చంద్రబాబు ఆంధ్రులు మరువలేని నాయకుడు

పరిపాలనాపరంగా, వెన్నుపోటు విషయంగా ఎన్ని మాట్లాడుకున్నా చంద్రబాబునాయుడిది ఒక సుదీర్ఘమైన  రాజకీయచరిత్ర. చంద్రబాబు-వైయస్సార్ పర్వం ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. Advertisement చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలోనే కేంద్రంపై…

పరిపాలనాపరంగా, వెన్నుపోటు విషయంగా ఎన్ని మాట్లాడుకున్నా చంద్రబాబునాయుడిది ఒక సుదీర్ఘమైన  రాజకీయచరిత్ర. చంద్రబాబు-వైయస్సార్ పర్వం ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం.

చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలోనే కేంద్రంపై కన్నుండేది. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు. వ్యవస్థల్లో తనకు కావాల్సిన వ్యక్తుల్ని ఫీల్డింగ్ చేసి మునుపెవ్వరికీ సాధ్యం కానంత తెలివైన రాజకీయాన్ని నడిపిన దిట్ట. ఈ విషయంలో ఆయన ఆంధ్రులు మరువలేని నాయకుడు. 

కానీ ఆయన్లో ఒక్కటే ప్రధానమైన లోపం. అదే ఓపిక లేనితనం. “ఎప్పటికెయ్యెది ప్రస్తుతం” అన్నట్టుగా అప్పటికప్పుడు పదవి కావాలంటే ఏం చెయ్యాలో అది చేసేయడం, ఫలానా పొత్తు పెట్టుకుంటే పదవొచ్చే చాన్సులెక్కువ అనగానే పొత్తుపెట్టేసుకోవడం. ఈ ఓపికలేని గుణం వల్లనే చంద్రబాబు తన యుక్తికి తగ్గ స్థానానికి చేరలేకపోయారనిపిస్తుంది. 

రాజకీయాల్లో ధైర్యంగా, మొండిగా నిలబడి సిద్ధాంతపరంగా నడుచుకునే వాడికి ఒకరోజు కాకపోతే ఇంకోరోజన్నా సింహాసనం వరిస్తుంది. అలా కాకుండా కంగారు పడిపోతే ప్రతిసారి పని జరగదు. 

మండువేసవిలో కరెంటు పోతే సగటు కోస్తాంధ్రా వాసికి ఎలా ఉంటుందో పదవి లెకుండా కూర్చోవడం చంద్రబాబుకి అలా ఉంటుంది. కరెంటు తీసినవాడిని తిట్టడం, వెంటనే కరెంటు కోసం జనరేటర్ ఎవరన్నా ఇస్తారేమో వెతుక్కోవడం లాగ ఆయన ఎప్పుడూ పొత్తు కోసం వెతుక్కుంటూ ఎన్నికల్లో పోరాడడమే సరిపోయింది. ఆ పొత్తు కమ్యూనిష్టులతోనైనా, భాజపాతోనైనా, ఆఖరికి తెదేపా బద్ధశత్రువు కాంగ్రెస్ తో అయినా ఆయనకి ఓకే. 

కానీ కాలం ఎప్పుడూ ఒకే ఫార్ములాతో బతుకుతానంటే ఒప్పుకోదు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వేసిన పాచికలు పారలేదు. భాజపాతో పొత్తు కుదిరే వాతావరణం లేదు. తోడుంటాడనుకున్న పవన్ కూడా భాజపాకి భయపడి సైకిలెక్కుండా పువ్వు వాసన చూసుకుంటూ గడిపే పరిస్థితి ఉంది ప్రస్తుతం. అయినా ఇప్పటికీ పవన్ భాజపాతో తెగతెంపులు చేసుకుని తనవైపుకి వస్తాడన్న ఆశ ఆయనలో ఉండొచ్చు. ఒకవేళ వస్తే ఏంటి అనేది ఆలోచిద్దాం. 

నిజానికి పవన్ చంద్రబాబు వైపుకి వస్తే చాలా స్థానాల్లో తమ శక్తిని చాటుకునే అవకాశముంది. వీరి కూటమికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే తెదేపా, జనసేనలిద్దరికీ చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే సీట్లు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలనీవనన్న పవన్ ప్రతిజ్ఞ చాలావరకు ఫలించే అవకాశముంది. 

ఆ నేపథ్యంలో ఒకవేళ గాలి తమవైపు తిరిగి, ప్రభుత్వాన్ని ఏర్పరచగల శక్తి వచ్చినా చంద్రబాబుకి పవన్ వర్గాన్ని తట్టుకోవడం అతికష్టంగా మారుతుంది. పవన్ ని కొంతవరకు మేనేజ్ చేయగలిగినా తమవల్లే తెదేపాకి ఊపిరొచ్చిందని జనసైనికులు గానీ, కాపులు కానీ చంద్రబాబుని పూచకపుల్లలా చూస్తారు. ఈ పరిస్థిని తట్టుకోవడం చంద్రబాబుకి ఆయన సామాజిక వర్గానికి అస్సలు సాధ్యం కాని పని. ఒకవేళ అధికారం రాకుండా గణనీయమైన సీట్లు గెలిచినా ఇదే పరిస్థితి. 

అదలా ఉంచితే ప్రస్తుతం దేశంలో అన్ని పార్టీల వారూ ఎవరితో ఒకరితో జట్టుకట్టి ఏదో ఒక కూటమిలో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎలాగూ ఏ కూటమీ అవసరం అని భావించడం గానీ, ఆశించడం గానీ లేదు కనుక ఎప్పటిలాగే ఆయన ఒంటరిపోరు సాగుతుంది. పైగా భజపాతో అప్రకటిత పొత్తులాంటిది ఉన్నా తన ముస్లిం మైనారిటీ ఓట్లకి గండిపడకుండా ఉండేందుకు ఎన్.డి.ఏ వైపు చూడనట్టే ఉన్నారు జగన్. అది భాజపాకి-వైకాపకి మధ్యన చేసుకున్న ఒక ఆంతరంగిక ఒప్పందం. 

ఇక పొత్తుకోసం అలుపెరుగని తపస్సు చేస్తున్న చంద్రబాబు మాత్రం ఘోరమైన అవమానభారాన్ని మోస్తున్నారు. ఇటు భాజపా గానీ, కొన్నాళ్లు పొత్తులో ఉన్న కాంగ్రెస్ కానీ చంద్రబాబుకి ఆహ్వానాన్ని ఇవ్వకపోవడం విధివైపరీత్యం కొంత, స్వయం కృతాపరాధం మరి కొంత. 

భాజపా మొహం చాటేసినా కూడా చంద్రబాబు ఇప్పటికీ పవన్ ని మధ్యలో పెట్టుకుని రాయబారాలు నడపడం, ఎక్కడో ఉన్న శ్వేతాచౌదరి, రఘురామరాజు, కొలికిపూడి లాంటి వాళ్ల సపోర్ట్ ని ఆస్వాదిస్తూ కాలం గడపడం చూస్తుంటే శత్రువుకైనా జాలివేయక మానదు.  

“పదవి దక్కకపోయినా పర్వాలేదు…ఐదేళ్లైనా, పదేళ్లైనా నా ఒంటరి పోరాటం ఆపను”, అని జగన్ 2014 లోనే అన్నారు. మాటకి తగ్గట్టుగా ఎన్ని కేసులు పెట్టినా ఉక్కిరిబిక్కిరవకుండా నిలబడడం వల్ల ప్రజలు రాజ్యం కట్టబెట్టారు. 

ఆ మొండితనం చంద్రబాబులో కనపడదు. పైన చెప్పుకున్నట్టు ఆయన ల్యాగులు భరించలేరు. పదవిలేకుండా కూర్చోవడమే ఆయన దృష్టిలో ల్యాగ్. 

ఏ పొత్తూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేసి ఓడిపోయినా పర్వాలేదు…వీరస్వర్గం అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా పొత్తుకోసం పరితపించి అది లేక నీరశించి ఓడినట్టుగా కనిపించినా, పొత్తు పెట్టుకుని ఓడినా చరిత్రహీనుడిగా మిగిలిపోవలసి వస్తుంది. పొత్తుపెట్టుకుని గెలిచినా చంద్రబాబు మాట వినరు, ఆయనకి అరక్షణం ప్రశాంతత కూడా మిగలనీయరు కాపువర్గం. ఇంతకీ ఇప్పుడు చంద్రబాబు దారెటు? ఆయనకే తెలియాలి. 

శ్రీనివాసమూర్తి