ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -3

ఇక ఆంధ్రమూలాలున్న వారి ఓట్ల గురించి కూడా చర్చ నడుస్తోంది. అవి కనీసం 40 సీట్లలో ప్రభావం కనబరుస్తాయి. అందుకే 'వాళ్లను కడుపులో పెట్టుకుంటాం, రక్షిస్తాం, పెట్టుబడులు పెడితే ఆదరిస్తాం' అంటూ అందరూ హామీలు…

ఇక ఆంధ్రమూలాలున్న వారి ఓట్ల గురించి కూడా చర్చ నడుస్తోంది. అవి కనీసం 40 సీట్లలో ప్రభావం కనబరుస్తాయి. అందుకే 'వాళ్లను కడుపులో పెట్టుకుంటాం, రక్షిస్తాం, పెట్టుబడులు పెడితే ఆదరిస్తాం' అంటూ అందరూ హామీలు గుప్పిస్తున్నారు. ఇవి చెప్తారు కానీ 'వాళ్లనీ ఉద్యోగాలకు అప్లయి చేసుకోనిస్తాం, మాతో బాటు ఎన్నికలలో పోటీ పడనిస్తాం' అనరు. 'మీరు పెట్టుబడి పెట్టండి, ప్రాంతీయత పరిగణించి మాకు ఉద్యోగాలు యివ్వండి' అదీ స్లోగన్‌. 40 ఏళ్ల క్రితం వచ్చినవాళ్లు తెలంగాణవాళ్లే అంటున్నారు కెసియార్‌. ఈ అంకె రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారమో తెలియదు. ముల్కీ రూలు వుండేటప్పుడు కూడా 40 ఏళ్లు కావాలనలేదు. ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి పుట్టిన చోటు బట్టి నిర్ధారించి వెనక్కి పంపేయాలంటున్నారు. ఎన్నికలలో నిలబడితే 'వలస నేతలు' అని యీసడిస్తున్నారు. అందువలన ఆంధ్రమూలాలున్నవారు తెరాసకు ఓటేయడానికి జంకడం సహజం. తెరాస బాగా బలంగా వున్నచోట, వీరు కాలనీల్లో ఒకేచోట వుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేయవచ్చు. లేకపోతే 'ఫలానా గుంటూరు క్యాంపు ఓట్లు మనకు పడలేదు' అని తెలిసిపోయి పగ బట్టవచ్చు. చెదురుమదురుగా వుండే ఓటర్లు మాత్రం తమను రక్షించేవారి కోసం వెతకవచ్చు. వారెవరు? బిజెపి, సిపిఐ, టి-టిడిపి.. నాయకులందరూ కూడా ఆంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడినవారే. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ వంటి హైదరాబాదులో పోటీ చేసే బిజెపి నాయకులు సంయమనం పాటించారు కానీ కరీంనగర్‌ బిజెపి నాయకుడు విద్యాసాగరరావు వంటి పెద్దమనిషి దగ్గర్నుంచి పరుషపదాలు వుపయోగించారు. వీళ్లు తమను రక్షిస్తారా? అన్న సందేహం వారికి రావచ్చు.

వైకాపా పార్టీని తెలంగాణ ఎన్నికలలో ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. సమైక్యనినాదం ఎత్తుకుని జగన్‌ తెలంగాణకు తిలోదకాలు యిచ్చేశాడని, ఖమ్మం జిల్లాలో తప్ప వేరే ఎక్కడా ఉనికి కూడా లేదని అంటున్నారు. అయినా టిడిపి ఓట్లు చీల్చడానికి అనేక చోట్ల అభ్యర్థులను నిలబెట్టి కెసియార్‌కు దోహదపడుతున్నాడని అంటున్నారు. జగన్‌ కాంగ్రెసు ఓట్లు చీల్చుకోగలడు కానీ టిడిపి ఓట్లు ఎలా చీల్చుకోగలడు? గతంలో టిడిపికి ఓట్లు వేసినవారు వైయస్సార్‌కు వ్యతిరేకంగానే వేశారు కదా, వాళ్లు యిప్పుడు అతని కొడుక్కి వేస్తారా? ఇలా ఆలోచిస్తే యీ వాదనకు అర్థం లేదు. కానీ యింకోలా ఆలోచించి చూడాలి. సమైక్య పల్లవి ఎత్తుకున్న జగన్‌ను బలమైన వైసిపి తెలంగాణ నాయకులు వదిలిపెట్టేశారు. అయినా జగన్‌ చలించలేదని, తన విధానాన్ని సడలించలేదనీ ఒప్పుకోవాలి. అందువలన తెలంగాణలోని సమైక్యవాదులకు, ఆంధ్రమూలాలు వున్నవారికి వైసిపిపై అభిమానం వుండే అవకాశం వుంది. తెలంగాణలో తమకు రక్షణ కల్పించడానికి జగన్‌ ముందుకు వస్తాడన్న ఆశ కలగవచ్చు. వీళ్లు మామూలుగా అయితఆంధ్రమూలాలు వున్న టిడిపికి వేస్తారు కానీ రెండుకళ్ల సిద్ధాంతం కారణంగా వాళ్లకు టిడిపిపై నమ్మకం పోయి, వైసిపీకి వేసే ఛాన్సుంది అనుకుంటేనే టిడిపి ఓట్లు చీలుతాయన్న అంచనాకు రావచ్చు. 

ఇలాటి  ఓటర్లు ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది వుంటారన్నది వూహించడం కష్టం. ఈ ఫీలింగుకి తోడు వైయస్‌పై అభిమానం వున్న తెలంగాణ ఓటర్లు, క్రైస్తవులు, దళితులు వైకాపాకు బలంగా నిలుస్తున్నారన్న టాక్‌ వుంది కాబట్టి వాళ్ల ఓట్లూ కలవవచ్చు. 10 స్థానాల్లో నైనా గెలుస్తారని గట్టిగా చెప్పలేం కానీ వీళ్ల కారణంగా 40, 50 సీట్లలో ఫలితాలు తారుమారు అవడం ఖాయం. ఎన్నికల తర్వాత హంగ్‌ ఏర్పడితే తెరాసకు వైకాపా మద్దతు యిస్తుందన్న రహస్యఒప్పందం వుందనీ, అందుకే కెసియార్‌-జగన్‌లు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదని ఒక మాట వినబడుతోంది. ఒప్పందం గురించి తెలియకపోయినా వారు ఒకరినొకరు విమర్శించుకోకపోవడం వాస్తవం. అందుకే జగన్‌ సమైక్యవాదం ఎత్తుకోవడం వెనక కారణాలపై అపనమ్మకం కూడా కలిగింది. కానీ సమైక్యవాదాన్ని పూర్తిగా భుజానికి ఎత్తుకున్న కిరణ్‌ను జనాలు పట్టించుకోవడం మానేశారు. హైదరాబాదులో సమైక్యవాదం వుందనుకున్న నియోజకవర్గాలలో కూడా వారికి మంచి అభ్యర్థులు దొరికినట్టు లేదు. అందువలన సమైక్యవాద భావాలున్నవాళ్లకు, ఆంధ్రమూలాలున్నవాళ్లకు జగనే దిక్కవుతున్నాడు. కానీ అతను పోయిపోయి ఆంధ్రులను అనుక్షణం తిట్టిపోసే కెసియార్‌తో కుమ్మక్కు కావడం చేత ఆ ఓటర్లు వైకాపాను దూరంగా పెడతారు. 

ఎన్నికలలో తమ స్థానాలు పెంచుకునే అవకాశం మజ్లిస్‌కు బాగా వుంది. మోదీ వచ్చేస్తున్నాడని సాధారణ హిందువులు పెద్దగా నమ్మకపోయినా, ముస్లింలు మాత్రం నమ్మి భయపడతారు. తమను రక్షించడానికి మజ్లిస్‌కే ఓట్లేస్తారు. మజ్లిస్‌ హిందువులను కూడా అభ్యర్థులుగా పెట్టి ఆకట్టుకుంటోంది. మజ్లిస్‌ ఎమ్మేల్యేలు మనకు భీకరంగా కనబడినా వాళ్లు ప్రజలకు అందుబాటులో వుంటారని, కష్టానికి, సుఖానికి ఆదుకుంటారని ప్రతీతి వుంది. వాళ్లు 10 స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక మనం ఫైనల్‌ టాలీ వేసి చూడవచ్చు. పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెసుల మధ్య వుంది. తెలంగాణ ఉద్యమం బలంగా వున్నచోట్ల తెరాస ఎక్కువ గెలుచుకుంటే, బలహీనంగా వున్నచోట్ల కాంగ్రెసు ఎక్కువ గెలుస్తుంది. బిజెపి ఎక్కువ సీట్లు ఉద్యమం వున్న చోట్ల గెలుచుకుంటే, టిడిపికి వచ్చే సీట్లు బలహీనంగా వున్నచోట మాత్రమే వస్తాయి.

ఇలా చూస్తే తప్పకుండా గెలిచే స్థానాలు తెరాసకు 35-40, కాంగ్రెసుకు 35-40, మజ్లిస్‌కు 8-10 వున్నాయనుకుంటే తక్కిన 30-40 స్థానాల గురించి చెప్పడం కష్టం. టిడిపి-బిజెపిలకు కలిపి 12-15 వస్తాయనుకుంటే, వైకాపాకు 6-8 వస్తాయనుకుంటే, వామపక్షాలకు 5-7 అనుకుంటే కనీసం 10-12 సీట్లలో  క్రాస్‌ ఓటింగు జరిగి యిండిపెండెంట్స్‌, రెబెల్స్‌ గెలుస్తారు. అబ్బే, ఇంత కాంప్లికేటెడ్‌గా వుండదు, ఓటరు నిర్ణయాత్మకంగా ఓటేస్తాడు అనే ఆశాభావం వున్నవారు కూడా గెలిచే పార్టీకి (తెరాస/కాంగ్రెస్‌) 50 సీట్లకు మించి వస్తాయని గట్టిగా చెప్పలేని పరిస్థితి వుంది. అందుకే అందరూ సంకీర్ణ ప్రభుత్వం తథ్యం అంటున్నారు. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2