ప్రాజెక్ట్-కెలో హీరోయిన్లుగా నటిస్తున్న దీపికా పదుకోన్, దిశా పటానీ లుక్స్ ఇప్పటికే రిలీజయ్యాయి. ఇప్పుడు హీరో లుక్ ను కూడా రివీల్ చేశారు. ప్రాజెక్ట్-కె నుంచి ప్రభాస్ లుక్ కొద్దిసేపటికిందట విడుదలైంది. అందరూ ఊహించినట్టే యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు.
ఇక ఫస్ట్ లుక్ లో కొత్త విషయానికొస్తే.. ఇది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కాబట్టి ప్రభాస్ కాస్ట్యూమ్ కచ్చితంగా కొత్తగా ఉంటుందని అంతా ఊహించారు. ఆ ఊహలకు తగ్గట్టే కాస్ట్యూమ్ ఉంది. అటుఇటుగా ఐరెన్ మేన్ లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్.
అయితే దీనికంటే షాకింగ్ మేటర్ ప్రభాస్ హెయిర్ స్టయిల్. ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ కు లాంగ్ హెయిర్ పెట్టాడు దర్శకుడు నాగ్ అశ్విన్. నిజానికి లాంగ్ హెయిర్ అనే పదం కూడా చిన్నది. ఫస్ట్ లుక్ గమనిస్తే, ప్రభాస్ కు వెనక పెద్ద ముడి కనిపిస్తోంది.
సినిమా అంతా ప్రభాస్ ఈ లుక్ లోనే కనిపిస్తాడా లేక, కథ ప్రకారం, ఈ ఎపిసోడ్ లోనే ఇలా కనిపిస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ చూస్తే, మరో గ్రహంలో ప్రభాస్ ను చూపించినట్టు ఉంది. ఈ ఫస్ట్ లుక్ కు “హీరో రైజెస్, ది గేమ్ ఛేంజెస్” అనే క్యాప్షన్ తగిలించారు. దీన్నే ప్రభాస్ స్టయిల్ లో చెప్పుకోవాలంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనుకోవాలేమో.
ఓవరాల్ గా ప్రాజెక్ట్-కె ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఇక ఈ సినిమా గ్లింప్స్ ను 21న విడుదల చేయబోతున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో ఈ గ్లింప్స్ రిలీజ్ అవుతోంది. ఈ వేదికపై మెరవనున్న తొలి భారతీయ చిత్రం ఇదే. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్-కె రిలీజ్ అవుతుంది.