ఆగడు…రభస సినిమాలు ఓ సరికొత్త రికార్డుకు తెరతీసాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా విడుదల అనంతరం ప్రచారం అన్నది తప్పని సరి. హిట్ అయితే ఓ మాదిరిగా వుండే ఈ ప్రచారం ఫ్లాప్ అయితే మాత్రం ప్రచారం ఓ రేంజ్ లో వుంటుంది. యూనిట్ అంతా దిగిపోయి తెగ కబుర్లు చెబుతారు. ఇలా చేసాం..అలా చేసాం అంటారు. ఆ విధంగా సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తారు. సినిమా ఫ్లాప్ అయిందీ హిట్ అయిందీ..అన్నది మర్నాడే ప్రారంభమయ్యే ప్రచారాన్ని బట్టే చెప్పేయచ్చు. సినిమా విడుదలయిన మర్నాడే సక్సెస్ మీట్ పెట్టారంటే, ఆ సినిమా బకెట్ తన్నేసినట్లే.
కానీ ఆగడు, రభస సినిమాల విషయంలో ఈ వ్యవహారాలన్నింటికీ తిలోదకాలు ఇచ్చేసారు. విడుదలయిన తరువాత ఆ సినిమాలకు ప్రమోషన్ అనేది వుందా అంటే ముందే బుక్ చేసిన టీవీ స్లాట్ లు మినహా మరేమీ కాదు. నిజానికి ఆ సినిమాలు మరీ ఘోరంగా థియేటర్లలోంచి లేచిపోలేదు. రెండూ పరాజయాలే. కాదనలేం. కానీ ఇంకా థియేటర్లలో వున్నాయి. రభస కూడా.
మరి అలాంటపుడు కనీసం అప్పుడప్పుడైనా ఓ ప్రమోషన్, ఓ మాట..అదేమీ లేదు. విడుదల తరువాత ఒక్క కార్యక్రమం కూడా లేని సినిమాలుగా ఈ రెండు సినిమాలు కొత్త రికార్డును సృష్టించాయి. రభస నిర్మాత అప్పుల ఇబ్బందుల్లో పడ్డారు. ఈ వైనం పట్టించుకోలేదు. ఆగడు నిర్మాతలు..ఇద్దరు ఓ వైపు..ఒకరు మరో వైపు వున్నారు..వాళ్లు పట్టించుకోలేదు. మొత్తానికి రెండు సినిమాల ప్రచారం అలా ముగిసింది.