బాహుబలి 2 కి ఏడాది సరిపోతుందా?

బాహుబలి 2, ది కంక్లూజన్..2016లో వస్తుందన్నది ప్రచారం. అయితే అది ఏడాదిలో రావడం కష్టం అని ఇండస్ట్రీ అంచనా. లెక్కప్రకారం అయితే పార్ట్ 2 తీయడానికి పెద్దగా టైమ్ అక్కర్లేదు. ఎందుకంటే పార్ట్ వన్…

బాహుబలి 2, ది కంక్లూజన్..2016లో వస్తుందన్నది ప్రచారం. అయితే అది ఏడాదిలో రావడం కష్టం అని ఇండస్ట్రీ అంచనా. లెక్కప్రకారం అయితే పార్ట్ 2 తీయడానికి పెద్దగా టైమ్ అక్కర్లేదు. ఎందుకంటే పార్ట్ వన్ తో పాటు పార్ట్ 2 చాలా వరకు ఫినిష్ చేసారు కాబట్టి.

కానీ ఇప్పుడు రాజమౌళి ఆలోచన వేరుగా వుందని టాక్. బాహుబలి సినిమా హిట్ అయింది, బోలెడు డబ్బులు వచ్చాయి. ఎందరో అప్పులు తీర్చుకుని, లాభాలు దాచుకున్నారు కూడా. ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. బేరాలు పెరిగిపోయాయి. ఒక్క ఓవర్ సీస్ కే పాతిక కోట్ల మేరకు ఆఫర్ వచ్చింది. అంటే బాహుబలి 2 క్రేజ్ ఎంత పెరిగిపోయిందో అర్థం అవుతుంది.

అయితే బాహుబలి పార్ట్ వన్ అమ్మిన రేట్లు తక్కువేమీ కాదు. ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసింది కాబట్టి, పది హేను రోజుల పాటు దాదాపు సింగిల్ సెంటర్లన్నింటిలో యూనిఫారమ్ రేటు అమ్మారు కాబట్టి సరిపోయింది. ఒరిజనల్ రేటు అమ్మితే కష్టమయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లకు సినిమా లాభాలు ఆర్జించాలి అంటే, అంతకు అంతా బాగుండాలి.

పైగా ఫ్యాన్స్, జనాలు ఎన్ని చెప్పినా తన సినిమా మంచి చెడ్డలు, ప్లస్ మైనస్ లు రాజమౌళికి తెలియనివి కాదు. సెకండ్ పార్ట్ లో ఈ గ్రాఫిక్స్, భారీతనం, విజువల్స్ చూపి బండి నడిపించలేమని ఆయనకు తెలియంది కాదు. ఫస్ట్ పార్ట్ లో మిస్సయిన తన మార్కు ఎమోషన్లు, కథ, కథనాలు వుండాల్సిందే.

పైగా ఇప్పుడు కథ సగం బయటకు వచ్చింది. ప్రేక్షకులకు కూడా కొన్ని అయిడియాలు వుంటాయి. ఇలాంటి ఊహాగానాలకు అందకూడదు, అలా అని వారి అంచనాలు అందుకోవాలి. ఫస్ట్ పార్ట్ కన్నా అన్ని విధాలా సూపర్ అనుకుంటే తప్ప, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కు వచ్చిన జనం అందరూ సెకండ్ పార్ట్ కు రావడం కష్టం.

ముఖ్యంగా అయిదు పదేళ్లుగా, పదిహేను ఏళ్లుగా థియేటర్ కు దూరంగా వున్నవారంతా బాహుబలికి వచ్చారు. అలా వచ్చారు కాబట్టే కలెక్షన్లు ఆ రేంజ్ లో వున్నాయి. వాళ్లు మళ్లీ రావాలంటే సినిమా అంతకు అంతా సూపర్ గా వుండాలి.  

అందుకే ఇప్పుడు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికి పూర్తయింది ముఫై శాతం మాత్రమే. అంటే డెభైశాతం కథ అల్లాలి. దానికి తగ్గ స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ రెడీ కావాలి. మళ్లీ విజువల్స్ కోసం స్టోరీ బోర్డు వేయించాలి.

ఇవన్నీ చేసి, సెట్ మీదకు వెళ్లడానికే కనీసం రెండు మూడు నెలల కాలం పట్టొచ్చు.  అక్కడి నుంచి టాకీ పూర్తి చేయాలి. ఆపై సి జి వర్క్ ఫినిష్ చేయాలి. దానికి ఏడాది కాలం సరిపోతుందా అన్నది అనుమానం.