ఎమ్బీయస్‌ : కిరణ్‌ని తీసేయటం లేదేం?

ఆరువారాలుగా అసెంబ్లీని అతలాకుతలం చేసిన తెలంగాణ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రాన్ని విడిచి వెళ్లింది. శాసనసభచే తిరస్కరించబడి మరీ వెళ్లింది. మీరేం చేసినా డోంట్‌ కేర్‌ మేం ఎలాగూ దాన్ని నెత్తిన పెట్టుకుంటాం అని హై…

ఆరువారాలుగా అసెంబ్లీని అతలాకుతలం చేసిన తెలంగాణ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రాన్ని విడిచి వెళ్లింది. శాసనసభచే తిరస్కరించబడి మరీ వెళ్లింది. మీరేం చేసినా డోంట్‌ కేర్‌ మేం ఎలాగూ దాన్ని నెత్తిన పెట్టుకుంటాం అని హై కమాండ్‌ వారు చాటి చెప్తున్నారు. మీ రాష్ట్రం విడగొట్టడానికి మీ అభిప్రాయం అడిగేదేముంది బోడి అని మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు. మాట్లాడితే రాజ్యాంగం మాకా హక్కు యిచ్చిందంటారు. అలా అని రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారా అంటే మళ్లీ అది లేదు. రాజ్యాంగంలో లేని ఉమ్మడి రాజధాని, గవర్నరు చేతికి శాంతిభద్రతలు… యిలా కొత్త పోకడలు పోతున్నారు. కమిటీలంటారు, అందరి అభిప్రాయాలూ తీసుకుంటామంటారు, మళ్లీ ఏ పాయింటుకీ కట్టుబడి వుండరు. ఎవరి అభిప్రాయమూ అక్కరలేదంటారు. అన్నీ మాకు తెలుసంటారు. ఇక వారి అండ చూసుకుని టి-నాయకులు ధైర్యం చూపుతారు. రాష్ట్రం అంటే గుడ్డికన్ను. మూసినా, తెరిచినా ఒకటే. కేంద్రందే అసలైన కన్ను. వారి చల్లనిచూపు వుంటే చాలు అంటారు.  మరి రాష్ట్రం కన్ను తెరిస్తే అంత ఉలికిపాటు ఎందుకు? కిరణ్‌, స్పీకరు కలిసి చేసిన కుట్ర యిది అంటున్నారు. పాపం స్పీకరును ఎందుకు లాగాలి? మరొకరూ, మరొకరూ కాదు, సాక్షాత్తూ సభానాయకుడు యిచ్చిన నోటీసును తిరస్కరించలేం, రూల్సు ప్రకారం ఓటింగుకి పెట్టాల్సిందే అంటూ వాపోయాడు. ఓటింగుకి పెడితే మూజువాణీ ఓటుతో నెగ్గేసింది. అందులో ఆశ్చర్యమేముంది అంటున్నారిప్పుడు కొంతమంది. హై కమాండ్‌ వచ్చి కొందరు ఎస్సీ, ఎస్టీ సభ్యులను, మరి కొందరు యితర సభ్యులను మేనేజ్‌ చేసింది కాబట్టి ఓటింగులో ఓడిపోయే ఛాన్సు కూడా వుందనుకున్నాం.

తిరస్కరణకు కేంద్రబిందువు కిరణ్‌

సమైక్యతీర్మానం పెట్టో, లేక విభజన బిల్లు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అనో అని వుంటే మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినా మైనారిటీ సభ్యుల కోరిక మేరకు మేం నిర్ణయం తీసుకున్నాం అనగలదు కేంద్రం. కానీ యిప్పటి పరిస్థితి అది కాదు. 'అసలు యిదే బిల్లు కాదు, దీనిలో వుండవలసిన ముఖ్యమైన అంశాలు లేవు, సవ్యమైన తీరులో అసెంబ్లీకి పంపలేదు.' అనే వాదనతో వెనక్కి పంపారు. కేంద్రం హోం శాఖ చేసిన పొరబాటు దీనికి తావిచ్చింది. మామూలు పరిస్థితుల్లో అయితే సరి చేసుకుని పంపవచ్చు. కానీ వాళ్లకు టైము లేదు. అంతా అడావుడే. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రుల ముఠా సమావేశం, 9024 సవరణల పరిశీలన,  వీలైతే మార్పులు చేసిన బిల్లుపై కాబినెట్‌ తీర్మానం – అన్నీ అయిపోవాలి. రెండోవారంలో పార్లమెంటులో పెట్టేయాలి. ఈ తొందరే కొంప ముంచుతోంది. ఈ లోగా కోర్టు కలగజేసుకుందంటే హరిలోరంగహరి! కిరణ్‌ ఢిల్లీలో నిరసన చేపడితే అది పార్లమెంటు సభ్యుల్లో పునరాలోచనకు దారి తీస్తుంది. వాదోపవాదాలు పెరుగుతాయి. బిల్లు నడక సాఫీగా సాగదు. 

ఇంత గొడవకు కారణం కిరణ్‌! 'అతను విభజన వ్యతిరేకిస్తాడు, అయినా పట్టించుకోనక్కరలేదు, అతను ఎన్ని గంటలు మాట్లాడినా కంఠశోషే తప్ప ఏమీ జరగదు' అనుకుంటూ వస్తే మొత్తానికి దీన్ని కేంద్ర-రాష్ట్ర విభేదంగా మార్చాడు. కేంద్రం రాష్ట్రపతితో ఆడుకుంటోంది అన్న కలర్‌ యిచ్చాడు. హోం శాఖ రాష్ట్రాలను పూచికపుల్లలా ఎలా తీసిపారేస్తోందో, సమాచారం యివ్వకుండా 'మీకు అనవసరం' అని ఎలా అంటోందో దేశానికి చాటి చెప్పాడు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది అంటున్నారు. పార్లమెంటులో వున్న ప్రాంతీయపార్టీలన్నీ ఉలిక్కిపడేలా వుంది యీ సంఘటనల క్రమం. గతంలో ఎన్టీయార్‌ యిలాగే కేంద్రంపై ధ్వజం ఎత్తారు. ఇప్పుడు అధికారపక్ష సభ్యుడై వుండి కూడా కిరణ్‌ ప్రశ్నలు వేస్తున్నారు. తమను యిలా యిబ్బంది పెడుతున్నా కిరణ్‌ను కాంగ్రెసు హై కమాండ్‌ ఎందుకు తీసివేయటం లేదు? అనే ప్రశ్న వస్తుంది. దానికి అతి సులభమైన సమాధానం – వాళ్లు చెప్పినట్లే కిరణ్‌ అడుతున్నాడు కనుక! అది సమాధానం అయితే కావచ్చు కానీ అదొక్కటే సమాధానం కాకపోవచ్చు. అందువలన దాన్ని పక్కకు పెట్టి వేరేలా ఆలోచిద్దాం.

అధిష్టానం నిజంగా బలంగా వుందా?

మొదటగా మనం అనుకోవలసినది – కాంగ్రెసు హై కమాండ్‌ తను అనుకున్నది అనుకున్నట్టు, అన్ని చోట్లా, అన్ని వేళలా చేయగలుగుతోందా? తనతో భాగస్వామ్యం వున్న ఎన్‌సిపి వంటి పార్టీలను ఏమీ చేయలేకుండా వుంది, భాగస్వామ్యం తీసుకుంటానన్న తెరాస వంటి పార్టీలనూ ఏమీ చేయలేకుండా వుంది. సొంత పార్టీలో కూడా ఏమీ చేయలేదా? గతంలో వైయస్‌ సంగతి చూశాం. వైయస్‌ కేంద్రం మెడలు వంచి అనేకం సాధించుకుని వచ్చారు. అయినా కెవిపికి ఒక పట్టాన రాజ్యసభ సభ్యత్వం యిప్పించలేకపోయారు. ఆ విషయంలో తన పంతం చెల్లించుకున్న కేంద్రం 2009లో తెరాసతో పొత్తు విషయంలో వైయస్‌ను ఒప్పించలేకపోయింది. అంటే ఒక్కోసారి ఒక్కోరిది పై చేయి అవుతుందన్నమాట. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల విషయమే తీసుకోండి. అధిష్టానం మెదడులో వున్న కొప్పుల రాజు వగైరా అభ్యర్థులు వేరు. కానీ అంతిమంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతారన్న భయంతో వారితో సన్నిహితంగా వుండే కెవిపి, టియస్సార్‌లను ఎంపిక చేశారు. అక్కడే తెలుస్తోంది వారి బలహీనత. అది యిప్పుడు కొత్తగా వచ్చినది కాదు. తెలంగాణ సమస్య 2009 నుండి తీవ్రంగా వుందనుకుంటే దాన్ని కంట్రోలు చేయడానికి సిఎం పదవి ఒకరికి, పిసిసి అధ్యకక్షుడి పదవి మరొకరికి యిస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు. రెండు పదవులూ సీమాంధ్రులకే యిచ్చారు. స్పీకరు పదవి కూడా వాళ్లకే. చివరకు డిప్యూటీ సిఎం, డిప్యూటీ స్పీకరు పదవులు తెలంగాణ వారికి యిచ్చారు. డిప్యూటీ సిఎం పదవి నియామకం కూడా చాలాకాలం తాత్సారం చేసి యిచ్చారు. తాము బలహీనంగా వున్నారు కాబట్టే నిర్ణయం అంత ఆలస్యమైంది. తన పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పుకోలేక, బాలన్స్‌ తప్పి వ్యవహరించారు. 

తాము ఏరికోరి ఎంపిక చేసిన ముఖ్యమంత్రికి సహకరించం అంటూ అప్పట్లో జగన్‌ పక్షం వహించిన మంత్రులు, తెలంగాణ మంత్రులు సహాయనిరాకరణ చేస్తే వాళ్లను దండించగలిగారా? అలా అని ముఖ్యమంత్రిని మార్చారా? అదీ లేదు. వీళ్లల్లో వీళ్లు కొట్టుకుని చచ్చి ఏదో ఒక అండర్‌స్టాండింగ్‌కు రావాలి. అంతే. వాళ్లు ఏమీ చెప్పరు, చెప్పలేరు. తెలంగాణ యిచ్చి తీరాలంటూ ఆ ప్రాంతపు ఎంపీలు పార్లమెంటులో నానా అల్లరీ చేశారు. వారిని అదుపు చేయగలిగారా? లేదే! బతిమాలుకోవడాలు, లేదా చూసీ చూడనట్లు వూరుకోవడాలు. వాళ్లలో ముగ్గురు పార్టీ విడిచి వెళ్లిపోతే వారిని బహిష్కరించారా? లేదే! పైగా వారిలో ఒకరు తెరాస అభ్యర్థిగా వస్తూ వుంటే తమ మిగులు ఓట్లతో వారికి మద్దతు యిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ యిద్దామని గట్టిగా అనుకున్నారు కదా, వ్యక్తిగతంగా తను సమైక్యవాదినని పదవిలోకి వచ్చిన తొలి రోజునుండీ చెప్పుకుంటున్న కిరణ్‌ను పక్కకు పెట్టి ఏర్పాట్లు చేయాలి కదా. కిరణ్‌ను తీయడానికి భయం. కిరణ్‌ ఏదో చేసేస్తాడని కాదు, అతని స్థానంలో రావడానికి నేనంటే నేనని పోటీలు పడి అందరూ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతారని భయం. ఇప్పటిదాకా సీమాంధ్రకు యిచ్చారు కాబట్టి యిప్పుడు తెలంగాణకు ఛాన్సు యివ్వాలి అంటూ తెలంగాణ నుండి అరడజను మంది లేచి నిలబడతారు. కావాలంటే పిసిసి అధ్యక్ష పదవి వారి కివ్వండి, సీమాంధ్ర వ్యక్తికి బదులుగా సీమాంధ్రుణ్నే వేయండి అంటూ సీమాంధ్ర నుండి యింకో అరడజను మంది ముందుకు వస్తారు. మాకు యివ్వకపోతే టిడిపికో, వైకాపాకో వెళ్లిపోతాం అంటూ బెదిరిస్తారు. కనీసం పదిమంది ఫిరాయించినా సర్కారు కూలుతుంది. ఎన్నికల వేళ నిధులు అందించే రాష్ట్రం చేజారిపోతుంది. అందువలన ఏ నిర్ణయమూ తీసుకోలేక నానుస్తారు.

కాంగ్రెసు చరిత్రే యింత

కాంగ్రెసులో యీ నాన్పుడు ఎప్పణ్నుంచో వుంది. నెహ్రూ మాట కూడా పూర్తిగా చెల్లేది కాదు. క్రమేపీ ఆయన బలపడ్డాడు. ఆయన పోయాక, 1967 ఎన్నికల నుండి కాంగ్రెసు పార్టీ బలహీనపడింది. ఇందిరా గాంధీ తొలి సంవత్సరాల్లో ఆమె మాట ఎవరూ వినేవారు కారు. 1971 తర్వాత ఆమె మాట శిలాశాసనమైంది. 1977 లో ఆమె ఓడిపోయింది. తర్వాత మళ్లీ 1980 నుండి నాలుగేళ్లపాటు ఏలింది. రాజీవ్‌ తొలిరోజుల దూకుడు క్రమేపీ తగ్గిపోయింది. మైనారిటీ ప్రభుత్వం నడిపిన పివి నియంతృత్వం చూపలేదు. అందర్నీ మేనేజ్‌ చేసుకుంటూ గడిపారు. ఇక సోనియా అధినేతగా వచ్చిన తర్వాత ఆమె రాజకీయాలు నేర్చుకోవడానికే టైము పట్టింది. టపటపా నిర్ణయాలు తీసుకోవడం ఆమె చేత కాదు. పైగా ఆమె హయాంలో పార్టీ చాలా ఎగుడుదిగుళ్లు చూసింది. ముఖ్యమంత్రులను తరచుగా మార్చడం ఆమె తరహా కాదు. 

ఆమె కుమారరత్నం ఆమెకు ఎక్కి రాలేదు. అతను దేనిలోనూ పూర్తిగా ఆసక్తి చూపడు. అప్పుడప్పుడు ఉరిమి వెళ్లిపోతూ వుంటాడు. అందువలన ఆమె ఏదీ ఓ పట్టాన తేల్చదు. దూరాలోచన వున్నట్టూ తోచదు. ఇటీవల ఎసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత సోనియా అంటే మరింత చులకన పెరిగింది. 2014 ఎన్నికలలో యుపిఏ ఛస్తే అధికారంలోకి రాదు అని మీడియా అంతా ఘోషిస్తూండడంతో తిరుగుబాటు దార్లందరికీ ధైర్యం వచ్చేసింది. ప్రస్తుతానికి తెలంగాణ యిచ్చేస్తారన్న అభిప్రాయంతో సీమాంధ్ర నాయకులు తిరగబడుతున్నారు. రేపు అటూయిటూ అయి తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్‌ కాకపోతే అప్పుడు తెలంగాణ కాంగ్రెసు నాయకులు తిరగబడి అధిష్టానాన్ని నానామాటలూ అంటారు.

ముందస్తు పథకం ఏమీ వుండివుండదు

నిజానికి యిప్పుడు జరుగుతున్నదంతా కిరణ్‌ పథకం ప్రకారం సాగుతోందనుకోవడానికి లేదు. ముందే ప్రణాళిక వేసి ఎన్‌జిఓల చేత సమ్మె చేయించారని, దిష్టిబొమ్మలు తగలబెట్టించారనీ, విగ్రహాలు పగలకొట్టించాడనీ అనుకోవడం అర్థరహితం. తను సమైక్యవాదం గురించి ఎంత చెప్పినా పైవారు వినిపించుకోనందుకు హతాశుడై తిరిగి వచ్చి యింట్లో కూర్చున్నాడు. అయితే ప్రజల్లో సమైక్య ఉద్యమం తీవ్రంగా వచ్చింది. ఇలా వస్తుందని ఎవరూ వూహించలేదు. ఎందుకంటే సీమాంధ్రులు అన్ని రోజులూ స్తబ్దంగా వున్నారు. విభజన సమయంలో హైదరాబాదును ప్రత్యేకరాష్ట్రం చేసినా, యుటీ చేసినా, లేక ఐదేళ్ల తర్వాత తెలంగాణ యిస్తాం, యీ లోపున మీ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం అన్నా వాళ్లు వూరుకునేవారేమో. సీమాంధ్ర నాయకులు కూడా అదే అనుకున్నారు. సోనియా సహచరులు వాళ్లకు అలాగే చెప్పి మభ్యపెట్టారు. ప్రజలు గొడవ చేయకపోతే మనం మాత్రం ఎందుకు నోరెత్తాలి? అనుకున్నారు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు. 

అయితే జులై 30 నాటి తీర్మానంలో తెలంగాణవారు అడిగినవన్నీ యిచ్చేసి సీమాంధ్రకు బొత్తిగా శఠగోపం పెట్టడంతో వచ్చింది చిక్కు. హైదరాబాదు లేకపోతే మన బతుకు ఎలా? అన్న భయంతో సీమాంధ్రులు తిరగబడ్డారు. ఆ ఉద్యమాన్ని కిరణ్‌ తనకు అనువుగా మార్చుకున్నారంతే. ఎందుకంటే రాష్ట్రం సమైక్యంగా వుంటే కాంగ్రెసు నెగ్గినా తర్వాతి సిఎం తెలంగాణ వ్యక్తే అవుతారు. విడిపోతే జగన్‌తో పోటీ పడడం కిరణ్‌కు అసాధ్యం. ఇప్పుడున్నదానికి మించి ఆయనకు దక్కబోయేది ఏమీ లేదు. అందుకే సమైక్య ఉద్యమ కాంతిలో కిరణ్‌ వెలగబోయారు. ఉద్యమం బలపడినకొద్దీ ఆయన యిమేజి స్థిరపడింది. కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. దానికి తోడు ఢిల్లీ నాయకులు అవాకులు, చెవాకులు వాగడం, అవకతవకగా, అన్యాయమైన చేష్టలు చేయడం కిరణ్‌కు కలిసి వచ్చింది. ఈ రోజు ఆయన ఢిల్లీని ధిక్కరించినా సీమాంధ్రులు శభాష్‌ అంటున్నారు తప్ప అదేమిటి అనడం లేదు.

ఉద్యమం బలం గమనించే అధిష్టానం తటపటాయిస్తోంది

ఇది గమనించే హై కమాండ్‌ తమాయించుకుంటోంది. కిరణ్‌ యిప్పుడు మామూలు కిరణ్‌ కాదు, సమైక్య కిరణ్‌. అతన్ని తీసేస్తే సమైక్యం కోసం పదవీత్యాగం చేసిన అమరవీరుడిగా ఖ్యాతి గడిస్తాడు. అతని స్థానంలో ఏ బొత్సనో, కెసియార్‌నో తెస్తే ఎన్నికలలో గెలుస్తారో లేదో తెలియదు. ఆమ్‌ ఆద్మీ ధర్మమాని 2014 ఎన్నికలలో అవినీతి అనేది ప్రధానాంశం కాబోతోంది. పైగా రాష్ట్రంలో జగన్‌పై వున్న కేసుల కారణంగా, అతనికి ప్రతిగా నిలిచే కాంగ్రెసు తరఫు అభ్యర్థి క్లీన్‌గా వుండాలి. కిరణ్‌పై అవినీతి ఆరోపణలు బలంగా ఏమీ లేవు. వాళ్ల తమ్ముడిపేర చెదురుమదురుగా ఏదైనా అంటున్నా అది ప్రజల్లో నాటుకోలేదు. కిరణ్‌ స్థానంలో తెచ్చేవాడిని వెతకడం యీ విధంగా మరింత క్లిష్టమవుతోంది. నిజానికి కిరణ్‌ను కంటిన్యూ చేస్తే నష్టమేముంది? అసెంబ్లీ నుండి బిల్లు వెళ్లిపోయింది. ఇక ఆట పార్లమెంటులోనే ఆడాలి. ఈ విషయంలో తప్ప తక్కినవాటిలో కిరణ్‌ కేంద్రం చెప్పినట్లే వింటున్నాడు. బిల్లు తమ వద్దకు తెప్పించేసుకున్నాక కిరణ్‌ మహా అయితే కోర్టుకి వెళ్లగలడంతే. అది అతను కాకపోతే వేరే ఎవరైనా వెళ్లగలరు. 

ఇదంతా అధిష్టానం ముందే ఆలోచించి కిరణ్‌ను ఆడిస్తోందన్న తొలి ఆలోచన గురించి ఆలోచిస్తే – అధిష్టానం యిదంతా వూహించిందనుకోవడం దానికి లేని తెలివితేటలను కట్టబెట్టడమే! వాళ్ల కంత తెలివితేటలుంటే యిన్ని తలతిక్క పనులు చేయరు. అధికారంలో వున్నవాళ్లకు వందిమాగధులు, ఇంటెలిజెన్సు వర్గాలు గంతలు కట్టేస్తారు. అందుకే యిటీవల నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో అధికారపక్షం ఘోరంగా ఓడిపోయింది. సీమాంధ్రలో వ్యతిరేకత రాదని అక్కడి నాయకులు అధిష్టానాన్ని జోకొట్టారు. అది ఎప్పుడైతే చీదేసిందో సోనియాకానీ, రాహుల్‌ కానీ యిటువైపు తొంగి చూడడానికిగాని, తుపాన్లు వచ్చినపుడు సీమాంధ్రులను పలకరించడానికి గాని దడిశారు. రాహుల్‌ గ్యాస్‌ సిలండర్ల సంఖ్య లాటి చిన్నవిషయాలపై మాట్లాడతాడు కానీ, రాష్ట్రవిభజన వంటి పెద్ద విషయాలపై నోరు విప్పడు. పరిస్థితులు వాళ్ల చేతిలో లేవు. అవి ఎటు నడిపిస్తే అటు పోతున్నారు తప్ప, వాటిని శాసించే నాయకులు కారు వీరు. అందుకే కిరణ్‌ పదవిలో కొనసాగుతున్నారు.

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]