చేజారింది. మైథలాజికల్ మూవీ హిరణ్యకశ్యప, త్రివిక్రమ్ చేతికి వెళ్లింది. ఈ విషయాన్ని చాన్నాళ్ల కిందటే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది.
ఇప్పుడీ ప్రాజెక్టులో చలనం వచ్చింది. శాన్ డియాగో కామిక్ కాన్ లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నాడు రానా. ఓ చిన్న పోస్టర్ ను లాంఛ్ చేసి, ప్రాజెక్టును ఎనౌన్స్ చేయబోతున్నాడు. ఓవైపు ప్రాజెక్ట్-కె తో పాటు కామిక్ కాన్ లో హిరణ్యకశ్యప హంగామా కూడా ఉండబోతోంది.
ఈ మొత్తం వ్యవహారంపై గుణశేఖర్ స్పందించాడు. తన చేతుల నుంచి ఈ ప్రాజెక్టు చేజారిపోయిందనే బాధ అతడికి ఉంది. ఆ బాధ, తాజాగా అతడు చేసిన ట్వీట్ లో వ్యక్తమైంది.
“దేవుడి కథను తీసుకొని సినిమా చేస్తున్నప్పుడు, ఆ దేవుడు కూడా మీపై ఓ కన్నేసి ఉంచుతాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ చిత్తశుద్ధిని దేవుడు ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. అనైతికంగా చేసిన పనులకు నైతికంగానే సమాధానం దొరుకుతుంది.”
ఇది గుణశేఖర్ తాజా ట్వీట్. తన పోస్టులో అతడు సినిమా పేరు, వ్యక్తుల పేర్లు ఏవీ ప్రస్తావించలేదు. కానీ హిరణ్యకశ్యప ప్రాజెక్టు కోసం చేసిన హోమ్ వర్క్ లో భాగంగా దిగిన ఓ ఫొటోను మాత్రం పోస్ట్ చేశాడు.
ఆ ఫొటో చూస్తే, ఎవరికైనా హిరణ్యకశ్యప ప్రాజెక్టును టార్గెట్ చేస్తూనే గుణశేఖర్ ఈ ట్వీట్ వేశాడనే విషయం అర్థమౌతుంది. ఇది గుణశేఖర్ కలల ప్రాజెక్టు. ఇలాంటి సినిమా చేజారితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ బాధ గుణశేఖర్ ట్వీట్ లో కనిపించింది.