ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -1

తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు గెలుస్తారు? అని అందరికీ సహజంగానే కుతూహలం వుంటుంది. భవిష్యత్తు తెలియదు కాబట్టే ఉత్సుకత కొద్దీ ఎవరికి తోచిన వూహలు వారు చేస్తారు. కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. నేను…

తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు గెలుస్తారు? అని అందరికీ సహజంగానే కుతూహలం వుంటుంది. భవిష్యత్తు తెలియదు కాబట్టే ఉత్సుకత కొద్దీ ఎవరికి తోచిన వూహలు వారు చేస్తారు. కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. నేను ఏ సర్వేలూ నిర్వహించలేదు. నా వద్ద ఏ రహస్యసమాచారమూ లేదు. పేపర్లలో చదివినదాన్ని బట్టి, కామన్‌సెన్స్‌ ఉపయోగించి అంచనాలు వేసి చెప్తున్నాను. ఏ గ్యారంటీలు, వారంటీలు లేవు. తెలంగాణలో కాంగ్రెసు-తెరాస కలిసి పోటే చేస్తే స్వీప్‌ చేసేదని, విడివిడిగా చేస్తున్నారు కాబట్టి హంగ్‌ ఎసెంబ్లీ వస్తుందని అతి సులభంగా అందరూ చెప్తున్నారు. మరి హంగ్‌లో ఎవరికెన్ని, ఎవరి మద్దతుతో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది రెండో ప్రశ్నగా మొలుచుకు వస్తుంది. ఎన్నికల అనంతరం ఏమైనా కావచ్చు, ఎన్నికల ప్రచారంలో వుపయోగించిన తిట్లను అటకెక్కించి ఎవరితోనైనా ఎవరైనా చేతులు కలపవచ్చు. అందువలన డానిపై ప్రస్తుతం పెద్ద చర్చ చేయనక్కరలేదు కానీ, ఎవరికి ఎన్ని వస్తాయో గట్టిగా ఆలోచించి చూదాం.

తెలంగాణ తెచ్చినందుకు తెరాసకా, యిచ్చినందుకు కాంగ్రెసుకా ఎవరికి ఓట్లేస్తారు? అన్నదే అందరూ విశ్లేషిస్తున్నారు. ఈ ప్రశ్న యావత్తు తెలంగాణకు వర్తిస్తుందా లేదా అన్నది మొదట చూడాలి. తెలంగాణ వచ్చినందుకు ఎంతమంది ఆనందించారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారందరూ, తెలంగాణ ఉద్యమం బలంగా వున్నచోటల్లా యీ సెంటిమెంటు వర్కవుట్‌ అవుతుంది అనుకుంటే రెండున్నర జిల్లాలతో ఖాతా మొదలవుతుంది. రాకమునుపు పెద్ద ఫీలింగు లేకపోయినా, వచ్చింది కాబట్టి, యిప్పుడు ఆంధ్రావాళ్లందరూ తెలంగాణ ఖాళీచేసి వెళ్లిపోతే తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నే ఆశతో కొన్ని వర్గాలు వుంటాయి. అవి అన్ని జిల్లాలలోనూ విస్తరించి వుంటాయి. ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని, పరిశ్రమలు మూతపడి తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో కొన్ని వర్గాలు వుంటాయి. ఈ వర్గాలు ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల వరకే వుంటాయని అనుకోవచ్చు. 

విభజన వలన తాము ఏం కోల్పోతామో తెలంగాణ వారికి ఎవరూ సరిగ్గా వివరించి చెప్పటం లేదు. రెండేళ్ల క్రితమే విభజన జరిగి వుంటే దాని సత్ఫలితాలో, దుష్ఫలితాలో అందరికీ అనుభవంలోకి వచ్చేవి. ఇప్పుడు కేవలం బిల్లు మాత్రమే పాస్‌ అయింది కాబట్టి  ఇక్కడ 'బంగారు తెలంగాణ' అక్కడ 'సింగపూరాంధ్ర' ఏర్పడతాయని చెప్పి వూదరగొడుతున్నారు. తక్కువ శాతమే అయినా కొందరు నమ్మవచ్చు.  ఎన్నికల వాగ్దానాలు చూస్తే మతి పోతుంది. మితిమీరిన సంక్షేమపథకాలు ప్రకటిస్తున్నారు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై విపరీతంగా పెట్టుబడులు పెడతామంటారు రెండింటికీ డబ్బు ఎలా సరిపోతుంది? కేంద్రాన్ని బతిమాలి తెస్తామని కొందరు, కొట్లాడి తెస్తామని మరికొందరు అంటారు. ఇవి నమ్మేవాళ్లు మాత్రమే తెలంగాణ వచ్చినందుకు ఆనందించాలి. 

ఆనందించినా, ఆనందించకపోయినా తెలంగాణ అనేది ఫేట్‌ ఎకాంప్లీ (మార్చలేని వాస్తవం). ఇక ముందు కథేమిటి అన్నది చూస్తారా? తెలంగాణ తెచ్చిన లేదా యిచ్చిన వాళ్లకు కృతజ్ఞత తెలుపుతారా అన్నది ముఖ్యమైన పాయింటు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసుకు 100% ఓట్లు, సీట్లు రాలేదు. అప్పటికే ఐదేళ్లు అయిపోయింది కాబట్టి ఆ పొంగు తగ్గిపోయింది అనుకుందాం. ఇప్పుడైతే తెలంగాణ బిల్లు వేడివేడిగానే వుంది కాబట్టి అది ఎన్నికలలో అంశంగా వుండి తీరుతుంది అని మీడియా బలంగా నమ్ముతోంది. కాస్సేపు మనమూ నమ్మి ఆలోచనను కొనసాగిద్దాం. తెలంగాణ యిచ్చినందుకు సంతోషించిన ఓటర్లు ఎవరికి ఓటేయాలి? ఉద్యమం చేసిన తెరాసకా, బిల్లు పాస్‌ చేసిన కాంగ్రెసుకా, సహకరించిన బిజెపికా, లేఖ యిచ్చి మార్గం సుగమం చేసిన టిడిపికా? నిలడుతున్న ప్రతి అభ్యర్థీ తెలంగాణ ఉద్యమానికి నేను ఫలానా చేశాను అని చెప్పుకుంటూనే వుంటాడు. పార్టీ పరంగా చూడాలంటే 'తెలంగాణ బిల్లులో తెరాస పాత్ర ఏమీ లేదు, ఇద్దరు ఎంపీలతో వాళ్లేం సాధించారు?' అని కాంగ్రెసు పెద్దలంటున్నారు. 'నవమాసాలు మోసిన తల్లికి బిడ్డ దక్కాలా? లేక పురుడు పోసిన మంత్రసానికా?' అని కవిత  పాయింటు లాగారు. 'సోనియా మంత్రసానితనం లేకపోతే ఆ గజగర్భం అలా మరో పుష్కరం పాటు కొనసాగుతూనే వుండేది కదా' అని రేపు కాంగ్రెసువాళ్లు అనవచ్చు. 

ఒకటి మాత్రం నిజం – తెలంగాణ ఉద్యమ సెంటిమెంటుతో తెరాస విజయం నల్లేరు మీద బండి నడక అనుకున్నవాళ్లు నాలిక కరుచుకోవాల్సి వస్తోంది. కెసియార్‌ యింతగా శ్రమిస్తున్నారంటేనే, యిన్ని దుర్భాషలాడుతున్నారంటేనే అర్థమవుతోంది. యుద్ధంలో గెలిచినవారు పరాజితులపై నోరు పారేసుకోవాల్సిన పని లేదు. కానీ కెసియార్‌ 'సీమాంధ్ర నాయకులు', 'వలస నాయకులు' 'వాళ్లకు యిక్కడేం పని?' అంటూ విరుచుకుపడుతూనే వున్నారు. 'ఉద్యమం యింతటితో అయిపోలేదు. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ వచ్చేవరకు ఆంధ్ర నాయకులతో కొట్లాడవలసినదే. అది మాతోనే సాధ్యం, ఆంధ్రలో ప్రయోజనాలున్న ఏ పార్టీకి సాధ్యం కాదు' అనే సంకేతం పంపడానికై ఆయన అలవాటు లేని పద్ధతిలో చెమటోడుస్తున్నారు. కాంగ్రెసును, టిడిపిని తిట్టారు. ఓకే. ప్రచారం చివర్లో బిజెపిని, మోదీని కూడా దుమ్ము దులిపేశారు. కేంద్రం సహకారంతో నిధులు తెచ్చి తెలంగాణలో పవర్‌ ప్రాజెక్టులు, స్టీలు ఫ్యాక్టరీలు, ప్రత్యేక ప్రతిపత్తి సాధిస్తానని అంటూ జాతీయ పార్టీలు రెండింటితో చెడగొట్టుకుంటున్నారేమిటి అంటే మూడో ఫ్రంటువైపు వెళతా అంటున్నారు. 2009లో మూడో ఫ్రంటుతో కలిసి పోటీ చేసి, ఎన్నికలు కాగానే ఎన్‌డిఏతో కలిసి వూరేగారు. ఈ సారి రివర్స్‌ అన్నమాట. అయితే ఆ క్రమంలో మోదీని సన్నాసి అనడం, హైదరాబాదును యూటీ చేస్తాడు, దేశానికి ద్వితీయ రాజధాని చేస్తాడు చూసుకోండి అంటూ ఆరోపించడం కాస్త డోసు ఎక్కువైంది. హైదరాబాదును యూటీ చేయడానికి బిజెపి మొదటినుండీ వ్యతిరేకి. మజ్లిస్‌, బిజెపి ఒకే అభిప్రాయానికి వచ్చిన అరుదైన అంశం యిది.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]