మణిపూర్ పై మౌనం కలకాలం సాధ్యం కాదు!

మణిపూర్ రాష్ట్రం మొత్తం రావణకాష్టంలా మారిపోయి నిత్యం అల్లర్లతో రగులుతూనే ఉంది. ప్రతిరోజూ చెదురుమదురుగా ఏదో ఒక అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రాణనష్టం జరుగుతూనే ఉంది.  Advertisement అయితే ప్రధాని నరేంద్రమోడీ…

మణిపూర్ రాష్ట్రం మొత్తం రావణకాష్టంలా మారిపోయి నిత్యం అల్లర్లతో రగులుతూనే ఉంది. ప్రతిరోజూ చెదురుమదురుగా ఏదో ఒక అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రాణనష్టం జరుగుతూనే ఉంది. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ ఒకవైపు విదేశాలకు టూర్ల మీద టూర్లు వేస్తూ ఉన్నారు. ఒక్కసారైనా మణిపూర్ ను సందర్శించి అక్కడి అశాంతి మయ పరిస్థితులను సమీక్షించలేదనే విమర్శలు పుష్కలంగా వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ కనీసం మణిపూర్ గురించి ఒక్క ప్రకటన కూడా చేయలేదని, అక్కడి అల్లర్లను ఉపశమింపజేయడంపై ఎలాంటి నిర్ణయమూ రాలేదని విపక్షాలు చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నప్పటికీ మోడీ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. 

అయితే ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఏకపక్ష ధోరణులు కలకాలం సాగవు. మణిపూర్ అల్లర్ల గురించి తన అభిప్రాయం ఏమిటో, తమ ప్రభుత్వం ఏం చేయదలచుకుంటున్నదో నరేంద్రమోడీ స్వయంగా నోరు విప్పి చెప్పవలసిన పరిస్థితి..! పార్లమెంటు వర్షాకల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మణిపూర్ అంశంపై విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది.

మణిపూర్ లో గిరిజన జాతుల మధ్య వైరం ఇప్పుడు యావత్ రాష్ట్రం శాంతి భద్రతలకే ప్రమాదకరంగా పరిణమించింది. మెయితీ మరియు కుకీ జాతుల మధ్య ఘర్షణలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పదివేల మంది సైనికులు, పారామిలిటరీ బలగాలను ప్రత్యేకంగా మోహరించి మరీ.. భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. 

ఇక్కడ గిరిజన జాతుల మధ్య వైరం ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ.. రాజకీయ కారణాలే ప్రధానంగా ప్రస్తుత అశాంతి ఏర్పడినట్టుగా పలువురు భావిస్తున్నారు. మణిపూర్లో భాజపా ప్రభుత్వమే ఉంది. తమ పార్టీ ప్రభుత్వం ఉన్నది గనుక.. ఆ రాష్ట్రం ఎలా తగలబడిపోతున్నప్పటికీ.. సరైన చర్యలు తీసుకోవడానికి కేంద్రం వెనుకాడుతోందనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ లబ్ధిని చూసుకుంటున్నారు తప్ప.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయడం అనేది ఎవరికీ పట్టకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు గానీ.. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా జోక్యం చేసుకోలేదని, ఒక్కసారి కూడా ఈ కల్లోలిత ప్రాంతంలో పర్యటించలేదని, మణిపూర్ అల్లర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన కనీసం ఈ మణిపూర్ అల్లర్లపై ఒక వివరణ కూడా ఇవ్వలేదు. ఈనేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్ తో పార్లమెంటులో మణిపూర్ గురించిన చర్చ జరిగితే.. ప్రధాని మోడీ కూడా అనివార్యంగా మాట్లాడవలసి వస్తుంది.