ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వెళ్తున్నారంటే, ఆ ప్రాంతంలోని చెట్ల చావుకొస్తోంది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో రోడ్ల పక్కన చెట్లను అడ్డంగా తెగనరుకుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయ స్థానం ఆశ్చర్యపోవడం తెలిసిందే.
ఈ నెల 21న వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి సీఎం వైఎస్ జగన్ తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరిలో యధాప్రకారం చెట్ల నరికివేత జరిగింది. వెంకటగిరిలోని త్రిభువని కూడలి ప్రాంతంలో చెట్లను పూర్తిగా తొలగించారు. అలాగే సచివాలయం సమీపంలో ఉన్న కానుగ చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించారు. అలాగే వెంకటగిరి రోడ్లపై ఉన్న చెట్లను కూడా తొలగించినట్టు సమాచారం. వీటి కింద చిరు వ్యాపారులు బతుకు దెరువు పొందేవారు.
వైఎస్ జగన్ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా చెట్ల నరికివేత గురించి కనింది, వినింది లేదు. ఇప్పుడు జగన్ విషయంలో చెట్ల నరకడం అనే చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా ప్రముఖులు ఒక ప్రాంతానికి వెళితే, వారి రాకకు గుర్తుగా మొక్కలు నాటించడం చూశాం. ఇప్పుడు జగన్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా నడుస్తోంది.
ఒక మొక్క …చెట్టుగా ఎదగాలంటే సంవత్సరాలు పడుతుంది. పర్యావరణవేత్తలు చెట్ల పెంపకం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలను భరిస్తుంటారు. కనీస స్పృహ లేకుండా అధికారులు జగన్ వస్తున్నారంటూ చెట్లను నరకడంపై జనం మండిపడుతున్నారు. ఇలా జగన్ రాష్ట్రమంతా పర్యటిస్తే, ఏ ఒక్క చెట్టు మిగిలేలా లేదని చర్చకు తెరలేచింది. జగన్ రాకకు , చెట్ల నరికివేతకు సంబంధం ఏంటంటూ పర్యావరణవేత్తలతో పాటు పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
చెట్లను తొలగించడం ఎంత సులువో, దాన్ని పెంచడం అంత కష్టమని గ్రహిస్తే పర్యావరణానికి విఘాతం కలిగించే చెడు సంప్రదాయానికి ముగింపు పలుకుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.