పవన్ కల్యాణ్ వ్యవహార సరళి మీద మంత్రి రోజా చాలా తరచుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటి రోజా.. తాజాగా మరోసారి పవన్ మీద నిప్పులు కురిపించారు.
సినిమాల్లో ఎవరో రాసే స్క్రిప్టులు చదివే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో చంద్రబాబునాయుడు రాసిచ్చే స్క్రిప్టులు చదువుతూ బతికేస్తుంటారని.. నీతి ఆయోగ్ లాంటి విషయాల గురించి అడిగినప్పుడు.. ఆ విషయం మీద నాకు పెద్ద అవగాహన లేదు, దాని గురించి మా నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు అని సిగ్గులేకుండా చెప్తారని రోజా ఎద్దేవా చేశారు. ఆ మాత్రం కనీస అవగాహన లేని వ్యక్తి నాయకుడిగా పనికిరారు అని రోజా చెప్పుకొచ్చారు. ‘మరెందుకు నువ్వు పార్టీపెట్టింది గాడిదలు కాయడానికా’’ అంటూ మంత్రి రోజా పవన్ ను తీవ్రస్వరంతో ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యర్థులను తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోయడంలో రోజా ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారు. గతంలో తీవ్రమైన పదజాలంతో ప్రత్యర్థులను దూషించడానికి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లుండేవారు. మంత్రి పదవులు పోయిన తర్వాత.. వారు అంత చురుగ్గా ప్రతి విషయానికి రెస్పాండ్ కావడం లేదు. కానీ రోజా మాత్రం.. అనారోగ్య కారణాల వల్ల మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు గానీ.. తిరిగి వచ్చిన తర్వాత యథోరీతిగా చెలరేగిపోతున్నారు.
ముఖ్యమంత్రిని వాడు వీడు అంటూ మర్యాద లేకుండా మాట్లాడే కుసంస్కారం పవన్ కల్యాణ్ ది అని రోజా విమర్శిస్తున్నారు. పవన్ సిగ్గులేకుండా ఎన్డీయే మీటింగుకు ఎందుకు వెళ్లాడో చెప్పాలని ప్రశ్నించిన రోజా.. చంద్రబాబు చేసిన అవమానాలు మోడీకి గుర్తున్నాయి గనుక.. ఆయనను ఎన్డీయే భేటీకి పిలవలేదని, కానీ పవన్ సిగ్గులేకుండా వెళ్లారని ఎద్దేవా చేశారు.
పవన్ సినిమాల్లో హీరో రాజకీయాల్లో జీరో అంటూ, తాను ఇక్కడ దళపతిని అంటూ.. ఢిల్లీ వెళ్లి చంద్రబాబుకోసం దళారీలాగా మారాడని ఎద్దేవాచేశారు.