తమ యజమాని ప్రభుత్వ పరువు తీయడానికి సాక్షి శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఒక వైపు వైఎస్ జగన్ పాలనలో పేదరికం సగానికి సగం తగ్గిందంటూ సంబరంగా కథనాన్ని ప్రచురిస్తూనే, దాని పక్కనే ఇదో మా జగన్ సార్ పాలనలో పేదరికం పెరిగిందని ప్రజానీకానికి అక్షరం 'సాక్షి'గా చెప్పిన ఘనత ఆ పత్రికకే దక్కింది.
ఇవాళ్టి సాక్షి పత్రికలో ప్రచురితమైన రెండు కథనాల గురించి మాట్లాడుకుందాం. పేదరికం తగ్గుముఖం, అలాగే కొత్తగా 1.63 లక్షల రైస్ కార్డులు శీర్షికలతో వేర్వేరు కథనాలను పక్కపక్కనే ప్రచురించారు. ఒకటేమో జగన్ పాలనలో అంతా సంపన్నులే అని చెప్పే ఉద్దేశం కనిపిస్తోంది. మరొక కథనంలో …పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని చూడొచ్చు.
కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో గణనీయంగా పేదలు తగ్గారని, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలన వల్లే ఇది సాధ్యమైందని రాసుకొచ్చారు. రాష్ట్రంలో ఐదేళ్లలో పేదరికం సగం తగ్గిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా జనాభాలో 10 శాతం కంటే తక్కువగా పేదలున్నారని, జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆ కథనానికి అదనంగా పెట్టిన ఉపశీర్షికలను చదివితే విషయం అర్థమవుతుంది.
గత ఐదేళ్లలో నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించినట్టు కథనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు సత్పలితాలు అందిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొనడం విశేషం. పేదరికాన్ని తగ్గించడం సుపరిపాలనకు నిదర్శనం. ఏపీలో పేదరికం తగ్గిందంటే అంతకంటే ఎవరికైనా కావాల్సిందేముంది? పేదరికం తగ్గిందనే ఆనందాన్ని ఇదే సాక్షి రాసిన మరో కథనం మిగిల్చలేదు.
అదేంటంటే… రాష్ట్రంలో కొత్తగా 1.63 లక్షల మందికి కొత్తగా రైస్ కార్డులు ఇస్తున్నారని రాసుకొచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు మాత్రమే రైస్ కార్డులు ఇస్తారు. ఒక కుటుంబానికి రైస్ కార్డు ఇవ్వాలంటే ప్రభుత్వ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
పోర్ వీలర్, ట్రాక్టర్, పది ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. నెలకు 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడకూడదు. ఈ నిబంధనలను అనుసరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం రైస్ కార్డులు మంజూరు చేస్తోంది. సాక్షి రాసిన కథనం ప్రకారం ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లో 1.46 కోట్ల రైస్ కార్డులున్నాయి. ఇప్పుడు కొత్తగా 1,63,333 కొత్త రైస్ కార్డులకు ఆమోద ముద్ర వేశారు. వీటికి సంబంధించి తహశీల్దార్ల డిజిటల్ సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కార్డులను ముద్రించి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరయ్యే రైస్ కార్డుల ద్వారా అదనంగా 3,81,061 మంది లబ్ధి పొందనున్నారు.
ఒక వైపు వైఎస్ జగన్ పాలనలో పేదరికం సగానికి సగం తగ్గిందని, దాని పక్కన పేదరికం పెరిగిందనేందుకు సంకేతంగా రైస్ కార్డుల మంజూరు గురించి గొప్పగా రాయడం వెనుక సాక్షి పత్రిక ఉద్దేశం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ కథనాలు ప్రచురించేటప్పుడు కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. పాఠక లోకానికి, ప్రజలకు ఏం చెప్పదలుచుకుందో సాక్షికే తెలియాలి. సాక్షి అజ్ఞానానికి సలాం చేయడం తప్ప, చేయగలిగిందేమీ లేదు.