అంతులేని అధర్మ యుద్ధం

పత్రికలంటే ఎంతో గౌరవం ఉంటుంది. అవి వాస్తవాలే రాయాలని కోరుకుంటాం. అందులోను సంపాదకీయాలు విజ్ఞానాత్మకంగాను, విమర్శనాత్మకంగాను, హేతుబద్ధం గాను, వాస్తవాలకు దగ్గరగాను ఉండాలని భావిస్తాం. కాని దురదృష్టవశాత్తు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పగపట్టిన…

పత్రికలంటే ఎంతో గౌరవం ఉంటుంది. అవి వాస్తవాలే రాయాలని కోరుకుంటాం. అందులోను సంపాదకీయాలు విజ్ఞానాత్మకంగాను, విమర్శనాత్మకంగాను, హేతుబద్ధం గాను, వాస్తవాలకు దగ్గరగాను ఉండాలని భావిస్తాం. కాని దురదృష్టవశాత్తు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పగపట్టిన ప్రముఖ దినపత్రిక ఈ విలువలను తుంగలో తొక్కేసి మరీ విషం చిమ్ముతోంది. జగన్‌ పరిపాలనపై విమర్శలు చేయడాన్ని తప్పు పట్టనవసరం లేదు. అవి విమర్శలుగాను, కుట్ర పూరిత వ్యాఖ్యలగాను కనిపిస్తే ఆక్షేపించకుండా ఎలా ఉండగలం. 

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు లోకేష్‌ కు అధికార పగ్గాలు అప్పగించాలని నిరంతరం శ్రమిస్తున్న ఈ పత్రిక ఆ విషయం నేరుగా ప్రకటించి ఉంటే గొడవే ఉండదు. కాని చాటున ఉండి అదేదో ఏపీ కోసమే రాస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చి ప్రజలను మోసం చేయాలని అనుకోవడమే దారుణంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక సంపాదకీయంలో ఎన్ని అసత్యాలు రాశారో చూడండి. 

అంతకుముందు అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అందులోని మంచి, చెడు జోలికి పోకుండా ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడింది. దానికి కొనసాగింపుగా మరో ఎడిటోరియల్‌ను ప్రజలపై రుద్దింది. తద్వారా ప్రజల మనసులను కలుషితం చేయడానికి ఈనాడు విశ్వయత్నం చేసింది. నిజంగానే జగన్‌పై ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. కాని జగన్‌పై కృత్రిమ వ్యతిరేకత సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలు మాత్రం వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావు వంటి వారు కూడా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడతారా అన్న బాధ కలిగిస్తాయి. 

ఏపీని దివాళా అంచులకు తీసుకు వెళ్లారని, మార్చి నెలాఖరుకు రాష్ట్రంపై మొత్తం చెల్లింపుల భారాన్ని ఏడున్నర లక్షల కోట్లకు చేర్చారని రామోజీ ఆరోపించారు. అందులో నిజానిజాలను పక్కనబెడితే ఈ మొత్తం ఏడున్నర లక్షల అప్పు జగన్‌ టైమ్‌లోనే జరిగిందన్న భ్రమ కలిగించడానికి చేసిన ప్రయత్నం నగ్నంగా కనిపిస్తూనే ఉంది. అదే కనుక చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఎంత అప్పు అయింది.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎంత అప్పు తెచ్చింది విశ్లేషించి ఉంటే దానిని సంపాదకీయం అంటారు. 

అలా కాకపోతే జగన్‌ పై బురదచల్లడానికి రామోజీ నీచంగా రాశారన్న అభిప్రాయం కలుగుతుందా? లేదా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. అంతేకాదు. అసలు కరోనా సంక్షోభం గురించి, ఆ సమయం లో కేంద్రం అనుమతించిన అప్పుల గురించికాని, పోనీ తెలంగాణ, కర్ణాటక ,తమిళనాడు వంటి రాష్ట్రాలతో అప్పులను పోల్చికాని రాయలేదంటే ఈ పత్రిక దురుద్దేశం అర్ధం అవుతూనే ఉంది. సుస్థిరాభివృద్ధి, సామాన్యజనాల సంక్షేమానికి ప్రజాధనంపై ప్రభుత్వం ధర్మకర్తలా వ్యవహరించాలని రామోజీ రావు సూక్తి ముక్తావళి చెప్పారు. బాగానే ఉంది.

సుస్థిరాభివృద్ధి లో ఏపీకి కేంద్రం మూడు ర్యాంక్‌ ఇచ్చిన వైనాన్ని మాత్రం విస్మరించారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ స్కీములను అమలు చేసిన అంశాన్ని అసలు ప్రస్తావించక పోవడం ద్వారా తన కుళ్లుబుద్ధిని ప్రదర్శించుకున్నారు. కాగ్‌ ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని ఏవేవో రాశారు. ఏ ప్రభుత్వం ఉన్నా అలాంటి వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి. అయినా ప్రభు త్వం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం అభ్యంతరం కాదు. వైసీపీ వర్గాలు మాత్రం అబద్ధాల మనిషికి అరవైనాలుగు అసత్య ప్రమాణాలు అన్న చందంగా డబాయిస్తున్నాయని రామోజీ ఆరోపించారు. 

నిజంగానే వైసీపీ అబద్దాలను గట్టిగా ప్రచారం చేసి ఉంటే ఈ పాటికి తెలుగుదేశం ఇంకా దెబ్బతిని ఉండేది. లేదా వైసీపీని జనం నమ్మకపోతే ఆ పార్టీ ఇబ్బందులలోకి వెళ్లేది. అలాకాకుండా నిర్దిష్టంగా సాధ్యమైనంతవరకు వాస్తవ విషయాలు చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదపడని తాత్కాలిక తాయిలాలతో తీవ్ర అనర్ధాలు తప్పవని ఎవరో అన్నారని రాశారు. జగన్‌ ప్రభుత్వం పూర్తిగా ప్రజాకర్షక విధానాలకే పరిమితమవుతోందని రామోజీ బాధపడ్డారు. 

ఇందులో ఆయన చిత్తశుద్ధితో రాసి ఉంటే మంచిదే అనవచ్చు. మరి చంద్రబాబు అధికారంలోకి రావడానికి ముందు రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మొత్తం లక్షకోట్ల మేర మాఫీ చేస్తానని ప్రచారం చేసి, మానిఫెస్టోలో పెడితే ఎన్నడైనా వ్యతిరేకించిందా? ఇలా ఎడిటోరియల్‌ రాసిందా? పైగా రైతులు కష్టాలలో ఉన్నారని, చంద్రబాబు మాత్రమే రుణమాఫీ చేయగలుగుతారని ఆయా వర్గాలతో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అవి ప్రజాకర్షక విధానాలుగా కనిపించలేదు. 

నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున బృతి ఇస్తామని చెప్పినప్పుడు అది తాత్కాలిక తాయిలంగా రామోజీ భావించలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి స్కీములను చంద్రబాబు తీసుకు వచ్చినప్పుడు రాష్ట్రం ప్రగతిపథంలో నడిచినట్లు ఆయన ఫీలయ్యారనుకోవాలి. జగన్‌ చేపట్టిన స్కీములు ప్రజలలోకి వెళ్లాయన్న దుగ్దతో వ్యతిరేక ప్రచారం చేయాలన్న దుర్లక్ష్యంతో రాసిన రాతలు తెలిసిపోతూనే ఉన్నాయి. పోనీ ఫలానా స్కీము అనవసరం అని చెప్పినా, మార్పులు చేయాలని సూచించినా స్వాగతించవచ్చు. అలా ఎన్నడూ చేయడం లేదు. పైగా ప్రభుత్వం ఏదైనా మార్పు చేస్తే అమ్మో.. మోసం, పేదలకు అన్యాయం జరిగిపోయిందోని కథనాలు ఇచ్చేది ఈ పత్రికే.

పోనీ తెలంగాణలో దళితబంధు పేరుతో పది లక్షల రూపాయలు ఇవ్వడంపై తన అభిప్రాయం చెప్పి ఉంటే వారి విధానం అదేలే అనుకోవచ్చు. తెలంగాణలో రైతు బంధు పేరుతో ధనిక రైతులకు కూడా గతంలో ఆర్థిక సాయం చేశారన్న విమర్శ ఉంది. అది సరైనదా? కాదా అన్నదానిపై ఈ పత్రిక ఎడిటోరియల్‌ రాసిందా? చంద్రబాబు కాపు రిజర్వేషన్లు తెస్తానని అన్నప్పుడు అదెలా సాధ్యమని రామోజీ ప్రశ్నించారా? కాపులంతా చంద్రబాబుకు నీరాజనం పడుతున్నట్లుగా పిక్చర్‌ ఇచ్చారే. 

ఇదే చిత్తశుద్ధి లోపం అంటే. తాత్కాలిక తాయిలలతో తీవ్ర అనర్ధాలని ఆర్ధిక సంఘం అధ్యక్షుడు అన్నారట. శ్రీలంక తరహా ఆర్ధిక సంక్షోభం అని ఇంకోయన అన్నారట. మరి కరోనా సమయంలో ప్రజల చేతిలో డబ్బు ఉండాలని ఆర్బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ వంటివారు చెప్పేవారు కదా? సంపన్న దేశం అయిన అమెరికాలో సైతం ప్రజలకు రెండువేల డాలర్ల చొప్పున పంపిణీ చేశారే. 

ఈ విషయాలు రామోజీకి తెలియవని కాదు. కాకపోతే తమకు అనుకూలమైన వార్తలకే ప్రాధాన్యం ఇస్తూ, తమకు గిట్టని వారిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. ఇది కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. గతంలో ఈనాడు పత్రిక మద్య నిషేధ ఉద్యమం చేసినప్పుడు ఎవరు అనుకూలంగా మాట్లాడితే వారందరి ఇంటర్వ్యూలను ప్రముఖంగా ఇచ్చేవాళ్లు. 

చివరికి ఆనాటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ తో ఇంటర్వ్యూ చేసి మద్యం వ్యాపారాన్ని ఆయన వ్యభిచారంతో పోల్చితే దానిని బానర్‌గా ఇవ్వడం జరిగింది. దానిపై ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డికి తీవ్ర అసహనం కూడా కలిగింది. తదుపరి ఎన్‌.టి.ఆర్‌. మధ్య నిషేదాన్ని అమలు చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చారా అంటే అదేమీ చేయలేదు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం సరిగా అమలు జరగడం లేదని, అక్రమ మద్యం వచ్చి రాష్ట్రానికి చాలా నష్టం వస్తోందని, ఆదాయం కూడా రాకుండా పోతోందని ఇదే పత్రిక కథనాలు ఇచ్చినట్లు గుర్తు. ప్రభుత్వం మారగానే ఈనాడు విధానం కూడా మారిపోతుందన్నమాట. అప్పట్లో ఒక విమర్శ ఉండేది. రామోజీ మద్య నిషేధం అమలు డిమాండ్‌ చేస్తూ తన హోటళ్లలో మాత్రం మద్యం అమ్ముతుంటారని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తేవారు. 

అప్పుడు ఇంకా నిషేధం రాలేదు కదా అని ఆయన వాదించేవారు. తన ప్రత్యర్థి పత్రిక యజమానికి మద్యం బిజెనెస్‌ ఉంది కనుక, దానిని దెబ్బకొట్టడానికి ఆయన ఉద్యమానికి నాటకీయంగా ఊతం ఇచ్చేవారని అప్పట్లో ప్రచారం జరిగేది. ఇక్కడ మరో మాట అన్నారు. జగన్‌ చేసిన ఒక వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, కుటుంబాలను చిధ్రం చేసే మద్యం డబ్బుతో చేసిది విషపూరిత ఓట్ల రాజకీయం కాక సంక్షేమం ఎలా అవుతుందని తెలుగుదేశం నేతకన్నా ఎక్కువగా ఆయన బాధపడ్డారు. ఇది నిజాయితీతో చేస్తే స్వాగతించవచ్చు. కాని చంద్రబాబు టైమ్‌లో మధ్యం షాపులు లెక్కకు మిక్కిలిగా ఉన్నా, బెల్ట్‌ షాపులు ప్రతిసందులో ఉన్నా ఎన్నడూ సంపాదకీయం రాయని రామోజీరావుకు సడన్‌గా మద్యం కుటుంబాలను చిద్రం చేస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. 

ఆయన నిబద్ధతతో ఈ వ్యాఖ్య చేసి ఉంటే, ముందుగా తన ఫిలింసిటీలో మద్యం సేవించేవారి బతుకులు చిద్రంగాకుండా చూడాలి కదా? తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగుతుంటే, ఇక్కడ పర్మిట్‌రూమ్‌లు పెద్ద సంఖ్యలో ఉంటే వాటి గురించి ఎందుకు నోరు ఎత్తలేకపోతున్నారు. పోనీ ఇతర రాష్ట్రాల పరిస్థితితో ఏమైనా పోల్చి రాశారా అంటే అది చేయకుండా జగన్‌పై పచ్చి విషం కక్కడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 

జగన్‌ అధికారంలోకి వచ్చాక మద్యం షాపులను తగ్గించి, వాటిని ప్రభుత్వపరం చేయడం, బెల్టు షాపులు లేకుండా చేయడం వంటి వాటిని రామోజీ కావాలనే గుర్తించడం లేదు. పరిశ్రమలు రావడం లేదని, మరొకటని రాస్తారే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడగరు. ఈ పత్రిక ఈ సంపాదకీయం రాసిన రోజునే ముఖ్యమంత్రి జగన్‌ తూర్పు గోదావరి జిల్లాలో ఒక భారీ పరిశ్రమను ప్రారంభించడం గమనార్హం. ఆర్ధిక అరాచకత్వ మట, ప్రగతి దీపాలు కొండెక్కుతున్నాయట. అంధకార బంధురం అవుతోందట. 

ఇలా ప్రతి అక్షరంలో తన విద్వేషాన్ని వెళ్లగక్కడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఇలా అయితే బాగుండు అన్న భావనే కనిస్తోంది తప్ప, చిత్తశుద్ధితో ఈ సంపాదకీయం రాసినట్లు కనిపించదు. అందువల్లే తెలుగుదేశం కరపత్రంలోని అంశాలనే రామోజీ తన ఎడిటోరియల్‌గా మార్చి రాశారన్న అభిప్రాయం కలగడంలో తప్పేముంటుంది. ఈ రెండేళ్లు ఈనాడు రామోజీరావు ఈ రకంగానే జగన్‌పై ప్రత్యక్ష అధర్మయుద్దం చేయడానికి పూనుకున్నారని ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులు కారు.