ఇది చాలా చిత్రంగా ఉంది. ఏపీ రాజకీయాలలో ఢీ అంటే ఢీ అంటున్న అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య సఖ్యతను ఎవరూ అసలు ఊహించరు. ఉప్పు నిప్పులా రెండు పార్టీల మధ్య వివాదాలు ఉంటూనే ఉంటాయి. అలాంటిది వైసీపీకి టీడీపీ ఓటేస్తే అది వింతలోకెల్లా పెద్ద వింత అవుతుంది.
విశాఖ కార్పోరేషన్ లో అదే జరిగింది. బుధవారం జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ల పదవులకు పదికి పది వైసీపీ గెలుచుకుంది విజయ దరహాసం చేసింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ పది పోస్టులకు తన అభ్యర్ధులను నిలబెడితే టీడీపీ కూడా తొమ్మిది మందిని నిలబెట్టి పోటీ పడింది. జీవీఎంసీలో వైసీపీకి ఉన్న బలం చూస్తే 62 మంది కార్పోరేటర్లు ఉన్నారు. కానీ వైసీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు చూస్తే ఒక్కో అభ్యర్ధికీ 63..64..66 ఓట్లుగా పడ్డాయి. అంటే వారి బలం కంటే అదనంగా ఓట్లు వచ్చాయన్న మాట.
ఇలా అదనంగా వచ్చిన ఓట్లను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థులకు టిడిపి కార్పొరేటర్లు ఓటేసిన వైనం కనిపిస్తోంది అని అంటున్నారు. జీవీఎంసీలో మొత్తం 98 కార్పోరేటర్లు ఉన్నారు. 21 వార్డు అందులో ఖాళీగా ఉంది. జనసేన నుంచి నలుగురు, వామపక్షాల నుంచి ఇద్దరు, విదేశాలలో ఉన్న వైసీపీ కార్పోరేటర్లు ఇద్దరు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. 89 మంది కార్పోరేటర్లు ఓటింగ్ కు హాజరయ్యారు. టీడీపీకి 29 మంది కార్పోరేటర్లు ఉన్నారు.
వీరిలో ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో కానీ వైసీపీ అభ్యర్ధులకు అదనంగా ఓట్లు వచ్చాయి. అయితే బలం లేకపోయినా పోటీ పెట్టిన టీడీపీకి ఇది మరోసారి పరాభవం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ పార్టీ వారే సొంత పార్టీ అభ్యర్ధులకు ఓటు వేయలేదని విమర్శిస్తున్నారు. అయితే అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరిపిందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది.