తోటి ప్రతిపక్ష పార్టీలకు చంద్రబాబు మరీ లోకువ అయినట్టు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు అంశం చంద్రబాబు అభిప్రాయాలతో సంబంధం లేకుండానే బీజేపీ, జనసేన నాయకులు ఇష్టమొచ్చిన రీతిలో ప్రకటిస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత చందంగా సీఎం ఎవరనే విషయమై పవన్‌కల్యాణ్ ప్రకటన వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సీఎంగా తప్ప, అసెంబ్లీలో అడుగే పెట్టనని చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
సీఎం రేస్ నుంచి చంద్రబాబును అకస్మాత్తుగా పవన్‌కల్యాణ్ తప్పించారు. పోనీ తనేమైనా సీఎం అవుతానంటారా? అంటే, అదీ లేదు. అసలు సీఎం ఎవరనేది ఎన్నికలకు ముందు చెప్పే అంశం కాదని, ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం ముఖ్యమని పవన్‌కల్యాణ్ అంటున్నారు. ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనేది తేలుస్తామని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు పరిస్థితి చివరికి పవన్ చేతిలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఏపీలో పొత్తుల విషయం బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా లేని పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడడమే చంద్రబాబు దయనీయ స్థితికి నిదర్శనంగా చెబుతున్నారు. తమతో బాబు పొత్తు కోసం అర్రులు చాస్తున్నారని తెలిసే, బీజేపీ పెద్దలు మరింత బెట్టు చేస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందించకపోవడానికి కూడా కారణం అదే.
ఈ దఫా ఎన్నికల్లో గెలవడం టీడీపీకి అత్యంత ఆవశ్యకమని గుర్తించిన బీజేపీ, పొలిటికల్ గేమ్‌కు శ్రీకారం చుట్టింది. రానున్న రోజుల్లో టీడీపీతో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది అంతు చిక్కడం లేదు. బీజేపీ వ్యవహారం టీడీపీ పాలిట పిల్లి, ఎలుక ఆటను తలపిస్తోంది. మరోవైపు పవన్‌కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతుండడంతో టీడీపీకి అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. ఢిల్లీలో పవన్ మనసు మార్చి, తమతో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేలా ప్లాన్ వేస్తుందా? అనే అనుమానం చంద్రబాబులో వుంది.
తాజా పరిణామాలన్నీ తమ పార్టీ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని చోటు చేసుకుంటున్నవే అని చంద్రబాబు నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లా తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తానని ప్రకటిస్తే, బీజేపీ, జనసేనల గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండేది కాదని బాబు అనుకుంటున్నారు.
రానున్న రోజుల్లో అధికారాన్ని దక్కించుకోకపోతే ఇక టీడీపీకి భవిష్యత్ వుండదనే ఉద్దేశంతో జనసేనతో కలిసి బీజేపీ కుట్రకు తెరలేపే అవకాశం ఉందా? అనే సందేహం లేకపోలేదు. చివరికి తనను సీఎం కావాలో, వద్దో జనసేన, బీజేపీ నేతలు డిసైడ్ చేసే పరిస్థితి రావడమే, తమ పతనాన్ని సూచిస్తోందని చంద్రబాబు కలత చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి దుస్థితిని చంద్రబాబు ఊహించి ఉండకపోవచ్చు.
రాజకీయ పార్టీ పదేళ్లు అవుతున్నా అసెంబ్లీలో అడుగు పెట్టని నాయకుడు, అలాగే కనీసం ఒక శాతం కూడా ఓట్లు లేని పార్టీకి చెందిన నాయకులు టీడీపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుండడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. జనసేన, బీజేపీ నేతల మాటల్ని కనీసం ఖండించలేని నిస్సహాయ స్థితిలో టీడీపీ వుంది. విధి రాత అంటే ఇదే కాబోలు అని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.