పబ్ జీ ద్వారా ఓ భారతీయుడితో పరిచయం పెంచుకొని, ప్రేమలో పడి, ప్రియుడ్ని కలిసేందుకు, తన భర్తను విడిచి, నలుగురు పిల్లలతో కలిసి ఇండియా చేరుకున్న పాకిస్థానీ మహిళ, సీమా హైదర్ మరింత వివాదాస్పదంగా మారింది. పోలీసుల విచారణలో ఆమె స్పందిస్తున్న తీరు, ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఈ అనుమానాలకు మరింత తావిస్తున్నాయి.
తప్పుడు డాక్యుమెంట్లు.. ధీమాగా సమాధానాలు..
పోలీసుల విచారణలో భాగంగా పాక్ మహిళ సీమా హైదర్ ఎలాంటి బెరుకు లేకుండా సమాధానాలు చెబుతోంది. దీంతో పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకుంటే, ఐఎస్ఐ శిక్షణలో ఇది కూడా ఓ భాగం కాబట్టి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే అంశంపై సీమా ముందుగానే ట్రైనింగ్ తీసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఆమె డాక్యుమెంట్లు మరింత వివాదాస్పదంగా ఉన్నాయి. పాకిస్థాన్ లో పుట్టిన వెంటనే గుర్తింపు కార్డు ఇస్తారు. కానీ సీమా మాత్రం ఆ కార్డును 2022లో పొందినట్టు ఉంది. దీంతో పాటు ఆమె పిల్లల కార్డుల్ని కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
సోదరుడు పాకిస్థాన్ ఆర్మీ..
ఇవన్నీ పక్కనపెడితే.. ఓ కీలకమైన అంశాన్ని సీమ కావాలనే దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అదేంటంటే, సీమకు వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. కుటుంబ వివరాలు అడిగినప్పుడు ఈ విషయాన్ని సీమ కావాలని దాచిపెట్టినట్టు గుర్తించారు పోలీసులు. పాక్ ఆర్మీకి, సీమకు సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు సీమను అనుమానించడానికి మరో బలమైన కారణం కూడా ఉంది.
నేపాల్ లో రూమ్ పై ఆరా..
సీమ కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. పాక్ లో ఆమె పెద్దగా తిరిగిన దాఖలాలు కూడా లేవు. అలాంటి వ్యక్తి పాక్ నుంచి దుబాయ్ కు వెళ్లి, అట్నుంచి అటు నేపాల్ కు వచ్చి, నేపాల్ నుంచి ఇండియాలోకి ప్రవేశించడం మామూలు విషయం కాదు. కచ్చితంగా ఆమెకు ఎవరో సహకరించి ఉంటారనేది పోలీసుల అనుమానం. నేపాల్ నుంచి ఇండియాలోకి రావడానికి సీమ ప్రియుడు, ఢిల్లీ వాసి సచిన్ సహకరించాడనేది స్పష్టం. అయితే పాక్ నుంచి నేపాల్ వచ్చేవరకు ఏం జరిగిందనేది, సీమాకు ఎవరు సహకరించారనేది అనుమానాస్పదంగా మారింది. ఖాట్మాండు హోటల్ లో సీమ-సచిన్ బస చేసిన హోటల్ పై కూడా భారత నిఘావర్గాలు దృష్టి పెట్టాయి.
పబ్ జీ ఎకౌంట్ ఓపెన్ చేయనంటోంది..
మరోవైపు టెక్నికల్ ఆధారాలపై కూడా పోలీసులు దృష్టిపెట్టారు. సీమా తన పబ్ జీ ఖాతా ఓపెన్ చేస్తే, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే, పబ్ జీ ద్వారానే చాలామంది ఉగ్రవాదులు సమాచారాన్ని పరస్పరం పంపించుకుంటున్నారని పోలీసుల వద్ద సమాచారం ఉంది. కాబట్టి సీమ, తన ఖాతా తెరిస్తే అసలు సంగతి బయటకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడో సమస్య ఉంది.
సీమా పబ్ జీ ఎకౌంట్ పాక్ లో తెరిచింది. ఇక ఆ పబ్ జీ సర్వర్ చైనాకు చెందింది. సో.. భారత్ లో ఆమె ఖాతా ఓపెన్ అవుతుందా అవ్వదా అనేది మరో డౌట్. దీనికితోడు తన పబ్ జీ ఖాతాను ఓపెన్ చేయడానికి సీమా నిరాకరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
వెనక్కు పంపించే అవకాశాలే ఎక్కువ
తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. సీమాను వెనక్కు పంపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె పాకిస్థాన్ ఏజెంజా, ఉగ్రవాదా అనే విషయాల్ని పక్కనపెడితే.. ప్రాధమికంగా చూసుకుంటే, ఆమె అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినట్టయింది. కేవలం ప్రేమ కోసమే తను ఈ సాహసం చేశానని, తన కేసును మానవతా దృక్పథంతో చూడాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఆమెను తిరిగి పాకిస్థాన్ కు పంపించేయాలని దాదాపు ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.