ఎమ్బీయస్‌ : కిరణ్‌ బేదీ రాజకీయ పోరాటం

కిరణ్‌ బేదీ దేశమంతా తెలిసిన పేరు. ప్రభుత్వ వ్యవస్థలో వుంటూనే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన పోలీసు ఆఫీసరు. ఈనాడు ఆమె రాజకీయాల్లోకి దిగారు. రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, వారిని…

కిరణ్‌ బేదీ దేశమంతా తెలిసిన పేరు. ప్రభుత్వ వ్యవస్థలో వుంటూనే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన పోలీసు ఆఫీసరు. ఈనాడు ఆమె రాజకీయాల్లోకి దిగారు. రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, వారిని బుజ్జగించవలసిన అవసరం పడింది. ఇటీవలి కాలంలో బిజెపి అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండానే మోదీ ఫోటో పెట్టుకునే రంగంలోకి దిగుతోంది. ఢిల్లీ ఎన్నికలలో మాత్రం వ్యూహం మార్చింది. దీనికి కారణం రామలీలా మైదాన్‌లో మోదీ బహిరంగ సభకు పెద్దగా స్పందన లేకపోవడం. ఆ సభ జరిగిన కొన్ని గంటల్లోనే మోదీ, అమిత్‌ షా, అరుణ్‌ జైట్లీ సమావేశమై ఢిల్లీ సీను వేరేలా వుందని గ్రహించారు. అక్కడ విద్యావంతులు ఎక్కువ. పూర్తిగా నగరవాతావరణం. రాజకీయ చైతన్యం ఎక్కువ. మోదీ ప్రధానియే కానీ తమ ముఖ్యమంత్రి కాడని వారందరికీ తెలుసు. ప్రచారం చేసి మోదీ తప్పుకుంటాడని ఆ తర్వాత బిజెపి నాయకుడు ఎవర్నో ముఖ్యమంత్రి చేస్తారని వాళ్లు అర్థం చేసుకున్నారు. 

ఇలాటి పరిస్థితుల్లో  ఆప్‌ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు దీటైన అభ్యర్థిని నిర్ణయించి ఆప్‌ను ఢీకొనాల్సిందే అని మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే బిజెపి నుంచి వారికి ఎవరూ అలాటి అభ్యర్థి కనబడలేదు. హర్షవర్ధన్‌ మంచి అభ్యర్థే కానీ గతంలో ఆయన్ని ముందు పెట్టుకుని వెళ్లినా తగినన్ని సీట్లు రాక అధికారం ఆప్‌కు అప్పగించవలసి వచ్చింది. ఇక ఎవరో ఒకర్ని దిగుమతి చేసుకోవాలి అనుకున్నారు. కిరణ్‌ బేదీ పేరు పరిగణనలోకి వచ్చింది. అరుణ్‌ జైట్లీ కిరణ్‌కు ఫోన్‌ చేసి మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు. ఆమె సరేనంది. వెంటనే అమృత్‌సర్‌లో వున్న తన భర్త బృజ్‌ బేదీకి ఫోన్‌ చేసి 65 ఏళ్ల వయసులో విధి నన్ను రాజకీయాల్లోకి నడిపిస్తోంది అని చెప్పింది. 

ఆమె పేరు బయటకు రాగానే ఢిల్లీ బిజెపి నాయకుల్లో కలకలం బయలుదేరింది. ఢిల్లీలో బిజెపి ఎన్నో ఏళ్లగా పాతుకుని పోయి వుంది. 1960లలోనే ఢిల్లీ కార్పోరేషన్‌ ఎన్నికలలో బిజెపి గెలిచింది. అప్పటినుంచి అనేకమంది కార్యకర్తలు, నాయకులు తయారయ్యారు. పదవుల కోసం పోట్లాడుకున్నారు. ఒకరి నొకరు కూలదోసుకున్నారు. ఈ గొడవల వలననే బిజెపి ముఖ్యమంత్రుల్ని మార్చవలసి వచ్చింది. కాంగ్రెసుకి అధికారం అప్పగించవలసి వచ్చింది. హర్షవర్ధన్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది కాబట్టి, తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి ఛాన్సు వస్తుంది అనుకుంటూ వుండగా తామెవ్వరికీ క్లీన్‌ యిమేజి లేదని చాటి చెప్పినట్లు అర్జంటుగా కిరణ్‌ను దిగుమతి చేసుకోవడం వాళ్లను మండించింది. కిరణ్‌కు ఎదురు తిరగ నారంభించారు. ఢిల్లీ బిజెపి అధ్యకక్షుడు సతీశ్‌ ఉపాధ్యాయ తన అసంతృప్తిని ఆమె నామినేషన్‌ నాడే వెళ్లగక్కాడు. ఓ పట్టాన అక్కడికి వెళ్లలేదు. అమిత్‌ షా గట్టిగా చెప్పవలసి వచ్చింది. ఢిల్లీ బిజెపి ఎంపీలను కిరణ్‌ బేదీ టీకి పిలిచి వారి సహాయాన్ని అభ్యర్థించడం రాష్ట్రస్థాయి నాయకులకు నచ్చలేదు. 

ఈ అసంతృప్తిని అమిత్‌ షా ముందే వూహించి ఆమెను గెలిపించే బాధ్యతను డా|| హర్షవర్ధన్‌కు అప్పగించారు. నిజానికి కేంద్రమంత్రిగా వుండడం కంటె ఢిల్లీ ముఖ్యమంత్రిగా వుండడం ఆయనకు యిష్టం. తనకు గాని, తన అనుచరుడికి గాని ఛాన్సిస్తారేమో ననుకుంటే కిరణ్‌ను తెచ్చిపెట్టి ఆమెకు నీ నియోజకవర్గమైన కృష్ణనగర్‌ యిచ్చి విజయం చేకూర్చు అని పనిపెట్టారు. కిరణ్‌కు యిదంతా యిబ్బందిగానే వుంది. తన నియోజకవర్గంలోని కార్యకర్తలను కలవడానికి ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో ఆమె వేదిక ఎక్కాక, హర్షవర్ధన్‌ జిందాబాద్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎందుకంటే ఆయన 40 ఏళ్లగా ఆ నియోజకవర్గానికి సేవ చేశాడు. 5 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాడు. కిరణ్‌కు పరిస్థితి అర్థమైంది. హర్షవర్ధన్‌ పేరు చెప్పుకోకపోతే తనను ఎవరూ చూడరని గ్రహించి 'హర్షవర్ధన్‌గారు మంచి ఇఎన్‌టి సర్జన్‌, నేను తీహార్‌ జైలుకి యిన్‌చార్జిగా వుండగా వచ్చి మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. నా చెవులు కూడా పరీక్షించారు' అంటూ ఏదో మాట్లాడింది. ఈ నియోజకవర్గం ఎప్పటికీ ఆయనదే, నేను ఒట్టి అతిథిని మాత్రమే అని చెప్పుకుంది. 

ఇదంతా ఆప్‌కు వేడుకగా వుంది. అరవింద్‌ ఆమెను తనతో చర్చకు రమ్మనమని సవాల్‌పై సవాల్‌ విసురుతున్నాడు. ఇప్పటిదాకా 'ప్రతీదీ చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి, ఎన్నికలలో ప్రత్యర్థులు అమెరికాలోలా చర్చావేదికలో తలపడాలి' అని చెప్తూ వచ్చిన కిరణ్‌ యిప్పుడు ప్లేటు ఫిరాయించింది. 'అరవింద్‌ యీజ్‌ కీన్‌ ఆన్‌ డిబేట్‌, ఐ యామ్‌ కీన్‌ ఆన్‌ డెలివరీ (వాగ్దానాలు చెల్లించడం)' అని చెప్పుకుంటోంది. 'ఒక్క రెండు గంటలు చాలు. రాజకీయాల్లోకి రావచ్చు కానీ బిజెపి తప్ప మీకు మరే పార్టీ దొరకలేదా అని అడుగుతాను. మీ ట్విట్టర్‌ ఎక్కవుంటులో నన్ను ఎందుకు బ్లాక్‌ చేసేశారు? అని అడుగుతాను' అంటున్నాడు అరవింద్‌. అరవింద్‌ అరాచకవాది అయితే కిరణ్‌ ప్రచారప్రీతితో హద్దులు దాటి అధికారాన్ని వినియోగించిన నియంత అని ప్రతీతి. ఢిల్లీ లాయర్లు సమ్మె చేసినపుడు ఆమె వాళ్లను చావగొట్టించింది. 

ఆ సంఘటనను వాళ్లు యింకా మర్చిపోలేదు.  ఆమె నామినేషన్‌ దాఖలు చేసిన రోజున ఆరు జిల్లా కోర్టుల్లోని లాయర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. లాఠీ ఝళిపించడం తప్ప ఆమెకు ఎడ్మినిస్ట్రేషన్‌ తెలియదని వారి వాదన. మొన్నటిదాకా కాంగ్రెసుతో బాటు బిజెపిని కూడా తూర్పారబట్టిన కిరణ్‌ సడన్‌గా మోదీని ఆకాశానికి ఎత్తేసి, ఆయన విధానాలు నచ్చే బిజెపిలో చేరాననడం ఢిల్లీ వాసులు ఎలా అర్థం చేసుకుంటారో, అసలు ఢిల్లీ బిజెపి నాయకులు కిరణ్‌కు మనస్ఫూర్తిగా సహకరిస్తారో లేదో చూడాలి. సర్వేలు చూడబోతే అరవింద్‌దే పైచేయి అంటున్నాయి. ముస్లింలు, వెనకబడిన వర్గాలు కిరణ్‌ను నమ్మటం లేదట. మధ్యతరగతి వర్గాలే కిరణ్‌ను గట్టెక్కించాలి. అన్నా హజారే వెంట వుండి లోక్‌పాల్‌ బిల్లుకై అంతటి ఆందోళన చేసిన కిరణ్‌ ఆ బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీలో మద్దతు యివ్వని బిజెపిని యిప్పుడు వెనక వేసుకుని రావడం వాళ్లు జీర్ణించుకుంటారో లేదో తెలియదు. పైగా రిపబ్లిక్‌ దినోత్సవ పేరేడ్‌కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ను పిలవకుండా ఏ పదవీ లేని కిరణ్‌ బేదీని ఆహ్వానించి ముందు వరుసలో కూర్చోబెట్టడం కూడా బిజెపి ఓవరాక్షన్‌కు ఉదాహరణగా ఫీలవుతున్నారు.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]