తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడు హీరో సాయిధరమ్ తేజ్. కనీసం 6 నెలలు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపాడు. అంతేకాదు.. మరో చిన్న సర్జరీ కూడా చేయించుకోబోతున్నాడు.
తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేశాడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడు. ముందుగా ఓ చిన్న సర్జరీ చేయించుకోబోతున్నాడు. ఆ సర్జరీ దేనికి సంబంధించిందనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఈ గ్యాప్ లో ఫిజిక్ పై కూడా దృష్టి పెడతానని, కొంత బరువు తగ్గి, పూర్తి ఫిట్ నెస్ సాధిస్తానని ఆయన వెల్లడించాడు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.
యాక్సిడెంట్ కు గురైన తర్వాత బాగానే కోలుకున్నప్పటికీ.. శారీరకంగా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సాయితేజ్. 12 రోజుల పాటు కోమాలో ఉన్న టైమ్ లో చాలా స్టెరాయిడ్స్ ఇచ్చారని, ఆ తర్వాత కూడా చాలా మందులు వాడాల్సి వచ్చిందని, దాని వల్ల తనకు మాట కూడా సరిగ్గా రావడం లేదని అంగీకరించాడు.
వీటన్నింటినీ అధిగమించి, మునుపటి ఎనర్జీని సొంతం చేసుకునేందుకు 6 నెలల గ్యాప్ తప్పనిసరి అని భావిస్తున్నాడు ఈ మెగా హీరో. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో సక్సెస్ కొట్టాడు సాయితేజ్. ఇప్పుడు బ్రో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఇకపై ఇదే జోరు కొనసాగిస్తాడని అంతా భావించారు.
కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం 6 నెలలు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. రీసెంట్ గా సమంత కూడా తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.