అయ్యన్న తమ్ముడికి షాక్ ఇచ్చిన వైసీపీ

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఎదురెళ్ళి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు తమ్ముడు సన్యాసిపాత్రుడు. 2019 ఎన్నికల ముందు ఇది జరిగింది. ఆయనకు వైసీపీ న్యాయం చేసింది.…

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఎదురెళ్ళి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు తమ్ముడు సన్యాసిపాత్రుడు. 2019 ఎన్నికల ముందు ఇది జరిగింది. ఆయనకు వైసీపీ న్యాయం చేసింది. ఆయన సతీమణి అనితకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించింది. రెండేళ్ళ క్రితం ఆ నియామకం జరిగింది.

గడువు తీరడంతో జిల్లాలో అత్యంత కీలకమైన డీసీసీబీ చైర్మన్ పదవిని విశాఖ సౌత్ కి చెందిన వైసీపీ సీనియర్ నేత కోలా గురువులుకి ఇస్తూ వైసీపీ ప్రభుత్వం సచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో చాలా డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలం పూర్తి అయితే కొన్ని చోట్ల పాతవారినే కంటిన్యూ చేశారు. విశాఖతో పాటు మరో నాలుగు జిల్లాలలోనే మార్చారు.

విశాఖ విషయం తీసుకుంటే అయ్యన్నని ఇరకాటంలో పెట్టడానికి ఆయన కుటుంబం నుంచే తమ్ముడిని వైసీపీ తమ వైపు లాక్కుంది. అయితే గత కొంతకాలంగా సన్యాసిపాత్రుడు నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వైసీపీలో వర్గ పోరుకు కారణం అవుతున్నారని అధినాయకత్వానికి ఫిర్యాదులు అందాయట.

అదే సమయంలో ఏ ఉద్దేశ్యంతో అయితే అయ్యన్న తమ్ముడిని పార్టీలో చేర్చుకున్నారో అది నెరవేరలేదని, అయ్యన్న బలాన్ని తగ్గించడంతో సన్యాసిపాత్రుడు విఫలం అయ్యారని, టీడీపీ నుంచి అనుచరులను తీసుకుని రాలేకపోయారు అని అంటున్నారు దాంతో ఆయన సతీమణి పదవిని లేకుండా చేశారని అంటున్నారు

వచ్చే ఎన్నికల్లో పెట్ల ఉమా శంకర్ కే టికెట్ అని ఈ డెసిషన్ ద్వారా అధినాయకత్వం చెప్పింది అని అంటున్నారు. తెలుగుదేశంలో అన్న నీడలో రాజకీయంగా ఎదిగిన సన్యాసిపాత్రుడు ఇపుడు ఏమి చేస్తారు అన్నది జిల్లా రాజకీయాల్లో రెండు పార్టీలలో ఒక డిస్కషన్ గా ఉంది. సన్యాసిపాత్రుడు తిరిగి టీడీపీలోకి వెళ్తారా లేక వైసీపీలో కొనసాగుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు తమ్ముడిని పార్టీలోకి రమ్మని కోరితే నర్శీపట్నం రాజకీయం మరో మలుపు తిరుగుతుంది అని అంటున్నారు.