తెలుగు వాళ్లు కాపీ కొట్టిన చిరునవ్వు!

తెలుగు సినిమాలను పరాయి భాషల వారు రీమేక్ చేయడం కొంచెం అరుదు. మనవాళ్లు రీమేక్ చేసే సినిమాల సంఖ్యతో పోలిస్తే.. మన సినిమాలు రీమేక్ అయ్యేది తక్కువే! ఈ మధ్య కొంతలో కొంత బెటర్…

తెలుగు సినిమాలను పరాయి భాషల వారు రీమేక్ చేయడం కొంచెం అరుదు. మనవాళ్లు రీమేక్ చేసే సినిమాల సంఖ్యతో పోలిస్తే.. మన సినిమాలు రీమేక్ అయ్యేది తక్కువే! ఈ మధ్య కొంతలో కొంత బెటర్ కానీ దశాబ్దం కిందట వరకూ మన సినిమాలకు అంత క్రేజ్ కనిపించేది కాదు. అలాంటి పరిస్థితుల మధ్య తెలుగులో వచ్చి రెండు భాషల్లో రీమేక్ అయిన అరుదైన సినిమా ‘చిరునవ్వుతో’. వేణు హీరోగా జి.రాంప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సెన్సిబుల్ మూవీ తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యింది. తమిళంలో విజయ్ హీరోగా, కన్నడలో రవిచంద్రన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా పలు అవార్డులు దక్కాయి. ఉత్తమచిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే.. ఉత్తమ సంగీతం దర్శకుడు, ఉత్తమ మాటల రచయిత విభాగాల్లో ఈ సినిమా నంది అవార్డులపంటను పండించుకొంది! వీటన్నింటికీ మించి మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ ప్రస్థానానికి ప్రారంభంలో వచ్చిన  సినిమాగా ఇది తెలుగు వారికి గుర్తుండి పోతుంది. 

ఇక్కడ కట్ చేసి అంతకు మూడు సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి..‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’’ సినిమాను గుర్తు చేయాలి. ఇటాలియన్ భాషలో చెప్పాలంటే ‘లా విట ఈ బెల్లా’ 1997లో విడుదలై ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకొంది ఈ ఇటాలియన్ సినిమా. రోబర్టో బెనిగ్ని దర్శకత్వం వహించి ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచ సినీ ప్రేక్షకుల అత్యంత ఇష్టమైన సినిమాల జాబితాలో ఒకటిగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూధులు ఎదుర్కొన్న ఈతిబాధలను తెలియజేసే అద్భుతమైన సినిమాల్లో ఇదీ ఒకటి. పోలిష్ జెవ్స్  పై స్టీవెన్ స్పిల్ బెర్గ్ ‘షిండర్స్ లిస్’ ను తెరెకక్కించగా.. ఇటలీలోని జెవ్స్ పరిస్థితులను కళ్లకు కట్టారు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో. యూధులంటే చాలు నాజీలు కాల్చి చంపే పరిస్థితుల మధ్య ఒక యూధు కుటుంబం బతికిన విధానం.. ఒక తండ్రి ఈ పరిస్థితుల వల్ల తన కుమారుడి మనసు కల్మషం కాకుండా చేసే ప్రయత్నం.. తను చనిపోతూ కూడా కుమారుడి ఆనందం కోసం అతడు పడే తపన ఈ సినిమా. దీని క్లైమాక్స్ ను చూస్తే ఏ మనిషి కళ్లు అయినా చెమ్మగిల్లక మానవు. 

విషాధభరితంగా ముగిసే ఈ సినిమాలో వినోదానికి కొదవలేదు. ఎంత వినోదం అంటే.. ‘చిరునవ్వుతో’ సినిమాలో హీరో ఉత్సాహంగా కనిపిస్తూ పంచే వినోదమంత! వేణు హీరోగా నటించిన ఈ సినిమాతోనే పోలిక ఎందుకంటే.. ఇటాలియన్ సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లోని చాలా సీన్లను ‘చిరునవ్వుతో’ సినిమాలో కాపీ చేశారు! చాలా అంటే చాలా.. సీన్ టూ సీన్!

ప్రత్యేకించి.. హీరో హీరోయిన్ల ప్రేమ కథ అయితే దించేశారంతే! హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో ఏవైతే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటాయో.. ఆ సీన్లు అన్నీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలోనేవి! మ్యాజిక్ లా సాగే స్క్రిప్ట్ క్రెడిట్ అంతా ఇటాలియన్ రచయితకు , దర్శకుడికి ఇవ్వాల్సిందే. 

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ద్వితీయార్థం అంతా యూధులు పడే పాట్లు.. ఈ పాట్ల మధ్యన ప్రధాన పాత్రధారి తన పిల్లాడు భయాందోళనలకు గురి కాకుండా చూసుకొనేందుకు చేసే ప్రయత్నాలు.. ఆ ప్రయత్నాల్లో హృదయాన్ని తాకేలా ఉండటంతో సాగుతుంది. ప్రథమార్థం మాత్రం అంతా ప్రేమకథ. ప్రధాన పాత్రధారి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. వారి మధ్య ఆర్థిక అంతరాలుంటాయి. ఆ అంతరాలను తొలగించుకొంటూ.. తనను అమితంగా ఆకట్టుకొన్నఅమ్మాయిని దరిచేర్చుకోవడానికి కలిసి వచ్చే పరిస్థితులను ఉపయోగించుకొంటూ మ్యాజిక్ చేస్తుంటాడు. ఆ మ్యాజిక్ లనే మనోళ్లు లేపుకొచ్చారు! అచ్చంగా దించేశారు. ఇలా కార్బన్ కాపీగా వచ్చిన ‘చిరునవ్వుతో’ జనాల్ని ఆకట్టుకొంది. పక్క భాషల వాళ్లనూ ఆకట్టుకొంది… అక్కడ రీమేక్ అయ్యింది. హిట్ అయ్యింది. 

‘చిరునవ్వుతో’ సినిమాకు స్క్రిప్ట్ రచయిత రాం ప్రసాద్.. మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి వీళ్లలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి సీన్లను స్ఫూర్తి పొందింది ఎవరో! మరి దాన్ని ‘కాపీ’ అన్నా.. ‘స్ఫూర్తి’ అని చెప్పినా.. ఎప్పుడైనా ‘చిరనవ్వుతో’ సినిమాను చూసి నవ్వుకొంటే.. అప్పుడు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా సృష్టికర్తలను తలుచుకోవాలి! 

కొసమెరుపు: తనను నాజీ పోలీసులు పట్టుకుపోయే పరిస్థితులను.. తన కుమారుడికి అదంతా  ఒక ఆటగా చెబుతాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరో. ‘‘వాళ్లు వస్తారు.. నన్ను పట్టు కెలతారు.. ఇదంతా ఒక ఆట. నువ్వు భయపడకూదు… అంటూ చెబుతుంటాడు. పిల్లాడికి అలాంటి అబద్ధాలు చెబుతూ.. అతడి ఆనందం మధ్యనే తను నిష్ర్కమించాలనేది తండ్రిగా అతడి తపన. కళ్లారా చూసినప్పుడు అద్భుతమనిస్తాయి ఆ సీన్లు. ఈ ఛాయలు ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా కనిపిస్తాయి. ఆస్తులన్నీ పోయి.. ఒక సాధారణ ఇంటిలోకి వచ్చాకా  హీరో అల్లు అర్జున్ తన అన్నకూతురికి ‘ఇదంతా రియాలిటీ షో’ అనే అబద్ధం చెబుతాడు. విషాధంలో కూడా ఆ అమ్మాయిని ఆనంద పెట్టే ప్రయత్నం చేస్తాడు. బహుశా.. త్రివిక్రమ్ పై ఉన్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ప్రభావానికి ఇది కూడా ఒక నిదర్శనమేనేమో!