ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉత్సాహంగా ఉన్నారు. ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని బలోపేతం చేస్తానని ఆమె అంటున్నారు. ఇంతకాలం ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అని ఆమె తనదైన రాజకీయ భాషలో కొత్త భాష్యం చెప్పడం విశేషం. మిత్రపక్ష పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై పురందేశ్వరి ఎంతో అభిమానాన్ని చూపుతున్నారు. ఇక మీదట ఆయన్ను రాజకీయంగా తమ దారికి తీసుకొస్తానని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీజేపీ, జనసేన మధ్య పొత్తు అనే మాటే తప్ప, ఎప్పుడూ రెండు పార్టీలు కూడా కార్యాచరణ ప్రకటించిన దాఖలాలు లేవు. రెండు పార్టీలు రాజకీయంగా కుడి, ఎడమలుగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ ఢిల్లీ వెళ్లడం కొత్త చర్చకు దారి తీసింది. జనసేనతో సంబంధాలు, ఇతరత్రా అంశాలపై పురందేశ్వరి మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు.
తమకు జనసేన మిత్రపక్షమని పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. ఆపార్టీతో ఇకపై రెగ్యులర్‌గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. టీడీపీకి, వైసీపీకి సమదూరంలో తమ పార్టీ ఉంటుందన్నారు. జనసేనతో మాత్రం పొత్తు కొనసాగుతుందని ఆమె అన్నారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేయడాన్ని పురందేశ్వరి వద్ద ప్రస్తావించగా, పొత్తుల విషయం బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. త్వరలో పవన్‌ను కలిసి చర్చిస్తానన్నారు. పవన్‌కు వీలున్న సమయాన్ని తెలుసుకుని, ఆయనతో భేటీ అయి భవిష్యత్ రాజకీయంపై చర్చిస్తామని పురందేశ్వరి చెప్పడం విశేషం. పురందేశ్వరి నాయకత్వంలోని బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్‌కల్యాణ్ సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది త్వరలో తేలనుంది.