గోడ్సేని ఎలా చూడాలి? సీరీస్ స్పందనల్లో ఒక పాఠకుడు '..ముక్కలు, ముక్కలుగా..' అంటూ నేను సీరియల్స్ మేన్‌టేన్ చేసే విధానాన్ని వెక్కిరించాడు. ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తూ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాను. నడుస్తున్న రాజకీయాంశాల నుండి దృష్టి మరలించి సీరియళ్లు పూర్తి చేయడం పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాను. ఆ పాఠకుడు రాజీవ్ హత్య సీరియల్ గురించి స్పందించ వలసివస్తే దాన్ని 'తునాతునకలుగా (రాజీవ్ బాంబుదాడికి గురయ్యాడు కదా) చదవాలి' అని వర్ణించి వుండేవారు. ఎందుకంటే 25 నెలలుగా దాన్ని అసంపూర్తిగా వదిలేశాను. ఇన్నాళ్లకు కొనసాగిస్తున్నాను. 57 వ భాగం వరకు చదివిన వారు మర్చిపోయి వుండవచ్చు. రెండేళ్ల లోపు యీ వెబ్‌సైట్‌కు పరిచయమైనవారికి అసలేమీ తెలిసి వుండకపోవచ్చు. పాత భాగాలు చదువుదామనుకునేవారు, జ్ఞప్తికి తెచ్చుకుందామనుకునేవారు యీ లింకు ఒక్కసారి చూసుకుని ముందుకు సాగమని కోరుతున్నాను. http://telugu.greatandhra.com/mbs/political/serials_archieves.php
xxxxxxxxxxxx
సీరియల్లో వచ్చే అసంఖ్యాకమైన వ్యక్తుల పేర్లు గుర్తుకు రావడానికి వారి పరిచయం యిక్కడే యిస్తున్నాను. ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి. పాత్రలు (అకారాది క్రమంలో) – అఖిల – ఎల్‌టిటిఇ విమెన్స్ యింటెలిజెన్సు వింగ్ డిప్యూటీ చీఫ్, ప్రభాకరన్, పొట్టు అమ్మన్లతో కలిసి రాజీవ్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి * అతిరై/గౌరి/సోనియా/చంద్రలేఖ – తమిళ ఆడపులి, క్రిప్టాలజిస్ట్, కనకసభాపతితో బాటు ఢిల్లీ వెళ్లింది, పట్టుబడింది, ఢిల్లీలో జయలలితను చంపుదామని ప్లాను వేసింది * అరివు పెరరివాళన్ – శుభాసుందరం వద్ద పనిచేశాడు. హరిబాబుకు స్నేహితుడు, పేలుడు సాధనాల నిపుణుడు, బాంబు తయారుచేశాడు, శివరాజన్‌కు విహెచ్ఎఫ్ పరికరాలు అమర్చిపెట్టాడు, అరెస్టయ్యాడు * ఇరుంబొరై – తిరుచ్చి శంతన్ వార్తాహరుడు, 1990 మేలో బేబి సుబ్రమణియం, అరివులతో జాఫ్నా వెళ్లాడు * కనక సభాపతి/రాధా అయ్య – ఢిల్లీ కాంప్ ఆర్గనైజ్ చేయబోయాడు * కాంతన్ – ఎల్‌టిటిఇ ఇంటెలిజెన్సు విభాగానికి చెందినవాడు, డిక్సన్ వద్ద పనిచేశాడు * కార్తికేయన్ – సిట్ బృందం అధిపతి * కీర్తి – హంతక ముఠాలో సభ్యుడు * గుణ – డిక్సన్ వద్ద పనిచేశాడు
* చొక్కన్ – శివరాజన్ అనుచరుడు * జయకుమార్ – రాబర్ట్ పయాస్ బావ, కొడుంగయూర్‌లోని ముత్తమిల్ నగర్లో యితని యిల్లు శివరాజన్‌కు స్థావరం * డిక్సన్ – కోయంబత్తూర్ వాసి, తిరుచ్చిశంతన్ కింద పనిచేస్తాడు, శివరాజన్ ముఠాను తమిళ రాజకీయనాయకులకు పరిచయం చేశాడు * డేవిడ్- పద్మనాభన్ హత్యకేసులో నిందితుడు, 1990 జూన్‌లో జాఫ్నానుండి వచ్చాడు * తంబి అన్న – శివరాజన్ ముఠా తరఫున బంగారు బిస్కట్లు అమ్ముతాడు * తిరుచ్చి శంతన్ – తమిళనాడులో ఎల్‌టిటిఇ రాజకీయ విభాగానికి చెందినవాడు * థాను/అన్బు – రాజీవ్‌ను చంపిన మానవబాంబు * నళిని – పద్మ కూతురు, భాగ్యనాథన్ అక్క, అడయార్‌లో వుండే అనబాండ్ సిలికాన్ ప్రై లి. కంపెనీ ఉద్యోగిని, తల్లితో పోట్లాడి విడిగా వుండేది, మురుగన్ కారణంగా వెనక్కి వచ్చి మళ్లీ వెళ్లి పోయింది. హరిబాబును మురుగన్‌కు పరిచయం చేసింది, హత్యలో ముఖ్యపాత్రధారి, మురుగన్‌ను పెళ్లాడింది, అరెస్టయి జైల్లో వుంది * నిక్సన్/నిశాంతన్ – ఎల్టిటిఈ ఇంటెలిజెన్సులో ముఖ్యమైనవాడు, పోరూరులో వుండేవాడు. ముత్తురాజా యితన్ని భాగ్యనాథన్, అరివులకు పరిచయం చేశాడు * నెహ్రూ – శివరాజన్ స్వంత వైర్లెస్ ఆపరేటర్
* పద్మ – నర్సు, భాగ్యనాథన్, నళినిల తల్లి * ప్రభాకరన్ ఎల్‌టిటిఇ చీఫ్ * పొట్టు అమ్మన్ – ఎల్‌టిటిఇ యింటెలిజెన్సు విభాగం అధిపతి * బేబి/బాల సుబ్రమణియం – తమిళనాడులో ఎల్టిటిఈ పనులన్నీ చూశాడు, శుభాసుందరం ఆఫీసులో భాగ్యనాథన్ను కలిసి అతన్ని దృక్పథం మార్చాడు, ప్రెస్ చౌకగా అమ్మేశాడు, స్థావరాలు ఏర్పాటు చేశాడు, హత్య తర్వాత జాఫ్నాకు వెళ్లిపోయాడు * భాగ్యనాథన్ – పద్మ కొడుకు. బిపిఎల్ ఆల్‌రౌండర్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని. నళిని అన్న. క్యాంప్ నడిపాడు * భాస్కరన్ – శివరాజన్‌కు ఆశ్రయం యిచ్చాడు. సెల్వలక్ష్మితండ్రి, విజయన్‌కు మామ * మహాలింగం – షణ్ముగం వద్ద పనిచేసే పడవవాడు, డేవిడ్‌ను 1990 జూన్‌లో శ్రీలంకకు దాటించాడు, 1991 జూన్‌లో రమణన్ వైర్లెస్ సెట్టు తెచ్చాడు * ముత్తురాజా – భాగ్యనాథన్ స్నేహితుడు, బేబీ సుబ్రమణియం కింద పనిచేసే వాడు, తమిళనాడులో ఎల్టిటిఈ హెడ్‌క్వార్టర్స్, కమ్యూనికేషన్ ఏర్పాట్లు చూశాడు * మురుగన్/దాసు/ఇందుమాస్టరు/శ్రీహరన్ – శివరాజన్ సహాయకుడు, నళిని ప్రియుడు, మొగుడు, భాగ్యనాథన్ యింట్లో బేబి సుబ్రమణియం ద్వారా చోటు సంపాదించుకున్నాడు, మడిపాక్కంలో వుంటాడు, పేలుడు సాధనాల నిపుణుడు, అరెస్టయ్యాడు * మూర్తి – సురేష్ మాస్టర్ అనుచరుడు * మోహన్‌దాస్ కె.- పోలీసు అధికారి, సార్క్ సమావేశాల్లో ప్రభాకరన్‌ని ఆయుధాలు స్వాధీనం చేసుకుని, హౌస్ ఎరెస్టు చేశాడు * మృదుల – రంగనాథ్ భార్య
* రమణన్ – కాంతన్ వైర్లెస్ ఆపరేటర్, పయాస్ దగ్గర వుంటాడు, హత్య తర్వాత పారిపోయాడు * రవిచంద్రన్ /ప్రకాశం – పొట్టు అమ్మన్ దళానికి చెందిన భారతీయుడు. జయరామన్ యింటికి వస్తూ పోయేవాడు, ఎల్టిటిఈ కోసం ఇండియన్స్‌ను జాఫ్నా తీసుకెళ్లి తర్ఫీదు యిప్పిస్తాడు, టిఎన్ఆర్టి, శివరాజన్ హత్య తర్వాత పోలీసు అధికారిని చంపమని అమ్మన్ యితన్ని ఆదేశించాడు * జరవిశంకర్ – ఎల్‌టిటిఇ మద్దతుదారుడు, రిహార్సల్ దాడులు ఫోటో తీశాడు, హరిబాబుకు కెమెరా అరువిచ్చాడు, పోలీసులకు చిక్కాడు * రంగన్ – శ్రీలంక తమిళుడు. నకిలీ పాస్‌పోర్టుల్లో ఘనుడు, డిక్సన్ను కలిసేవాడు, ఎల్‌టిటిఇ లీడర్ శంకర్ డ్రైవర్. శివరాజన్ ముఠాను బెంగళూరు తరలించాడు. అక్కడ వాళ్ల బాగోగులు చూశాడు * రంగనాథ్ – ముఠాకు బెంగుళూరులో శిబిరాలు చూపినవాడు * రాజు/ధనశేఖరన్ – ఖాళీ టాంకర్లో శివరాజన్ ముఠాను బెంగుళూరుకు తరలించినవాడు * రాబర్ట్ పయాస్ – పోరూరులో ఎల్‌టిటిఇ ప్రథమస్థావరం, అరివు స్నేహితుడు, శివరాజన్‌తో బాటు డ్రైవింగ్ లైసెన్సు * రూసో/శంకర్ కోనేశ్వరన్ – శివరాజన్ సహాయకుడు, హంతకముఠాలో సభ్యుడు జ వరదన్ – శంతన్ వైర్లెస్ ఆపరేటర్ * వసంతన్ తిరుచ్చి శంతన్ అసిస్టెంటు
* వానన్ – శ్రీలంక స్మగ్లర్ * విక్కీ – రంగన్‌కు అనుచరుడు, కోయంబత్తూర్ శిబిరంలో డిక్సన్, గుణ, రఘులతో కలిసి వున్నాడు * విజయన్ – భాస్కరన్ అల్లుడు, కొడుంగైయూర్ స్థావరంలో భాగస్వామి జ విజయానందన్ – హంతక ముఠాలో సభ్యుడు * శివందన్ – తిరుచ్చి శంతన్ తరఫున సేలంలో ఎల్‌టిటిఇ శిబిరాన్ని నడిపాడు * శివరాజన్/రఘు – గతంలో పద్మనాభన్‌ను హత్య చేశాడు రాజవ్ హత్యకు సూత్రధారి * శివరూపన్/సురేష్ కుమార్ – పొట్టు అమ్మన్ వైర్లెస్ ఆపరేటర్, కాలు లేదు, మురుగన్ యింట్లో దొరికిన ఆధారాలతో జయపూర్‌లో పట్టుబడ్డాడు * శివథను – పద్మనాభ హత్యకేసులో ముద్దాయి * శుభ/నిత్య – శివరాజన్‌కు సహాయకురాలు, షాడో స్క్వాడ్ సభ్యురాలు, థానుకు ప్రత్యామ్నాయం * శుభాసుందరం – ఫోటో జర్నలిస్టు, శుభం ఫోటో ఏజన్సీ నడిపాడు, ఎల్‌టిటిఇ సమర్థకుడు, భాగ్యనాథన్ అతని వద్ద ఫోటోగ్రఫీకోసం చేరాడు * సీతారామన్ – షణ్ముగం మామ * సుధేంద్ర రాజా/సుతేంతిర రాజా/రాజా/శాంతన్ – శివరాజన్ రైట్ హ్యాండ్ * సురేష్ మాస్టర్ – ఎల్‌టిటిఇ రాజకీయ విభాగంలో పనిచేస్తాడు, బెంగుళూరులో శిబిరాలు ఏర్పాటు చేశాడు * షణ్ముగం – వేదారణ్యం స్మగ్లర్, వింత పరిస్థితుల్లో చనిపోయాడు * హరిబాబు – ముత్తురాజా స్టూడియోలో ఫోటోగ్రాఫర్, రవిశంకర్ వద్దనుండి కెమెరా తెచ్చుకుని హత్య ఫోటోలు తీశాడు, పేలుడులో చనిపోయాడు, ఇతని కెమెరా దొరకడంతోనే విషయాలన్నీ బయటకు వచ్చాయి.
xxxxxxxxxxxxx
ఇక కథ ఎంతవరకు వచ్చిందంటే – 1991 మే 21 న రాజీవ్ హత్య జరిగింది. హంతకులను పట్టుకోవడానికి సిట్ ఏర్పరచారు. విస్తృతంగా విచారణ జరిపి, అది ఎల్‌టిటిఇ పాత్రను నిర్ధారించుకుంది. జులై 20 వచ్చేసరికి శివరాజన్ ముఠా కోసం తమిళనాడంతా ఉచ్చు బిగించింది. ఎల్‌టిటిఇ సానుభూతిపరుడు తిరుచ్చి శంతన్ వాళ్లను జులై 15 న బెంగుళూరు పంపించివేశాడు. వేదారణ్యంలో ఎల్‌టిటిఇకి సాయపడిన షణ్ముగం అనే స్మగ్లరు సిబిఐ చేతికి చిక్కి వివరాలు చెపుతూనే విచిత్రపరిస్థితుల్లో చనిపోయాడు. సిట్ అబాసుపాలైంది. షణ్ముగం వంటి స్మగ్లర్, మాజీ ప్రధానిని హత్య చేసిన విదేశీ తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిన షణ్ముగం చనిపోతే అతని మృతికి సానుభూతిగా వేదారణ్యంలో షాపులన్నీ ఒక రోజు మూసివేయడం సిట్‌ను నిర్ఘాంతపరచింది. ఎల్‌టిటిఇ అంటే స్థానికుల్లో భయమో, భక్తో తెలియదు. విషయ సేకరణకు వీరు ఏ మేరకు సహకరిస్తారో తెలియదు.
జులై 21 – ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ''షణ్ముగంది కస్టడీ చావా? ఆత్మహత్యా?'' అనే పేర కథనం వచ్చింది. కానీ సిట్ స్థయిర్యం చెదరలేదు. పట్టువదలకుండా షణ్ముగం సహచరులను పట్టుకుని పాతరలన్నీ తీయించి, మురుగన్ షణ్ముగానికి అప్పగించిన సూట్కేసుల్ని, సంచుల్ని సంపాదించారు. ఆ సూటుకేసుల్లో మురుగన్ చేతికి శివరాజన్ యిచ్చిన ఉత్తరం, బేబీ సుబ్రమణ్యంకు 'ఎల్టిటి కోసం నేను ఎలాంటి మద్దతైనా, ఎప్పటికీ యిస్తూనే వుంటాను' అని భాగ్యనాథన్ రాసిన ఉత్తరం, 1991 మే 9న శుభ, థానులు యిద్దరూ కలిసి 'మేం ఇండియాకు ఏ లక్ష్యంతో వచ్చామో అది విజయవంతంగా నెరవేరుతుందని మా నమ్మకం. విపి సింగ్ సభలో చేసిన రెక్కీతో మాకు విశ్వాసం పెరిగింది.' అంటూ ఎల్‌టిటిఇ యింటెలిజెన్సు విభాగం అధిపతి పొట్టుఅమ్మన్కు, 'మా చివరిశ్వాస వరకు మీరు చెప్పిన ప్రతి మాట మా చెవుల్లో ధ్వనిస్తూ వుంటుంది. మారువేషం (ఆత్మాహుతి సూట్) ధరించటం తథ్యం' అంటూ మానవబాంబు ఐడియాకు రూపకల్పన చేసిన ఎల్‌టిటిఇ విమెన్స్ యింటెలిజెన్సు వింగ్ డిప్యూటీ చీఫ్ అఖిలకు రాసిన ఉత్తరం కూడా దొరికాయి. చెన్నయ్ నగరంలోని కొన్ని కీలకప్రాంతాలను చాలా వివరంగా చిత్రీకరించిన వీడియో క్యాసెట్, సాటానిక్ ఫోర్సెస్ పుస్తకం సెట్టు, పొట్టు అమ్మన్కి సబ్మిట్ చేయడానికి మురుగన్ తయారుచేసుకున్న జమాఖర్చుల వివరాలు కూడా సూటుకేసుల్లో దొరికాయి. కొట్టివాక్కంలోని ఎల్‌టిటిఇ శిబిరంలో సిట్వారికి శివరాజన్, శుభలకు చెందిన చాలా వస్తువుల్లో దొరికాయి. వాటిల్లో శివరాజన్ డైరీ, శుభ ఆటోగ్రాఫ్‌ల పుస్తకం వున్నాయి. చేతిరాత చూస్తే సరిపోయింది. ఎల్‌టిటిఇ హస్తం విషయంలో కోర్టులు కూడా శంకించడానికి ఏమీ లేదు. అయినా ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్‌కు పంపి, చేతిరాతలు, వేలి ముద్రలు పోల్చి చూడమన్నారు – కోర్టులో ఆధారాలుగా యివ్వడానికి.
xxxxxxxxxxxxxx
అదే రోజున ఎల్‌టిటిఇ రాజకీయవిభాగానికి, రాజీవ్ హత్యకు సంబంధం వుందనే విషయం నిర్ధారించే ఆధారం కూడా దొరికింది. పోరూరులో రాబర్ట్ పయాస్ యిల్లు సోదా చేసినప్పుడు సిట్‌కు దొరికిన సామగ్రిలో ఒక ఖాళీ కవరు వుంది. ఆ కవరు మీద సెయింట్ థామస్ మౌంట్ సమీపంలో వున్న ఒక ఫోటో స్టూడియో తాలూకు స్టాంపు వుంది. ఆ స్టాంపు ఆధారంగా సిట్ దళం ఒకటి స్టూడియోకి వెళ్లి ఫోటోల నెగటివ్లన్నీ చూపించమన్నారు. వాటిల్లో 1990 డిసెంబరులో పయాస్, శివరాజన్ కలిసి దిగిన ఫోటో దొరికింది. ఆ ఫోటోలో శివరాజన్ తన అసలైన ఒంటికన్నుతో కనబడుతున్నాడు. అతనికి ఒక కన్నే కనబడుతుందన్న నిర్ధారణ అయిపోయింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)
(ఫోటోలు – కుట్ర స్వరూపాన్ని వివరించే డయాగ్రాం, షణ్ముగం దాచి పెట్టిన మారణాయుధాలు, ఒంటికన్నుతో శివరాజన్)
ఫోటో సౌజన్యం – ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్