మోడీకి ఒక రూలు..జగన్ కు మరో రూలు

ఆయనేం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. ఆయన మాటల్లో లాజిక్ లు వెదకడం అనవసరం కూడా. ఆయనే పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కశ్యాణ్. నిన్నటికి నిన్న ఢిల్లీలో మాట్లాడిన మాటలే చూద్దాం.…

ఆయనేం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. ఆయన మాటల్లో లాజిక్ లు వెదకడం అనవసరం కూడా. ఆయనే పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కశ్యాణ్. నిన్నటికి నిన్న ఢిల్లీలో మాట్లాడిన మాటలే చూద్దాం.

‘’..దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి, మోడీ కన్న కలలు కార్యరూపం పూర్తి చేయడానికి, దేశ ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడానికి మరో అవకాశం ఇవ్వాలి…’’

ఇదీ పవన్ చెప్పిన మాటలు.

గతంలో రెండుసార్లు అధికారంలో వున్న ఎన్టీఎ ప్రభుత్వం. 2014 నుంచి ఇప్పటి వరకు మళ్లీ అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వం. కనీసం పదేళ్లు కావాలి అంటారేంటీ పవన్? 2014 నుంచి 2024 వరకు అంటే పదేళ్లు కాదా? అంటే టోటల్ గా 15 ఏళ్లు కావాలి అని చెప్పాలి కదా. సరే ఈ లెక్క సంగతి అలా వుంచుందాం.

పైగా దేశం అంతా ఓ ఆర్డర్ లో వుంది. దాన్నే ప్రగతి పథంలో నడిపించడానికి గతంలో పదేళ్లు, ఇప్పుడు 15 కావాలి. అందుకే మరో అయిదేళ్లు అవకాశం ఇవ్వాలన్నది పవన్ చెబుతున్న మాట.

మరి 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆదాయం పడిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి అన్నీ సమస్యలే మిగిలాయి. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు అయిదేళ్లు పాలించారు. దిగేముందు అన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి, ఆయన పంచాల్సినవి పంచేసి వెళ్లారు. ఇప్పుడు జగన్ వచ్చారు. జనాలకు విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క పాడయిన రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఆయనకు మాత్రం మరో అవకాశం ఇవ్వకూడదు. అర్జంట్ గా దింపేయాలి. ఎందుకుంటే భాజపా మాదిరిగా 20 ఏళ్లు పాలించి మరో అయిదేళ్లు అడగడం లేదు. జస్ట్ అయిదేళ్లు పాలించి మరో అయిదేళ్లు అడుగుతున్నారు. అందుకే దించేయాలి.

అంతే కదా పవన్?

మోడీ డెవలప్ చేసారు జగన్ చేయలేదు అని పవన్ అంటారు. మరి ఏ డెవలప్ చేయలేదనే కదా 2019లో చంద్రబాబును విబేధించారు. ఆ తరువాత అయిదేళ్లు చంద్రబాబు ఖాళీగా వున్నారు. ఇప్పుడు మరి ఏం చూసి చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించాలి అంటున్నారు పవన్? ఈ అయిదేళ్ల ఖాళీ లో చంద్రబాబు లో ఏ మార్పు వచ్చిందని పవన్ భావిస్తున్నారు.

మోడీకి ఓ రూలు..జగన్ కు మరో రూలు అన్న మాట.