అధికారంలో ఉన్న ఎన్డీయే 38 పార్టీలను ఆహ్వానించి ఒక భారీ సమావేశంపెట్టుకుని.. ఇది తమ బలం అని చాటిచెప్పుకుంది. విపక్షాలు 26 పార్టీలతో బెంగుళూరులో భేటీ నిర్వహించి.. తమదే బలమైన కూటమి అని, అధికార కూటమిలో రిజిస్టరు కాని పార్టీలు కూడా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
అయితే మొత్తానికి రాజకీయంగా పార్టీలన్నీ రెండే గ్రూపులుగా విడిపోయినట్టు వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమికి హాజరు కాని పార్టీలు అన్నీ కూడా.. బిజెపికి మిత్రపక్షాలే అన్నట్టుగా ఒక ప్రచారం మొదలవుతోంది. బిజెపికోసం పనిచేసే పార్టీలే అనివారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి అడకత్తెరలో పడ్డట్టు అవుతోంది. ఎందుకంటే.. కాంగ్రెసు పార్టీ కక్ష కట్టినట్టుగా భారాసను విపక్ష కూటమివైపు రానివ్వడంలేదు. దాంతో పాటు విపక్ష కూటమి భేటీకి హాజరైతే.. కాంగ్రెస్ తో స్నేహహస్తం కలిపినట్టుగా సంకేతాలు వెళ్లి.. తెలంగాణ రాష్ట్రంలో తమకు ఆత్మహత్యా సదృశం అవుతుందనేది గులాబీ దళపతుల భయం.
అయితే విపక్ష కూటమి భేటీకి వెళ్లలేదు గనుక.. తమ మీద భాజపా బీటీమ్ అనే ప్రచారం మరింత ముమ్మరం అవుతుందనేది ఇంకో భయం. ఈ నేపథ్యంలో విపక్షాలు తమని వెలివేయకుండా, బీటీమ్ గా తేల్చేయకుండా చూసుకోవడానికి భారాస ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఆప్ కు అనుకూలంగా భారాస తమ గళం వినిపించింది. ఢిల్లీ పరిపాలనలో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్ అన్ని పార్టీల మద్దతును కూడగడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలు గోవాలో తొలి భేటీ కావడానికి, బెంగుళూరులో మలి భేటీ కావడానికి మధ్య కాంగ్రెసు కూడా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించి తీరాల్సిందే అని ఆమ్ ఆద్మీ పార్టీ పట్టుబట్టి వారితో ప్రకటన చేయించింది. కాంగ్రెసు వ్యతిరేకించకపోతే.. తాము విపక్షాల కూటమి భేటీలకు హాజరు కాబోం అని తేల్చి చెప్పింది.
అన్నాళ్లుగా ఆప్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన కేసీఆర్ కు విపక్షాలలో వెంట నిలిచేవారు లేకుండాపోయారు. విపక్షాలలో భారాస ఇంచుమించుగా ఒంటరి అయినట్టే లెక్క. భాజపా అనుకూల ముద్రతో విపక్షాలు అన్నీ తమను వెలివేస్తున్నాయనే భయం భారాసలో పెరిగింది. అందుకే అఖిలపక్ష సమావేశంలో కూడా ఢిల్లీ సమస్యను ప్రధానంగా లేవనెత్తి ఆమ్ ఆద్మీ పార్టీని ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది.
అలాగే.. భిన్నత్వంలో ఏకత్వం అనే ఇండియా కూటమి ముసాయిదాను తాము స్వాగతిస్తున్నాం అంటూ ప్రకటించిన భారాస ఎంపీ కే కేశవరావు తద్వారా.. తమను కూడా విపక్ష పార్టీగానే గుర్తించాలని ఆరాటపడుతున్నారు. వారు ఎన్ని మ్యాజిక్కులు చేసినా సరే.. కేసీఆర్ చేస్తున్న ప్రతి ప్రయత్నమూ, జాతీయ పార్టీగా అన్నిచోట్లా పోటీచేస్తాం అంటూ వేస్తున్న అడుగులు.. నరేంద్రమోడీకి, బిజెపికి మేలు చేసేందుకు మాత్రమే అనే అనుమానాలు మాత్రం రాజకీయపార్టీల్లో తొలగిపోవడం లేదు.