భాజపా వ్యతిరేక పార్టీల కూటమి ఇప్పుడు ‘ఇండియా’ – ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ గా అవతరించింది. అప్పుడూ ఇప్పుడూ కూడా వారి లక్ష్యం మాత్రం ఒక్కటే… బిజెపి సారథ్యంలోని కూటమిని ఓడించడం. ఇప్పుడు మరికొన్ని పార్టీలను కలుపుకుని 26 పార్టీలతో కొత్త కూటమిగా అవతరించారు.
విపక్షాలు తమ కూటమికి కొత్త పేరు ప్రకటించుకున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోడీ తమ ఎన్డీయే కూటమికి కొత్త నిర్వచనాన్ని సెలవిచ్చారు. N అంటే న్యూ ఇండియా D అంటే డెవలప్‌డ్ నేషన్ A అంటే ఆస్పిరేషన్ ఆఫ్ ప్యూపుల్ ఆఫ్ ఇండియా అంటూ మోడీ కొత్త నిర్వచనం చెప్పారు. ఒక కూటమి కొత్త పేరు పెట్టుకుంది.. మరో కూటమి కొత్త నిర్వచనం చెప్పుకుంది. పోటాపోటీగా భేటీలు నిర్వహించడంతో సమరభేరి మోగినట్టుగానే భావించాల్సి వస్తోంది.
విపక్షాల భేటీ ముగిసిన తర్వాత.. పాలకపక్షాల భేటీ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా తనను వ్యతిరేకిస్తున్న వారిని గేలిచేస్తూ ప్రధాని మోడీ ఒక మాట చెప్పారు. ‘వారు ఒకరికొకరు సమీపంగా రాగలరు.. కానీ సమైక్యంగా పనిచేయలేరు’ అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ అధికారం మీదనే ఆశ ఉండే విపక్షాల ఐక్యత గురించి ఆయన వ్యాఖ్య అబద్ధం అని తేలాలంటే.. ముంబాయిలో జరిగే మూడో భేటీ వరకు వేచి ఉండాలి.
ఎందుకంటే ప్రస్తుతానికి కూటమి సారథ్య బాద్యతలు చూడడానికి 11 మంది సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటుచేసుకున్నారు. ముంబాయి భేటీలో కొత్త పేరుతో ఏర్పడిన కూటమి కన్వీనర్ ను కూడా ఎన్నుకుంటారు. యూపీఏ కు గతంలో సోనియాగాంధీ కన్వీనర్ గా ఉన్నారు. అదే పేరుతో కంటిన్యూ అయితే సారథ్యం ఆమె చేతుల్లోనే ఉంటుందని భయపడ్డారో లేదా, కొత్త కన్వీనర్ ను నియమిస్తే ఐక్యత విషయంలో తప్పుడు సంకేతాలు వెళతాయని అనుకున్నారో తెలియదు.
ఒకవైపు కాంగ్రెస్ తమకు ప్రధాని పదవి మీద కూడా ఆసక్తి లేదని అంటున్న నేపథ్యంలో.. కన్వీనర్ పోస్టు కాంగ్రెసేతర సీనియర్ కు దక్కవచ్చుననే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ కొన్ని త్యాగాలకు సిద్ధపడకపోతే.. కూటమి ముందుకు సాగడం సాధ్యం కాదనే వాదన కూడా ఉంది.