ఫ్యామిలీ మిత్రుడితో ష‌ర్మిల తాడోపేడో!

ఎట్ట‌కేల‌కు ఖ‌మ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయ‌డానికే వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని గ‌తంలో ష‌ర్మిల అన్న మాట‌కు క‌ట్టుబ‌డి, అక్క‌డి నుంచే బ‌రిలోకి దిగ‌డానికి…

ఎట్ట‌కేల‌కు ఖ‌మ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయ‌డానికే వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని గ‌తంలో ష‌ర్మిల అన్న మాట‌కు క‌ట్టుబ‌డి, అక్క‌డి నుంచే బ‌రిలోకి దిగ‌డానికి ఆమె రెడీ అవుతున్నారు. పాలేరు కాంగ్రెస్‌కు కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఉపేంద‌ర్‌రెడ్డి గెలుపొందారు. అనంత‌రం ఆయ‌న బీఆర్ఎస్‌లో చేరారు. రానున్న ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున ఆయ‌న బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు టికెట్ కూడా ఖ‌రారైంది.

పాలేరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్ కుటుంబానికి పొంగులేటి స‌న్నిహితుడు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి వైసీపీ త‌ర‌పున పొంగులేటి గెలుపొందిన సంగతి తెలిసిందే.

అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ఎస్‌లో పొంగులేటి చేరారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. అప్ప‌టి నుంచి అసంతృప్తిగా ఉన్న పొంగులేటి, ఎట్టకేల‌కు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్య‌మంటూ ఆయ‌న ప్ర‌తిజ్ఞ చేశారు. ఇదిలా వుండ‌గా పొంగులేటిపై ష‌ర్మిల పోటీకి సిద్ధం కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కుటుంబ స‌న్నిహితుడైన పొంగులేటికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా రేవంత్‌రెడ్డిపై కొడంగ‌ల్ నుంచి ష‌ర్మిల పోటీ చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

న‌వంబ‌ర్ 1 నుంచి పాలేరులో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 4న ష‌ర్మిల నామినేష‌న్ వేస్తార‌ని స‌మాచారం. ఏది ఏమైనా పొంగులేటిపై ష‌ర్మిల పోటీ స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. ష‌ర్మిల గెలుస్తారా? లేక ఓట్లు చీల్చి మ‌రెవ‌రినైనా గెలిపించ‌డం లేదా ఓడించ‌డం చేస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ముఖ్యంగా ష‌ర్మిల పోటీతో ముక్కోణ‌పు పోటీ త‌ప్ప‌దు. కాంగ్రెస్ ఓట్ల‌ను ష‌ర్మిల చీలుస్తార‌ని, త‌ద్వారా బీఆర్ఎస్‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తార‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది.