సునందా పుష్కర్ నిరాశలో ఎందుకు మునిగింది?

సునంద మృతిపై విచారణ జరుగుతోంది. ఎవరూ హత్య చేసినట్లు చెప్పలేకపోతున్నారు. సూసైడ్ నోట్ దొరకలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నట్టూ చెప్పలేం. ఆమెకు పుట్టెడు అనారోగ్యం అన్నట్లు మొదట్లో ప్రచారం జరిగినా, దానికి ఆధారాలు లేవు.…

సునంద మృతిపై విచారణ జరుగుతోంది. ఎవరూ హత్య చేసినట్లు చెప్పలేకపోతున్నారు. సూసైడ్ నోట్ దొరకలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నట్టూ చెప్పలేం. ఆమెకు పుట్టెడు అనారోగ్యం అన్నట్లు మొదట్లో ప్రచారం జరిగినా, దానికి ఆధారాలు లేవు. మామూలు అనారోగ్యమేనట. నిద్రమాత్రలు, యాంటీ-డిప్రసెంట్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వలన ప్రమాదవశాత్తూ చనిపోయిందని ప్రస్తుతానికి అనుకోవాలి. అసలు డిప్రెషన్ ఎందుకు రావాలి అన్నది ప్రశ్న. సునంద జీవనసరళి విలాసభరితం. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. దుబాయిలో 12 అపార్టుమెంట్లు, కెనడాలో ఒకటి, జమ్మూలో రియల్ ఎస్టేటు వ్యాపారం, జ్యూవలరీ వుంది, రూ. 7 కోట్ల విలువ చేసే వాచీలు, బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి. ఆస్తుల విలువ రూ.113 కోట్లు వుంటుందంటున్నారు. హుమయూన్ కాలం నాటి కత్తి ఒకటి ఆమె వద్ద వుంది. దాని విలువ ఎంతో చెప్పడం కష్టం. ఇక శశిథరూర్ తరార్‌తో ప్రేమలో పడ్డాడు కాబట్టి, ఈమె హృదయం భగ్నమైంది అంటే కాస్త వింతగా వుంటుంది. ఎందుకంటే ఒకరితో పెళ్లి, మరొకరితో ప్రేమ ఒకేసారి నడిపించగల ఘనులు ఆమె, శశి! 

18 వ యేట శ్రీనగర్‌లో గవర్నమెంటు విమెన్స్ కాలేజీలో ఎకనమిక్స్ చదువుతూనే డాల్ లేక్ వద్ద వున్న సెంటార్ లేక్‌వ్యూ హోటల్లో హోస్టెస్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేది. ఆ హోటల్లోనే ఫ్రంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సంజయ్ రైనా అనే అతన్ని ప్రేమలో పడేసింది. అతను హోటల్ మేనేజ్‌మెంట్‌లో కోర్సు చదివాడు. ఇద్దరూ కాశ్మీరీ హిందూలే. అయినా ఆమె తండ్రి కల్నల్ పుష్కర్ నాథ్ దాస్ పెళ్లికి అనుమతి ఇవ్వలేదు. తల్లిదండ్రులు వద్దన్నా 1986లో పెళ్లి చేసుకున్న సునంద అతి త్వరగానే భర్తతో విడిపోయింది. దానికి కారణం భర్త స్నేహితుడు, సుజిత్ మేనోన్‌తో ఆమె ప్రేమలో పడడమే. డబ్బున్న వ్యాపారస్తుడైన అతని సహాయంతో వైవాహిక బంధం తెంచుకుని దుబాయికి తరలిపోయింది. అక్కడ చాలా వ్యాపారాలు చేసి బాగా గడించింది. అక్కడి సోషల్ సర్కిల్స్‌లో పేరు గడించింది. అక్కడకు వెళ్లిన రెండేళ్లకు సుజిత్‌ను పెళ్లాడింది. అతను మలయాళీ. బాలీవుడ్ స్టార్స్‌తో ఆమె దుబాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసేది.

వాళ్లిద్దరికీ 1992లో శివ్ మేనోన్ అనే కొడుకు పుట్టాడు. 1997లో సుజిత్ ఢిల్లీ కరోల్‌బాగ్‌లో కారు డ్రైవ్ చేస్తూ దేన్నో గుద్దేసి చనిపోయాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడి ఆ రకంగా ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. సునందను అడిగితే ‘ఆర్థిక సమస్యలున్నమాట నిజమే కానీ, అది యాక్సిడెంటే, ఆత్మహత్య కాదు’ అంది. తండ్రి మృతి ప్రభావం పిల్లవాడిపై తీవ్రంగా పడింది. అతని మాట దెబ్బతింది, అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు సునంద దుబాయిలో తనకు బాగా పరిచయాలున్నా మంచి వైద్యం కోసం అతన్ని కెనడాకు తీసుకెళ్లి చికిత్స చేయించింది. ఇప్పుడు ఆ అబ్బాయిని సినిమాల్లో చేర్పించాలని చూస్తోంది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూలులో తర్ఫీదు ఇప్పిస్తోంది. 2004లో మళ్లీ దుబాయికి వచ్చి రియల్ ఎస్టేటు వ్యాపారం మొదలుపెట్టింది. 

ఈమె దుబాయిలో చేయని వ్యాపారం లేదు. సాధారణంగా మగవాళ్లు మాత్రమే వుండే టూరిజం, ఐటీ, రియల్ ఎస్టేటు వ్యాపారాలు చేపట్టి చాలా ఆర్జించింది. గొప్పగొప్ప వాళ్లందరితో  స్నేహాలు నెరపింది. తన రెండో భర్త కారణంగా అనేకమంది మలయాళీలు కూడా పరిచయమై ఆమెకు దుబాయిలో ఉపయోగపడ్డారు. వారిలో ఒకరైన సన్నీ వర్కీ అనే దుబాయిలో స్థిరపడిన మలయాళీ వ్యాపారస్తుడు మిలయనీర్ల కోసం కట్టిన ఎమిరేట్ హిల్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో వుంటున్నాడు. అక్కడ బేనజీర్ భుట్టో కుటుంబానికి కూడా విల్లా వుంది. సన్నీ 2009 జూన్‌లో తన విల్లాలో పెద్ద పార్టీ ఇచ్చాడు. విదేశాంగ మంత్రిత్వశాఖలో సహాయమంత్రిగా చేరిన శశి థరూర్ ఆ పార్టీకి హాజరయ్యాడు. అక్కడ సునంద అతనికి పరిచయమైంది. అప్పటికి శశి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి యునైటెడ్ నేషన్స్‌లో తనతో పని చేసిన క్రిస్తా గైల్స్‌ను పెళ్లాడి వున్నాడు. సునందను చూస్తూనే ప్రేమలో పడ్డాడు. ఐదు నెలల తర్వాత థరూర్ ఒక మీటింగుకు హాజరు కావడానికి మస్కట్‌కు వెళ్లాడు. సునంద అక్కడకు వచ్చి వాలింది. ఇద్దరూ హోటల్లో కాపురం పెట్టారు. సునంద మోజులో పడిన థరూర్ కొన్ని నెలలకు క్రిస్తాకు విడాకులిచ్చి వదిలించుకున్నాడు.  సునందను వెంట వేసుకుని తిరగసాగాడు. 
కోచీ క్రికెట్ టీమ్-ఐపిఎల్ వివాదంలో సునంద రూ.75 కోట్ల వాటా పొందడంతో శశి ఆమె పేరుతో లంచం పుచ్చుకున్నాడన్న ఆరోపణలు చుట్టుముట్టి 2010 ఏప్రిల్‌లో వీరి రొమాన్సు అందరికీ తెలిసింది. సునంద కోపంతో ‘నేను ఇంకోరి పేర వ్యాపారం చేయడమేమిటి? నేను స్వయంగా చేసుకోలేనా? దుబాయిలో సంపాదించలేదా?’ అని ఎగిరిపడి, ఆ వాటా వదులుకుంది. అంతేకాదు, నాలుగు నెలల తర్వాత ఈ గొడవ కారణంగా పదవి వూడిన థరూర్‌ను పెళ్లి చేసుకుంది. ఇక అక్కణ్నుంచి పార్టీలే పార్టీలు, విలాసాలే విలాసాలు. థరూర్ కూడా విలాస పురుషుడే కాబట్టి ఈపార్టీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చాడు. అయితే 2012 అక్టోబరులో మంత్రి పదవి వచ్చాక అతనిలో కాస్త బెరుకు వచ్చింది. మంత్రిగా వుంటూ తను ఇలాంటి పార్టీల్లో కనబడితే విమర్శలు చెలరేగి, రాజకీయంగా ఎదగడం కష్టమనుకున్నాడు. పార్టీలు తగ్గించాడు. అది సునందకు కష్టం కలిగించింది. జీవితంలో ఆనందం కోల్పోయినట్లు ఫీలయింది. పార్టీలకు రావాలని, డాన్సు చేయాలని భర్తపై ఒత్తిడి పెంచింది. వారిద్దరి మధ్యా గొడవలకు అదొక కారణం. డిసెంబరు 31 న గోవా బీచ్‌లో కింగ్‌ఫిషర్ విల్లాలో జరిగిన పార్టీలో థరూర్, సునంద ఇద్దరూ పాల్గొన్నా ఇదివరకటి హుషారు లేదని అందరూ గమనించారు.

ఇలా వుండగా పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ రంగంలోకి వచ్చింది. థరూర్‌కు, తనకు మధ్య శారీరకమైనది ఏదీ లేదని మెహర్ అంటున్నా ‘దుబాయి హోటల్‌లో వాళ్లిద్దరూ సన్నిహితంగా వుండడం సిసిటివిలో పడింది. ఆ ఫుటేజ్‌ను నేను చూశాను.’ అని సునంద తన స్నేహితురాలితో చెప్పుకుంది. ఆమెతో సంబంధం తెంచుకోవాలని సునంద పట్టుబట్టడంతో ‘సరే, ఇక ఆమెతో మాట్లాడను, మెయిల్స్ ఇవ్వను’ అని థరూర్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె పేరును ‘హరీష్’ పేరుతో తన బ్లాక్ బెరీలో సేవ్ చేసుకుని మాట్లాడుతూండేవాడు. తన ఆరోగ్యపరీక్షలు చేయించుకుని తిరువనంతపురం నుండి ఢిల్లీకి వస్తున్నపుడు విమానప్రయాణంలో ఈ విషయం సునందకు తెలిసిపోయింది. అది చూడగానే ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. మెసేజ్‌లు చూస్తే థరూర్ మెహర్‌ను వదుల్చుకోవాలని చూస్తున్నా, మెహర్ మాత్రం వ్యవహారం కొనసాగించాలని చూస్తోందని అర్థమవుతోంది. అయినా ఈ విషయాన్ని తన భర్త తన దగ్గర దాచాడని, మోసం చేశాడని తేలగానే అది సునంద అహాన్ని దెబ్బ తీసింది. ఆమె ఎయిర్‌పోర్టు నుండి ఇంటికి రాకుండా సరాసరి హోటల్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత తన భర్త ట్విట్టర్ ఖాతాలోకి చొరబడడం, అన్నీ బయటపెట్టడం, మెహర్ సంగతి బహిరంగ పర్చడం – అన్నీ అందరికీ తెలిసిన విషయాలే!

ఆమెకు మంత్రి భార్యగా గౌరవమూ కావాలి, సోషల్ బటర్‌ఫ్లయిగా గ్లామరూ కావాలి. భర్తకు తననుండి దృష్టి మరలకూడదు. ఇలా జరగటం లేదని తెలియగానే ఆమె నిరాశలో మునిగింది. అయితే కొడుకు శివ్‌ను సినిమా నటుడిగా చేయకుండా చనిపోదామని ఆమె అనుకుని వుండదు. డిప్రెషన్ తగ్గడానికి వేసుకున్న మాత్రలు మితిమీరి వేసుకోవడం వలననే మరణించి వుండవచ్చు. అది పొరబాటున వేసుకుందా లేక క్షణికమైన ఆవేశంలో వేసుకుందా అన్నది తేలాలి. తేలుతుందా? 

–   ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014) 

[email protected]