టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ ఊసులు మొదలయ్యాయి. అదే ఓ మైగాడ్. ఈ సినిమాకి వెంకటేష్ తో రీమేక్ చేస్తారని తెలిసినా, సినిమా జనాలు కాస్త కూడా ఆసక్తి చూపించలేదు. వెంకీకి ఇవన్నీ మామూలే కదా, అనుకొన్నారు. కృష్ణుడి పాత్రకు రవితేజ, విక్రమ్‌లాంటి పేర్లు పరిశీలనకు వచ్చినా పట్టించుకోలేదు. కానీ పవన్ అడుగుపెట్టాడో లేదో – అందరి కళ్లూ ఈ సినిమామీదే పడిపోయాయి.
పవన్ ఒప్పుకోవడం, వెంకీ- పవన్‌ల కాంబినేషన్ సెట్ అవ్వడం అన్నీ చకచక సాగిపోయాయి. ఓ మైగాడ్ కథని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు యేడాది క్రితమే పరుచూరి బ్రదర్స్ దీన్ని తెలుగీకరించారు. పవన్ రాకతో ఈ సినిమా సమీకరణాలు మారిపోయాయి. పవన్ కోసం ఈ కథని ఎడాపెడా కెలికేస్తున్నారట. నిజానికి వెంకీ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందీ సినిమాలో. పవన్ విశ్రాంతికి ముందొస్తాడంతే.
కానీ.. ముందు నుంచీ పవన్ పాత్ర ప్రేక్షకులకు కనిపిస్తూ ఉండడానికీ, పవన్, వెంకీల మధ్య సెకండాఫ్‌లో ఎక్కువ సన్నివేశాలు రావడానికి – ఈ స్ర్కిప్టులో మార్పులు చేస్తున్నారట. ఈ విషయంలో పవన్ కల్యాణ్ సలహాలు కూడా తీసుకొంటున్నారట. మరి ఈ మార్పులూ, చేర్పులూ సినిమాకి మంచి చేస్తాయో, ముంచేస్తారో.. ఎవరు చెప్పగలరు??