ఎమ్బీయస్‌ : మోదీ సూపర్‌మ్యాన్‌ యిమేజ్‌ – 1/4

ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తరోజులు ఎంతమందికి గుర్తున్నాయో తెలియదు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన్ను ఒక మానవాతీతుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. కృష్ణుడి వేషంలో శంఖం పూరిస్తూ వున్న కటౌట్‌ ఎన్నికల ప్రచారసభల్లో పెట్టేవారు. 'రా,…

ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తరోజులు ఎంతమందికి గుర్తున్నాయో తెలియదు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన్ను ఒక మానవాతీతుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. కృష్ణుడి వేషంలో శంఖం పూరిస్తూ వున్న కటౌట్‌ ఎన్నికల ప్రచారసభల్లో పెట్టేవారు. 'రా, కదలిరా, తెలుగుదేశం పిలుస్తోంది' అనే నినాదంతో పాటలు, ఉపన్యాసాల కాసెట్లు, భారీ ఎత్తున సినిమాతారలు ప్రచారంలోకి రావడం.. యివన్నీ హోరెత్తిపోయాయి. చైతన్యరథంలో నిరంతర ప్రయాణం చేసి మానవమాత్రుడెవరికీ యిది సాధ్యం కాదు అనిపించారు. ఆ వయసులో ఎన్టీయార్‌ స్టామినా అందరినీ అబ్బురపరిచింది. కాంగ్రెసు వటవృక్షాన్ని కూల్చగల సమర్థుడు యితనొక్కడే అని ప్రజలకు తోచింది. అందుకే రాజకీయాలలో కొత్తగా వచ్చిన యువకులను అభ్యర్థులుగా నిలబెట్టినా వారు దిగ్గజాల వంటి కాంగ్రెసు నాయకులను మట్టి కరిపించారు. రాజకీయ విశ్లేషకులు ఎన్టీయార్‌ మహా అయితే 100 సీట్లు గెలిచి ప్రతిపక్ష నాయకుడవుతాడని అంచనా వేశారు. ముఖ్యమంత్రి అయితే నేను యిలా చేస్తాను, అలా చేస్తాను అని ఎన్టీయార్‌ అంటే నవ్వుకున్నారు. కమ్యూనిస్టులు సైతం అలాటి లెక్కలే వేసి, ఎన్టీయార్‌తో పొత్తు కుదుర్చుకోలేదు.  

చివరకు ఎన్టీయార్‌ ఘనవిజయం సాధించి, అధికారం చేపట్టారు. అప్పటిదాకా చూసిన కాంగ్రెసు పద్ధతులకు సుదూరంగా పయనించారు. బహిరంగసభలో ప్రమాణస్వీకారం దగ్గర్నుంచి అన్నీ సంచలనమే. గెలిచినవారు సన్మానాలు చేయించుకోకూడదనడం, అధికార సమావేశాల్లో తెలుగు భాషలోనే మాట్లాడడం, పోలీసు వందనం స్వీకరించినపుడు సెల్యూట్‌ పెట్టకుండా చేతులు జోడించి నమస్కారం పెట్టడం.. ఒకటా రెండా? ఢిల్లీ వెళ్లినపుడు ఎన్టీయార్‌ తెలుగులోనే మాట్లాడి తెలుగు ఘనత చాటి చెప్పాలని ప్రజల్లో చర్చలు జరిగేవి. 'మరి అక్కడివాళ్లకు అర్థం కాకపోతే..?' అని ఎవరైనా అడిగితే 'వాళ్లే దుబాసీలను ఏర్పాటు చేసుకోవాలి, ఏ చైనా వాడో వస్తో పెట్టుకోరా?' అనేవారు. ఎన్టీయార్‌ సినిమారంగం నుంచి వచ్చారు. సినిమాలకు బయట వున్న ప్రపంచాన్ని చాలా తక్కువ చూశారు. హీరోచిత కార్యాలు తెరపై చేసి, చేసి ఆయనలో తెలియకుండానే ఒక అతివిశ్వాసం ఏర్పడింది – తాను గట్టిగా తలచుకుంటే ఏమైనా జరిగిపోతుందని. పైగా సినీనిర్మాణంలో, ఆయన స్టూడియోలో, పాత్రల విషయంలో ఆయన మాటే చెల్లింది. అందువలన 'ఎక్కడైనా అవినీతి జరిగినట్లు ఒక్క ఫోన్‌ కాల్‌ కొడితే చాలు, అయిదు నిమిషాల్లో వచ్చి వాలతాను' అనే స్టేటుమెంట్లు యిచ్చేశారు, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా. ఆ తర్వాత కాంగ్రెసు కుళ్లబెట్టిన వ్యవస్థను సరిదిద్దడానికి కంకణం కట్టుకున్నానంటూ ఆకస్మిక తణిఖీలు చేయసాగారు. 

ఇక దాంతో ప్రజల్లో అనేక కథలు పుట్టాయి. 'ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషంట్లతో ఎలా వ్యవహరిస్తున్నారో స్వయంగా తెలుసుకోవడానికి ఎన్టీయార్‌ పేషంటుగా నటిస్తూ ఒక ఆసుపత్రికి వెళ్లారట. అయితే ఎన్టీయార్‌ను గుర్తు పట్టని వాళ్లెవరు? 'మళ్లీ సినిమాల్లో వేస్తున్నారా సార్‌? సినిమా పేరేమిటి?' అని అక్కడి నర్సు దగ్గర్నుంచి అందరూ అడిగారట. ఛ, ప్లాను ఫెయిలయిపోయింది అని ఎన్టీయార్‌ విసుక్కున్నారట.' ఈ కథల మాట ఎలా వున్నా ఎన్టీయార్‌ తాను చండశాసనుణ్ని అని, అవినీతి చేసినవారు తన సహచరులే అయినా సహించనని చూపించుకోవడానికి ఒక మంత్రినే ట్రాప్‌ చేసి పట్టించారు. వేరే ఎవరైనా అయితే ఆయన అవినీతికి పాల్పడుతున్నాడని తెలిస్తే హెచ్చరించి వదిలేస్తారు. కానీ యీయన మీడియా ముందు యిదంతా జరిపించి, తాను ఉత్తముణ్నని, అవతలివాడు అధముడని చూపించుకున్నాడు. అలాగే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుచరులు ఆయన వారిస్తున్నా ఎడ్లబళ్లపై వూరేగిస్తే యీయన పిలిచి యీ ఆడంబరం ఎందుకంటూ తిట్టారని పేపర్లో వచ్చేట్టు చూశారు. ఎన్టీయార్‌ ఒక్కడే నిప్పు, పార్టీలో తక్కినవాళ్లందరూ గుంటనక్కలు, ఎన్టీయార్‌ మెత్తగా వుంటే కాంగ్రెసువాళ్లలాగే ప్రవర్తిస్తారు అనే సందేశం ప్రజల్లోకి వెళ్లేట్లు చూశారు. 

కాంగ్రెసు హయాంలో పనిచేసిన అధికారులందరూ దొంగలే అనే అభిప్రాయం ఆయనలో వుండేది. మరి అప్పటిదాకా నడిచినది కాంగ్రెసు పాలనే. ఎవరికైనా ఒక అధికారితో పడకపోతే వెళ్లి ఎన్టీయార్‌కు చాడీలు చెప్తే చాలు, వెంటనే వేటు వేసేసేవారు. శిక్షించినవాడు ఎన్టీయార్‌ కాబట్టి, అవతలివాడు తప్పకుండా అవినీతిపరుడే అనే ప్రచారం మీడియాలో, ప్రజల్లో జరిగేది. ఈ విధంగా అధికారగణం డీమోరలైజ్‌ అయిపోయి పరిపాలన కుంటుపడింది. కానీ ఎన్టీయార్‌కు అదేమీ పట్టలేదు. తన యిమేజి వెలుగుతోందా లేదా అనే చూసుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన మాటకు ఎదురే లేదు. ఆయన ఎవరినైనా నంది అంటే నంది, పంది అంటే పంది. ప్రభుత్వోద్యోగులు పందికొక్కులు అని ఆయన అంటే వాళ్లు నిజంగా అంతేనన్నమాట. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసేముందు రికార్డులు అవీ స్వాధీనం చేసుకుని మరీ చేయాలి, తొందర పడకూడదు అని ఎవరైనా హితవు చెప్పబోతే వాడు ప్రజాద్రోహి అన్నమాట.

ఇదంతా ఎందుకు గుర్తు వస్తోందంటే ప్రస్తుతం మోదీ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఒంటి చేత్తో భారత్‌ను వెలుగుపథంలో తీసుకుని పోగల మానవాతీతుడు మోదీ అని అనేకమంది నమ్ముతున్నారు. వాళ్లు అలా నమ్మేట్లు పని గట్టుకుని ప్రచారం చేశారు. అమెరికాలో మోదీ భక్తులకు, రాజదీప్‌ సర్దేశాయికి మధ్య ఘర్షణ జరిగిందంటే నాకు ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం భారతీయుల్లో అధికశాతం ప్రజలు మోదీపై చిన్న విమర్శ చేసినా సహించే స్థితిలో లేరు. మోదీని కాని, అతని పార్టీని కాని, వాటిలో లోపాలోపాలను కాని నేను విశ్లేషించినా, విమర్శించినా కుప్పలకొద్దీ హేట్‌ మెయిల్స్‌ వచ్చి పడుతున్నాయి. వారికి అతను భారతప్రతిభకు కీర్తిపతాక, హిందూమత పరిరక్షకుడు, చండశాసనుడు, అవినీతిపరుల పాలిట సింహస్వప్నం, సూపర్‌మ్యాన్‌, దేవుడు పంపిన రక్షకుడు.. ఎన్ని విశేషణాలు చెప్పినా యింకా తక్కువే. (సశేషం) – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)