ఎమ్బీయస్‌ : జాట్‌లపై కాంగ్రెసు హఠాత్‌ అనుగ్రహం

మన దేశంలో జాట్‌ కులస్తులు 8.5 కోట్లమంది వున్నారు. అంటే జనాభాలో 6.5% మంది అన్నమాట. హరియాణా జనాభాలో 27%, రాజస్థాన్‌లో 14%, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 10% వున్నారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయమే…

మన దేశంలో జాట్‌ కులస్తులు 8.5 కోట్లమంది వున్నారు. అంటే జనాభాలో 6.5% మంది అన్నమాట. హరియాణా జనాభాలో 27%, రాజస్థాన్‌లో 14%, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 10% వున్నారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా అన్ని రంగాలలోకి విస్తరించారు. నటులు, మోడల్స్‌లో 61 మంది జాట్లే. రాజకీయాల్లో అయితే వారి ప్రభావం మరీ హెచ్చు. ఎందుకంటే ఉత్తరభారతంలోని 9 రాష్ట్రాలలోని 226 లోకసభ స్థానాల్లో 30 స్థానాలను వారు ప్రభావితం చేయగలరు. ఒక ప్రధానమంత్రి, ఒక ఉపప్రధాని, 18 మంది ముఖ్యమంత్రులు, 3 లోకసభ స్పీకర్లు, 13 గవర్నర్లు ఆ కులస్తులే. ఇలాటి కులాన్ని ఒబిసి (అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌)గా పరిగణించడం ఎలా? కానీ మండల్‌ కమిషన్‌ 1980లో వారిని ఒబిసిలుగా గుర్తించమంది. కానీ జాట్‌లలో కొందరు దాన్ని వ్యతిరేకించారు. వారిలో చరణ్‌ సింగ్‌ ఒకరు. అయితే ఆయన కుమారుడు అజిత్‌ సింగ్‌ మాత్రం ఒబిసి గుర్తింపు కావాలని పట్టుబట్టి కాంగ్రెసుతో పొత్తుకోసం దాన్ని ఒక షరతుగా విధించాడు. వెనకబడిన కులాలను గుర్తించడానికి ఏర్పడిన ఎన్‌సిబిసి (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌) పదేళ్లగా జాట్‌లను ఒబిసిలుగా గుర్తించడానికి నిరాకరిస్తోంది. 2011 మేలో కేంద్రప్రభుత్వం ఆ కమిషన్‌కు జాట్‌లను చేర్చే విషయం పరిశీలించమని లేఖ రాసింది. సోషియో ఎకనమిక్‌ క్యాస్ట్‌ సెన్సస్‌ తయారయ్యాక, కావలసిన సమాచారం సేకరించాక జాట్‌ల విషయం తేలుస్తామని కమిషన్‌ జులైలో సమాధానం రాసింది. జాట్‌లను అడిగింది. తమను ఒబిసిలుగా గుర్తించాలని 51 సంస్థల విన్నపాలు రాగా, వద్దని 58 వచ్చాయి. రెండున్నరేళ్లు గడిచినా విషయం నానుతూనే వుంది.

కొన్ని రాష్ట్రాలలో జాట్‌లు ఆందోళనలు చేపట్టారు. జాట్‌ ఓట్లపై కన్నేసిన హరియాణా ప్రభుత్వం 2012లో తమ రాష్ట్రంలోని జాట్‌లకు ఒబిసి గుర్తింపు కలగజేసింది. 2013లో ముజఫర్‌పూర్‌లో ముస్లిములకు, జాట్‌లకు మధ్య అల్లర్లు జరిగాయి. ప్రేమ పేరుతో ముస్లిములు తమ కులంలోని అమ్మాయిలను ఆకర్షిస్తున్నారని సందేహిస్తున్న జాట్‌లు ముస్లిములపై ఆగ్రహంతో  'మేం తొలుత హిందువులం, తర్వాతే జాట్‌లం' అనే నినాదంతో బిజెపి వైపు ఆకర్షితులు కాసాగారు. ఇది కాంగ్రెసును కలవరపెట్టింది. దీనికి తోడు ఢిల్లీ ఎన్నికలు జరిగినపుడు యుపి, హరియాణా సరిహద్దుల్లో వున్న శివారు ప్రాంతాల్లో జాట్‌లు బిజెపికి ఓటేశారు. జాట్‌లను బిజెపివైపు మళ్లకుండా చేయాలంటే యిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒబిసి గుర్తింపు యివ్వాలని కాంగ్రెసు నిశ్చయించింది. అంతేకాకుండా యుపిలో అజిత్‌ సింగ్‌ను పెద్ద నాయకుడిగా చూపించవలసిన అవసరం కూడా పడింది. అందువలన 2013 డిసెంబరు 26 న కేంద్ర ప్రభుత్వం కమిషన్‌కు లేఖ రాసింది – 'జాట్‌లను ఒబిసిలలో చేర్చాలని కాబినెట్‌ నిర్ణయించబోతోంది. అందువలన మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుని ఆ మేరకు సిఫార్సు చేయవలసినది' అని. కమిషన్‌  వెంటనే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చికు లేఖ రాసి జాట్‌ల విషయంలో ఒక నిపుణుల కమిటీ వేయమని కోరింది. ఆ నివేదిక వచ్చేదాకా ఎన్నికలు ఆగవు కదా. అందుకని కేంద్రం ఒత్తిడి తెచ్చింది. 

దానిపై 2014 ఫిబ్రవరి 26 న, కమిషన్‌లోని మెంబర్‌-సెక్రటరీ ఎకె మంగోత్రా, కేంద్ర ప్రభుత్వంలో సోషల్‌ జస్టిస్‌ శాఖలోని సెక్రటరీ ఐన ఎస్‌.భార్గవకు ''జాట్‌లు సామాజికంగా కాని, విద్యాపరంగా కాని వెనుకబడి లేరు. వారికి ఒబిసి గుర్తింపు అక్కరలేదు.' అని లేఖ రాశారు. ఇది కమిషన్‌వారి అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో పెట్టారు కూడా. ఢిల్లీలోని జాట్‌లలో 85% మంది విద్యావంతులే. వాళ్లల్లో ధనికరైతులు, శక్తిమంతులైన రాజకీయనాయకులు కోకొల్లలు. ఈ లేఖ వెలువడిన వారం తిరక్కుండా కేంద్రప్రభుత్వం యీ సిఫార్సును పక్కనపడేసి ఉత్తరభారతంలోని 8, గుజరాత్‌లోని జాట్‌లకు ఒబిసి గుర్తింపు యిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ చర్యను సమర్థించేందుకు కావలసిన సమాచారం ఏదీ లేదు కాబట్టి కోర్టులో దీన్ని కొట్టేయవచ్చు. కానీ యీ లోపున ఎన్నికలలో దీన్ని ప్రచారం చేసుకోవచ్చు కదా. ''జైనులకు మైనారిటీ స్థాయి కల్పించాం. జాట్‌లకు ఒబిసి స్థాయి కల్పించాం.'' అని ఓట్లు అడగవచ్చు కదా. అయితే జాట్‌ యువత (జాట్‌లలో 60% మంది యువతేట) దీనికి పడిపోతారా లేదా అన్నది వేచి చూడాలి. కొసమెరుపు ఏమిటంటే – ఇంతా చేశాక అజిత్‌ సింగ్‌ కాంగ్రెసును వదిలేసి బిజెపి వైపు చూస్తున్నారట! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]