టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా వస్తుందంటే చాలు, టికెట్ రేట్లకు రెక్కలొస్తాయి. ప్రభుత్వాల ముందు విన్నపాలు, బడ్జెట్ లెక్కలు పెట్టుకోవడం, రేట్లు పెంచుకోవడం కామన్ ప్రాక్టీస్ గా మారింది. మరి మరికొన్ని రోజుల్లో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'బ్రో' వస్తోంది. ఈ సినిమాకు మాత్రం టికెట్ రేట్లు పెంచడం లేదంటున్నాడు నిర్మాత.
“అనుకున్న బడ్జెట్ లో మేము సినిమాని పూర్తి చేయగలిగాం. బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాం. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరడం లేదు. ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలి అనుకుంటున్నాం.”
ఇలా బ్రో సినిమా టికెట్ రేట్లపై స్పష్టత ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో, బ్రో సినిమాకు టికెట్ రేట్లు పెంచే అంశంపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావొచ్చంటూ అనుమానాలు తెరపైకొచ్చాయి. అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదని, టికెట్ రేట్లు పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. ఇక స్పెషల్ ప్రీమియర్స్ పై కూడా స్పందించారు.
“ఇప్పటివరకు అయితే ప్రీమియర్స్ ఆలోచన లేదు. చిన్న సినిమాలకు తమ కంటెంట్ ని చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటాం.”
ఈనెల 28న థియేటర్లలోకి వస్తోంది బ్రో సినిమా. పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ది గెస్ట్ రోల్ కాదని, అతడు ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తాడని అంటున్నాడు నిర్మాత. 25వ తేదీన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు.