ఓ పెద్ద సినిమా వస్తున్నప్పుడు చిన్న సినిమాలు వాయిదా పడడం సహజం. ప్రమోషన్ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు. ఓ పెద్ద ఈవెంట్ ఉన్న రోజున, చిన్న సినిమాల ప్రచార కార్యక్రమాలు పెట్టుకోరు. ఒకవేళ అలా పెట్టుకుంటే ఏమౌతుంది? ఈ ప్రశ్నకు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు దొరికింది.
ప్రాజెక్ట్-K నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం. ప్రభాస్ ఎలా ఉంటాడు, అతడి లుక్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి లాంటి అంశాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్న వేళ.
ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమా ప్రచారం మొదలైతే ఎలా ఉంటుంది? బెదురులంక-2012 అనే సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు ఈరోజు. ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలకు కాస్త అటుఇటుగా ఈ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ పట్టించుకునేది ఎవరు?
'సొల్లుడా శివ' అనే లిరిక్స్ తో సాగే ఈపాట నిజానికి బాగుంది. కానీ రాంగ్ టైమింగ్ అంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజు కాకుండా, మరో రోజు ఈ సాంగ్ ను విడుదల చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ విషయం మేకర్స్ కూడా తెలుసు. కానీ ఏరికోరి ఇదే రోజు ఎందుకు రిలీజ్ చేశారో వాళ్లకే తెలియాలి.
అసలే సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు కార్తికేయ. కెరీర్ లో చిన్న గ్యాప్ కూడా వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో బెదురులంక టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా మెలొడీ ప్రేమికుల్ని ఆకట్టుకుంది. ఆ బజ్ ను అలానే కంటిన్యూ చేయకుండా, ఇలా రాంగ్ టైమింగ్ లో సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.