తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేన, టీడీపీ మధ్య శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఎపిసోడ్ చిచ్చు పెట్టింది. యాదవ సామాజిక వర్గం ఓట్ల కోసమే అంజూయాదవ్ వ్యవహారంలో టీడీపీ మౌనాన్ని పాటిస్తూ, పరోక్షంగా ఆమె చర్యల్ని సమర్థిస్తోందని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నరసింహయాదవ్, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా బీద రవిచంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు.
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ తమ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారి కావడంతో ఆమె ఏం చేసినా టీడీపీ నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేనతో పాటు టీడీపీలోని బలిజ నేతలు, కార్యకర్తలు కూడా యాదవ నేతల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తిలో హోటల్ యజమాని హరినాయుడు భార్య ధనలక్ష్మి దౌర్జన్యం చేసినప్పుడు కూడా టీడీపీ సరైన రీతిలో స్పందించలేదని ఆ పార్టీలోని బలిజలు ఆగ్రహంగా ఉన్నారు.
అంజూయాదవ్ తమ సామాజిక వర్గం కాబట్టి నరసింహయాదవ్, బీద రవిచంద్ర యాదవ్‌కు అభిమానం ఉండొచ్చని, కానీ ఆమె దుశ్చర్యలను కూడా ప్రేమించడం ఏంటని టీడీపీ బలిజ నేతలు, జనసేన నాయకులు నిలదీస్తున్నారు. అంజూ యాదవ్ ఎపిసోడ్‌లో పవన్‌కల్యాణ్ సీరియస్‌గా స్పందించడంతో రాజకీయంగా జనసేనకు ప్రయోజనం కలుగుతోందని చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
పైగా యాదవ సంఘాల పేరుతో తమ నాయకుడికి టీడీపీ నేతలు వార్నింగ్‌లు ఇవ్వడంపై జనసేన మండిపడుతోంది. పొత్తులో భాగంగా పరస్పరం రాజకీయంగా సహకరించుకోవాలని అనుకుంటున్న దశలో, ఇలా కులాల వారీగా విడిపోయి నష్టం చేసుకోవడం ఏంటని బాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో తిరుపతి టీడీపీ నాయకులకు చంద్రబాబు ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్టు సమాచారం.
అలిపిరి ఘటనలో కాపాడిన అంజూయాదవ్ అంటే తనకూ అభిమానం వుందని, అలాగని ఆమె అప్రజాస్వామిక విధానాల్ని ఎలా వెనకేసుకొస్తారని చంద్రబాబు ప్రశ్నించినట్టు సమాచారం.