సోనియా విభజన తలపెట్టినది తమ పార్టీని దెబ్బ కొట్టడానికే అని చంద్రబాబు అంటూ వచ్చారు. విభజన ప్రకటన తర్వాతి సంఘటనలు నిజమే అనిపించాయి. అంతకుముందు పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెసుకు కాస్త వెనక్కాలే టిడిపి వుంది. వైకాపా, తెరాస పెద్దగా లాభపడలేదు. తెలంగాణలో కూడా టిడిపి పరిస్థితి మెరుగు పడిందనిపించింది. సోనియా విభజన తలపెట్టదని బాబుకి కాంగ్రెసులో గల ఇన్‌ఫార్మర్లు చెప్పి జోకొట్టారు. అలాటిది ఒక్కసారిగా ప్రకటన రావడంతో ఆయన కంగు తిన్నాడు. 'రాజధానికై నాలుగు లక్షల కోట్లు..యిస్తే చాలు' స్టేటుమెంటు యిచ్చి సమైక్యవాదులు విస్తుపోయేట్లు, చీదరించుకునేట్లు చేసుకున్నాడు. సీమాంధ్రలో వైకాపా, కాంగ్రెసు రెండూ 'టిడిపి లేఖ యివ్వడం వలననే యీ దుస్థితి వచ్చింది' అని వాయించి వాయించి పడేశారు. టిడిపివారు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నా 'మీ నాయకుడి చేత సమైక్యం అనిపించలేక పోయారు' అనే మాట పడుతూనే వచ్చారు. ఇక్కడ తెలంగాణలో 'మీ నాయకుడు లేఖ యిచ్చినా మేం నమ్మం. ఆయన కుట్ర చేస్తున్నాడు. ఆయన మద్దతు లేకుండా మీ నాయకులు సమైక్య ఉద్యమంలో పాల్గొనగలరా?' అని టి-వాదులు టి-టిడిపివాదులను ఉడికిస్తున్నారు. టి-టిడిపి వారు ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నారు. కాంగ్రెసు పార్టీలో, యిటీవల బిజెపిలో కూడా యీ ద్వైదీభావం వున్నా అవి జాతీయపార్టీలు. వారికి బహునాయకులు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడి 'అత్తతో అమ్మి, కోడలితో కొన్నట్టు' వ్యవహరించగలరు. టిడిపికి ఆ సౌలభ్యం లేదు. ఉన్నది ఒకటే నాయకుడు. ఆయన నోరు విప్పి ఏదీ చెప్పడు. ఒకటడిగితే మరొకటి చెప్తూ వస్తాడు. దీనివలన టిడిపి అంటే అందరికీ జోక్ అయిపోయింది.
అలాటి పరిస్థితి నుండి గత కొన్ని వారాలుగా చంద్రబాబు తారాబలం మారుతూ వస్తోంది. దానికి కారణం బిజెపి. ప్రస్తుతం విభజన ఆపగలిగినది బిజెపి ఒక్కటే అని సమైక్యవాదులు ఫిక్సయిపోయారు. 'ఒకవేళ టి-బిల్లు ఆగిపోతే దానికి కారణం కాంగ్రెసు కుటిలయుక్తా? లేక సీమాంధ్ర ప్రయోజనాల గురించి బిజెపి పట్టుబట్టడమా?' అని సీమాంధ్రుల్లో సర్వే నిర్వహిస్తే నూటికి 80 మంది బిజెపికే ఆ ఘనత కట్టబెట్టేట్టు వున్నారు. బిల్లు పాసయిపోయినా 'బిజెపి పట్టుబట్టడం వలననే మనకు యీ పెట్టుబడులు వచ్చాయి. లేకపోతే కాంగ్రెసు గుండు కొట్టించేదే' అనుకునే పరిస్థితి వుంది. పార్లమెంటులో బిజెపి తెలంగాణ బిల్లు పాస్ కానిస్తుందా లేదా అన్నది యిది రాసే సమయానికి తెలియదు. విందు భోజనంలో కాంగ్రెసుకు, బిజెపికి కుదిరిన ఒప్పందంపై కూడా క్లారిటీ లేదు. 'మేం ప్రతిపాదించిన సవరణలకు బిజెపి ఒప్పేసుకుంది' అని కమలనాథ్ చెప్తున్నాడు. 'బిల్లుకు మద్దతిస్తామన్నాం కానీ సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడాలన్నాం.' అంటున్నాడు జావడేకర్. హైదరాబాదును యూటీ చేయనిదే ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అని ఆడ్వాణీ అడిగారట. 'గవర్నరు చేతిలో శాంతిభద్రతలు న్యాయరీత్యా చెల్లదు' అని జైట్లీ వాదించారట.
వీళ్లు చెప్పిన సవరణలను యథాతథంగా బిల్లులో పెడతారో లేదో చివరిదాకా డౌటే. 'పరిశీలిస్తాం' అని చివర్లో చేరిస్తే… దానికి బిజెపి ఒప్పుకుంటుందా? మూజువాణీ ఓటుతో కానిచ్చేద్దామంటే చర్చకు పెట్టాల్సిందే అంటోంది బిజెపి. చర్చ జరిగే వాతావరణం వుందా? గురువారం బిల్లు ప్రవేశపెట్టి సోమవారం చర్చకు అంగీకరిస్తే, మధ్యలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందంటే అదొక తంటా. 'చర్చ అసమగ్రంగా వుంటే బిల్లు పాస్ చేయడానికి వీల్లేదు. మీరు ఫ్లోర్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేసుకోక, న్యాయవ్యవహారాలు సరిచూసుకోక, మా కారణంగా బిల్లు పాస్ కాలేదని నిందవేస్తే ఒప్పుకోం' అని బిజెపి గట్టిగా చెప్పవచ్చు. కాంగ్రెసు తత్తరపాట్లు చూస్తూ వుంటే యిది సవ్యంగా హేండిల్ చేస్తుందో లేదోనన్న సందేహం, తెలంగాణ రావాలని ప్రగాఢంగా వాంఛించేవారితో సహా – అందరికీ వుంది.
బిజెపి యిటువంటి స్టాండ్ తీసుకోవడానికి కారణం – సీమాంధ్రుల పట్ల వారికి గల నికార్సయిన సానుభూతి, సహానుభూతి అయితే కావచ్చు. కానీ వారికి టిడిపికి పొత్తు కుదరబోతోందన్న వార్త దీన్ని మరొకరకమైన కోణంలో చూసేట్టు చేస్తోంది. బిజెపికి యిప్పుడు స్నేహితుల అవసరం ఎంతైనా వుంది. యుపిఏ వ్యతిరేక పవనం, మోదీ ప్రభంజనం బలంగా వీస్తోంది కాబట్టి బిజెపికి 180 నుండి 200 సీట్లు వస్తాయని అనుకుందాం. పైన కావలసిన 80-100 సీట్లు మిత్రుల నుండే రావాలి. శివసేన, అకాలీదళ్ తప్ప ఎన్‌డిఏలో యితర సభ్యులు ఎవరూ లేరు. గతంలో వాజపేయి ప్రభుత్వం నడిచినపుడు ఎన్‌డిఏలో చాలా పార్టీలుండేవి. వాజపేయి ఉదారవాది యిమేజి కారణంగా వారంతా ఎన్‌డిఏలో సభ్యులుగా వున్నారు, లేదా బయటనుండి మద్దతు యిచ్చారు. వాజపేయి యిమేజి, మోదీకి లేదు. మోదీని చూసి భయపడి ప్రాంతీయపార్టీలన్నీ మూడో ఫ్రంట్‌ను పట్టుకుని వేళ్లాడవచ్చు. పైగా ఎన్‌డిఏలో వున్న శివసేన, అకాలీదళ్ రెండూ మతతత్వ పార్టీలే. శివసేనకు ప్రాంతీయతత్వం కూడా బలంగా వుంది. దేశంలోని యితర ప్రాంతీయపార్టీలు లౌకికవాదానికి కట్టుబడి వున్నాయని చెప్పుకుంటాయి. వారిని ఎన్‌డిఏకు చేరువ చేయాలంటే లౌకికవాద యిమేజి వున్న పార్టీ నాయకుడు సంధానకర్తగా వుండాలి. గతంలో ఎన్‌డిఏకు కన్వీనరుగా బాబు వుండి ఆ పని చేశారు. ఇప్పుడు బాబు మళ్లీ ఆ పని చేయాలని బిజెపి కోరిక.
దక్షిణాదిన బిజెపికి కర్ణాటకలో తప్ప వేరే చోట బలం లేదు. తమిళనాడు, కేరళలలో కాలూనే ఛాన్సు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే టిడిపితో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు గెలుచుకుంటే అవకాశం వుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలను నిలబెట్టిన బాబు నేర్పరితనం మళ్లీ పని చేస్తే మమత, జయలలిత, నవీన్ పట్నాయక్, నితిన్ కుమార్ వంటి వారు లోపలినుండో, బయటినుండో మద్దతు యివ్వవచ్చు. ఆ పని చేయడానికి బాబు కూడా రెడీయే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావడం అంటే ఆయనకు యిష్టమే కానీ, విడిపోయిన సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వుండడమంటే స్థాయి దించుకోవడమే. అందువలన జాతీయ రాజకీయాలకు వెళితే మరికొంత కాలం వెలుగులో వుండవచ్చు. అందువలననే బాబు యీ మధ్య దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. మధ్యమధ్యలో బిజెపి జాతీయ నాయకులను కలిసి ఫీడ్‌బ్యాక్ యిస్త్తున్నారు. మోదీతో సహా అందరూ బాబుకి విలువ యిస్తున్నారు, ఏకాంతంగా మాట్లాడుతున్నారు.
దీనికి ప్రతిఫలంగా బాబు ఆశించేదేమిటి? రాష్ట్రాన్ని ఎప్పటికీ సమైక్యంగానే వుంచాలని ఆయన కోరలేడు. అలా అంటే బిజెపి ఆయన మాట మన్నించలేదు. పైగా విభజనకు అనుకూలం అని లేఖ యిచ్చిన బాబు వెనక్కి వెళ్లలేరు. అందువలన విభజనను ప్రస్తుతానికి వాయిదా వేయండి అని మాత్రమే ఆయన కోరతాడు. 'ఆంధ్రను కూడా డెవలప్ చేశాక, అప్పుడు విభజిద్దాం. ఇప్పటినుండి అక్కడ కూడా పెట్టుబడులు పెడుతూ వస్తే వాళ్లు కూడా విభజనకు సులభంగా అంగీకరిస్తారు' అని ఆయన బిజెపి వాళ్లకు చెప్పి ఒప్పించడం సులభం. మోదీది కూడా 'మిఠాయిలు పంచుకోవడం' పల్లవే కాబట్టి, సీమాంధ్ర అభివృద్ధికి కారకులుగా కితాబులు పొందడానికి వారూ రెడీయే. యూటీ అని పేరు పెట్టో, పెట్టకుండానో హైదరాబాదులో పదేళ్లదాకా అందరికీ సమానావకాశాలు వంటి క్లాజులు ఏవో పెడితే, తమ వద్ద పెట్టుబడులు భారీగా పెడితే యీ లోపున సీమాంధ్రలో చాలామంది విభజనకు ఒడంబడవచ్చు. ఒట్టి హామీలు కాకుండా, గట్టి చర్యలు చేసి చూపిస్తే వాళ్లకూ నమ్మకం కుదురుతుంది. నిర్మాణదకక్షులుగా మోదీకి, బాబుకి వున్న జమిలి పేరు యిక్కడ డబుల్ ధమాకాగా పనిచేయవచ్చు.
ఇవన్నీ జరగాలంటే ప్రస్తుతానికి విభజన బిల్లు పాస్ కాకూడదు. పాస్ చేస్తే ఆ ఘనత కాంగ్రెసుకు పోతుంది తప్ప బిజెపికి, టిడిపికి సీమాంధ్రలో లాభించేది ఏమీ లేదు. పైగా కాంగ్రెసుతో బాటు బిజెపిపై కూడా ప్రజలు కోపం పెంచుకుంటారు. బిజెపితో బాటు ఆ కోపాన్ని వారితో పొత్తు పెట్టుకున్న టిడిపిపై కూడా చూపిస్తారు. టిడిపికి తెలంగాణలో యీ సారి పెద్దగా ఏమీ రాదు. సీమాంధ్రలో కూడా దెబ్బ తింటే టిడిపి సమర్థకులు వేరే పార్టీలు వెతుక్కుంటారు. అందువలన బిజెపి టి-బిల్లును తిరస్కరించడం బాబుకు అత్యవసరం. ఎన్‌డిఏ కూర్పుకు బాబు సహకారం బిజెపికి అత్యవసరం.
ఈ లింకు కారణంగా బిజెపి టి-బిల్లు విషయంలో ఏదో మడతపేచీ పెట్టి ఆపివేసేందుకే ఎక్కువ ఛాన్సుంది. అదే జరిగితే బాబు అనుకూల తెలుగు మీడియా ఆ ఘనతను చంద్రబాబుకే కట్టబెట్టి తీరుతుంది. 'విభజన అంశం జాతీయ స్థాయిలోది. కిరణ్ తిరుగుబాటు, జగన్ సమైక్య నినాదం అక్కడ పనిచేయలేదు. చంద్రబాబు వ్యూహం వలన బిజెపిద్వారా అది సాధ్యపడింది.' అంటే అందరూ ఒప్పుకుంటారు కదా! తద్వారా 2014 ఎన్నికలలో సీమాంధ్రలో ఆ పార్టీ విజయానికి దోహదపడుతుంది. ఈ యిమేజి కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో టిడిపికి కొంత దెబ్బ తగిలినా తెలంగాణలోని సమైక్యవాదులు టిడిపికి ఓటేసి కొంతమేరకు ఆదుకోవచ్చు. ఉద్యమం బలంగా వున్న చోట్ల బిజెపికి సీట్లిచ్చి, తక్కిన చోట్ల టిడిపి పోటీ చేయవచ్చు. ఇదంతా టి-బిల్లు పట్ల బిజెపి వైఖరిపై ఆధారపడి వుంటుంది. కొద్ది వారాల క్రితం కథ దాదాపుగా ముగిసిపోయిందనుకున్న టిడిపి, బిజెపి కారణంగా మళ్లీ వెలుగులోకి వచ్చేందుకు భూమిక సిద్ధమవుతోంది. దీనికి సూచన – బాబు పేరులోనే వుంది. చంద్రుడికి స్వయంప్రకాశం లేదు. ప్రస్తుతానికి బిజెపి కాంతిలో టిడిపి వెలుగబోతోందని చెప్పక తప్పదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)