‘ప్రతిరోజూ పేపర్లో కనిపించకపోతే జనం తనని మర్చిపోతారేమో అని చంద్రబాబునాయుడుకు భయం’.. ఇది ఎవరో కిట్టనివాళ్లు ఇచ్చిన స్టేట్మెంటు కాదు. సాక్షాత్తూ చంద్రబాబుతో కలిసి పనిచేసిన సచివులు, ఆయనను చాలా సన్నిహితంగా ఎరిగిన వారు చెప్పే మాట. అయితే చూడబోతే.. ఇది నిన్నటి సిద్ధాంతంలాగా కనిపిస్తోంది.
రోజూ పేపర్లో కనిపించకపోతే కాదు, రోజూ ట్విటర్లో కనిపించకపోతే చంద్రబాబుకు ఇప్పుడు ఊపిరి ఆడేలా లేదు. తేరగా ట్విటర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫాం అందుబాటులో ఉన్నది గనుక.. అందులో ప్రతిరోజూ ఏదో ఒకటి ట్వీటాల్సిందే. సదరు ట్వీట్లలో జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కాల్సిందే. ఏరోజు ట్వీట్ లేకపోతే.. ఆ రోజున ప్రజలు తనని మర్చిపోతారని చంద్రబాబునాయుడు భయపడిపోతున్నట్లున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయంగా సొంత డబ్బా కొట్టుకోడానికి, పరనిందలు చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని వినియోగించుకోవడం చంద్రబాబుకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు. ‘నువ్వు ముఖ్యమంత్రి కాకపోవడం ఏంటయ్యా’ అంటూ ఏడ్చిన ఆర్టిస్టుల నటనాకౌశలం చంద్రబాబును ఎంతగా అపహాస్యం పాల్జేసిందో కూడా అందరికీ తెలుసు. కానీ సోషల్ మీడియాలో సర్కులేట్ చేసుకోవడానికి బాగా రంజుగా ఉంటాయి కాబట్టి.. చంద్రబాబు అండ్ కో ఎప్పటికీ పెయిడ్ ఆర్టిస్టలు వినియోగాన్ని తమ రాజకీయాలకు వాడుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఇంకో ఎత్తు.
ఇప్పుడిక అసలు సంగతి ఏంటంటే.. ఈ పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాలే చంద్రబాబు ట్వీట్లకు స్ఫూర్తి ప్రదానం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారును తిట్టడానికి తాను కొత్తగా ఏం ట్వీట్ చేయాలో చంద్రబాబుకు ఏమీ ఐడియా రావడం లేదు. అందుకని తమ పచ్చ దళాలతోనే పెయిడ్ ఆర్టిస్టుల్ని ఎగదోసి, మళ్లీ వారి యాక్టివిటీ మీదనే తాను ట్వీట్లు పెట్టుకుంటూ పండగ చేసుకుంటున్నారు.
కర్నూలు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కు కొందరు మహిళలు తమ గ్రామసమస్యల్ని నివేదించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేని నిలదీశారంటూ పచ్చమీడియా దీన్ని అంతెత్తున ప్రచారం చేసింది. ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకోవడం చాలా సాధారణమైన సంగతి కాగా, ప్రభుత్వ పథకాల గురించి కూడా నిలదీసినట్లు ప్రచారం జరిగింది.
అలాంటి స్క్రిప్టు ప్రకారం పలికే డైలాగుల్ని పెయిడ్ ఆర్టిస్టులతో పలికించడం తెలుగుదేశానికి అలవాటే. కాగా అక్కడ గూడూరులో ఎమ్మెల్యేను నిలదీయగానే.. ఇక చంద్రబాబు దానికి సీక్వెల్ అందుకుంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టుల నిలతీత సూపర్ అంటూ ట్వీట్లు కొడుతున్నారు.
ఖర్మ కాలితే ఇలాగే ఉంటుంది. ట్వీట్ చేయడానికి కూడా సబ్జెక్టు ఉండదు. పెయిడ్ ఆర్టిస్టులతో ఒక రచ్చ చేయించి.. మళ్లీ ఆ రచ్చ గురించే తాను ట్వీట్ చేయాల్సి వస్తుంది. పాపం చంద్రబాబు!