ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-AIతో ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు. అదే టైమ్ లో చాలా నష్టాలున్నాయని కూడా కొంతమంది వాదిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం కూడా నడుస్తోంది. ఓవైపు ఇలా ఏఐపై భిన్న వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు ఆన్ లైన్ మోసగాళ్లు, అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీని వాడడం మొదలుపెట్టారు.
మొన్నటికిమొన్న ఢిల్లీలో ఓ వ్యక్తికి కాల్ వచ్చింది. అది కూడా వీడియో కాల్. కాల్ ఆన్సర్ చేస్తే, తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నారు. తను చాలా కష్టాల్లో ఉన్నాను డబ్బులు పంపించమని ప్రాధేయపడ్డాడు. దీంతో సదరు వ్యక్తి డబ్బులు పంపించాడు. కానీ వీడియో కాల్ లో మాట్లాడిన వ్యక్తి, అంతా అనుకుంటున్నట్టు అసలైన వ్యక్తి కాదు.
తెలిసిన వ్యక్తి ముఖాన్ని తీసుకొని, ఏఐ టెక్నాలజీ ఆధారంగా వీడియో కాల్ చేసి ఈ మోసానికి తెరదీశారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా మోసంలో వీడియో కాల్ లో తెలిసిన వ్యక్తి ముఖం కనిపించడం మాత్రమే కాదు, అతడి ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది. దీంతో అనుమానించడానికి ఆస్కారం చాలా తక్కువ. ఇదో పెద్ద మోసం అని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఇలాంటిదే మరో ఘటన కేరళలో కూడా నమోదైంది. సోషల్ మీడియా నుంచి ప్రొఫైల్ పిక్చర్స్ దొంగిలించి, వాటి ద్వారా ఏఐ ఆధారిత వీడియోలు తయారుచేసి, ఇలా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదే టెక్నాలజీని ఉపయోగించి, నగ్న వీడియోలు కూడా తయారుచేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న బ్యాచ్ కూడా ఉంది.
ఇన్నాళ్లూ మెసెంజర్స్ ఛాటింగ్స్ చూసి మోసపోయారు జనం. ఇప్పుడిలా ఏఐ టెక్నాలజీ ద్వారా మరింత మోసపోతున్నారు. అవగాహన కలిగి ఉండడం, అప్రమత్తంగా ఉండడం మాత్రమే దీనికి సరైన నివారణ అంటున్నారు సైబర్ నిపుణులు. ఇలాంటి వీడియో కాల్స్ వచ్చినప్పుడు, అందులో కనిపించిన వ్యక్తికి, రివర్స్ లో ఫోన్ చేసి కన్ ఫర్మ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక నగ్న వీడియోల విషయంలో ఎమోషనల్ అవ్వకూడదని, వ్యక్తిగత స్థాయిలో నిజానిజాలు నిర్థారించుకోవాలని, అప్పటికీ పరిస్థితి చేజారిపోతే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాలని సూచిస్తున్నారు.