ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, అభివృద్ధి చేయలేదని పురందేశ్వరి విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా తానో ప్రత్యేకమైన నాయకురాలిగా గుర్తింపు పొందేందుకు తహతహలాడుతున్నారు. ఇదే సందర్భంలో ఆమెకు వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వెళుతున్నాయి.
తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెకు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ అని ఆయన అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై పురందేశ్వరికి అవగాహన లేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరం మేరకు నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి అప్పునకు, ఖర్చుకు లెక్క వుంటుందని ఆయన అన్నారు.
గతంలో పురందేశ్వరి మరిది చంద్రబాబునాయుడు హయాంలోనూ అప్పులు చేశారన్నారు. అప్పుడు టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాబు హయాంలో అప్పుల్ని పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. తమ ప్రభుత్వం అప్పులు చేసినా, అదంతా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు.
పురందేశ్వరి మరిది మాదిరిగా చేసిన అప్పు, ఖర్చులకు లెక్కలు లేని పరిస్థితి లేదన్నారు. టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగంపై పురందేశ్వరికి తెలియదా? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. పురందేశ్వరి అధికార పార్టీపై విమర్శలు పెంచుతున్న క్రమంలో, అటు వైపు నుంచి కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.