టాలీవుడ్‌.. ఛలో గుంటూర్‌.!

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి తరలిపోతుందా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ‘తెలుగు సినీ పరిశ్రమ తరలింపు’ అంశంపై చాలా చర్చ జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినీ…

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి తరలిపోతుందా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ‘తెలుగు సినీ పరిశ్రమ తరలింపు’ అంశంపై చాలా చర్చ జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినీ పరిశ్రమపై ఉద్యమం ముసుగులో కొందరు చేసిన దాడులతో ఓ దశలో తెలుగు సినీ పరిశ్రమకు స్థానచలనం తప్పదేమో.. అన్న అభిప్రాయాలు సినీ ప్రముఖుల్లోనే వ్యక్తమయ్యాయి.

ఇక, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా ఏర్పడ్డాక.. హైద్రాబాద్‌ నుంచి తెలుగు సినీ పరిశ్రమ చెన్నయ్‌కో, లేదంటే వైజాగ్‌కో తరలిపోతుందనే గాసిప్స్‌ ఓ రేంజ్‌లో గుప్పుమన్నాయి. ఆ దిశగా కొందరు సినీ ప్రముఖులు ఆలోచన చేశారట కూడా. అయితే, కొత్త ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేకపోవడం, సినీ ప్రముఖులంతా హైద్రాబాద్‌లోనే సెటిలైపోవడంతో ‘స్థానచలనం’ గురించిన ఆలోచనను పక్కన పెట్టేశారు.

అయితే, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త రాజధాని.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదే పదే చెబుతుండడం, ఆ దిశగా భూ సమీకరణ చేపట్టడం, దాంతోపాటుగా రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌, జపాన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ఇవన్నీ తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారిని ఏపీ కొత్త రాజధాని వైపు ఆలోచించేలా చేస్తున్నాయట.

కమెడియన్‌ అలీ, గుంటూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, త్వరలో తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు వచ్చేస్తుందని వ్యాఖ్యానించడం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినీ పరిశ్రమలో మెజార్టీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతంపై మమకారం ఎక్కువగా వారు చూపిస్తే తప్పేంటట.? ఆ లెక్కన తెలుగు సినీ పరిశ్రమకు స్థానచలనం తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు కొందరు.

అలీ ఏ ఉద్దేశ్యంతో అన్నాడు, అసలాయన ఏం వ్యాఖ్యానించాడు.? అన్నదానిపై రేపో మాపో క్లారిటీ వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తే, తెలుగు సినీ పరిశ్రమ ఇంకో చోటికి వెళ్ళే అవకాశమే లేదు. ఆ దిశగా సినీ ప్రముఖులెవరూ ఆలోచించడంలేదు కూడా. దానిక్కారణం, వారంతా హైద్రాబాద్‌లోనే స్థిరపడిపోవడం, హైద్రాబాద్‌ పరిసరాల్లోనే స్థిరాస్థుల్ని పెంచుకోవడం.

మొత్తమ్మీద, టాలీవుడ్‌.. ఛలో గుంటూర్‌.. అన్న మాట ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ఉత్సాహాన్నిస్తోందిగానీ, ఈ నినాదంతో కొత్త తంటాలేమీ రావు కదా.. అని సినీ పరిశ్రమ ఆందోళన చెందాల్సి వస్తోంది.