ఒక రేంజ్ కు చేరిన చాలా నిర్మాణ సంస్థలు పంపిణీ రంగంలోకి అడుగు పెట్టడం కామన్. ఎన్టీఆర్, ఎఎన్నార్ దగ్గర నుంచి వస్తోంది ఈ ఆనవాయతీ. అలాగే పంపిణీ రంగంలో వుంటూ నిర్మాణ రంగంలోకి వచ్చిన వారూ వున్నారు. రెండు చోట్ల సక్సెస్ కొట్టిన వారు వున్నారు, ఒక దగ్గర సక్సెస్ కొట్టి మరో దగ్గర గట్టి దెబ్బలు తిన్నవారూ వున్నారు.
ఆర్ఆర్ వెంకట్ లాంటి వాళ్లు సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా వుంటూ, డిస్ట్రిబ్యూషన్ లో దిగి చాలా గట్టి దెబ్బలు తిన్నారు. గీతా, దిల్ రాజు, ఆసియన్ సునీల్, సురేష్ బాబు లాంటి వాళ్లు రెండు పడవల మీద సక్సెస్ ఫుల్ గా ప్రయాణం సాగిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పంపిణీ రంగంలోకి దిగుతోంది. ఇన్నాళ్లు డైరెక్ట్ గా కాకున్నా పరొక్షంగా పంపిణీ రంగంలో అలా అలా ఏదో ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తొలిసారి అఫీషియల్ గా ఓ భారీ డబ్బింగ్ సినిమాను విడుదల చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్-విజయ్ కాంబినేషన్ లోని లియో సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను 18.50 కోట్లకు తీసుకున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి.
సినిమా ఏమాత్రం హిట్ అయినా జాక్ పాట్ నే. అందులో సందేహం లేదు. ఇది సక్సెస్ అయితే ఇకపై తెలుగులోకి మరో డిస్ట్రిబ్యూషన్ సంస్థ వచ్చినట్లే. అయితే ఈ సంస్థ నేరుగా పంపిణీ చేయకపోవచ్చు. సిండికేట్ పద్దతిలో ఏరియాకు ఒకరికి వంతున ఇచ్చి, లాభం చేతిలో వుంచుకునే అవకాశమే ఎక్కువ వుంది.