రివ్యూ: పాండవులు పాండవులు తుమ్మెద
రేటింగ్: 2.75/5
బ్యానర్: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
తారాగణం: మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్‌సందేశ్, తనీష్, హన్సిక, ప్రణీత, రవీనాటాండన్, బ్రహ్మానందం తదితరులు
మాటలు: డైమండ్ రత్నబాబు
రచన: బి.వి.ఎస్. రవి
కథనం: కోన వెంకట్, గోపీమోహన్
నేపథ్య సంగీతం: చిన్నా
సంగీతం: బప్పా లహరి, అచ్చు
కూర్పు: ఎం.ఆర్. వర్మ
ఛాయాగ్రహణం: పళని కుమార్
నిర్మాతలు: మంచు విష్ణు, మంచు మనోజ్
దర్శకత్వం: శ్రీవాస్
విడుదల తేదీ: జనవరి 31, 2014
మోహన్‌బాబు, తన ఇద్దరు తనయులతో పాటు మరో ఇద్దరు యువ హీరోలు కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఈ మంచు మల్టీస్టారర్ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథేంటి?
బ్యాంకాక్‌లో టూరిస్ట్ గైడ్ అయిన నాయుడు (మోహన్‌బాబు) ముగ్గురు అనాధల్ని (మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్) పెంచి పెద్ద చేస్తాడు. సత్య (రవీనాటాండన్) ఇద్దరు పిల్లల్ని (విష్ణు, వెన్నెల కిషోర్) పెంచి పెద్ద చేస్తుంది. వీళ్ల ఇద్దరు పిల్లలకీ ఒక్క క్షణం పడదు. నాయుడు, సత్యకి ఓ ఫ్లాష్‌బ్యాక్… ఇద్దరూ ప్రేమించుకుంటారు కానీ ఆర్థిక కారణాల వల్ల విడిపోతారు. ఇప్పుడు వారిద్దరి పెళ్లిని హనీ (హన్సిక) చేస్తుంది. ఆ పెళ్లితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. మొదట కొట్టుకున్నా తర్వాత అందరూ ఒకటవుతారు. ఈ సమయంలో హనీని వెంట తీసుకుని ఇండియా వెళ్లిపోతుందో రౌడీ బ్యాచ్. హనీ కథేంటి? ఆమెని అక్కడ్నుంచి ఈ నాయుడు కుటుంబం ఎలా తీసుకొస్తుందనేది బ్యాలెన్స్ స్టోరీ.
కళాకారుల పనితీరు!
మోహన్‌బాబు తనదైన శైలిలో నాయుడు పాత్రని పోషించారు. మంచు మనోజ్ ‘మోహిని’ పాత్రలో కామెడీ చేసాడు. ఆ లేడీ గెటప్‌లో మనోజ్‌పై తీసిన సీన్స్ కొన్ని మాస్‌ని ఆకట్టుకుంటాయి. విష్ణు క్యారెక్టర్ కామెడీ చేయలేదు కానీ యాక్షన్ సీన్స్‌లో తను డామినేట్ చేసాడు. తనీష్, వరుణ్ సందేశ్ ఓకే. లేడీ క్యారెక్టర్స్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. హన్సిక ఇన్ని సినిమాల తర్వాత కూడా నటించడానికి ఇంకా ఇబ్బందిపడుతోంది. ప్రణీత ఎక్కువగా స్కిన్ షోకే పరిమితమైంది. బ్రహ్మానందం మరోసారి గందరగోళం మధ్యలో తనకి అలవాటైన పాత్రలో కనిపించాడు. సుప్రీత్‌తో ఈసారి రొటీన్‌కి భిన్నంగా కామెడీ చేయించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
శ్రీను వైట్ల వద్ద చాలా సినిమాలకి పని చేసిన గోపిమోహన్, కోన వెంకట్ ఆ ‘రెడీ’ ఫార్మాట్‌ని ఇంకా విడిచిపెట్టలేదు. పాండవులు, విరాఠపర్వం… అనే సెటప్ యాడ్ చేయడమైతే జరిగింది కానీ సెకండాఫ్ పూర్తిగా వైట్ల స్కూల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమైంది. డైమండ్ రత్నబాబు డైలాగ్స్‌లో పంచ్ మిస్ అయింది. బప్పాలహరి, అచ్చు స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోవు. చిన్నా నేపథ్య సంగీతంతో ధ్వని కాలుష్యం ఎక్కువ జరిగింది. మిగతా టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు.
దర్శకుడు శ్రీవాస్ తన మొదటి రెండు సినిమాల్లో మాస్, కమర్షియల్ అంశాలకి కట్టుబడ్డాడు. ఈసారి కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో అతను తడబడ్డాడు. మనోజ్ లేడీ గెటప్‌తో ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఎంటర్‌టైనింగ్ సీన్స్ వరకు బాగానే తీసాడు కానీ ఓవరాల్‌గా దర్శకుడిగా అతనికి యావరేజ్ మార్కులే పడతాయి.
హైలైట్స్:
- భారీ తారాగణం
- లేడీ గెటప్‌లో మనోజ్ కామెడీ
డ్రాబ్యాక్స్:
- ఆకట్టుకోని స్టోరీ, స్క్రీన్‌ప్లే
- ఫస్ట్ హాఫ్
- వీక్ డైరెక్షన్
విశ్లేషణ:
‘గోల్‌మాల్ 3’ చిత్రంలోని ఫ్యామిలీ త్రెడ్ అంతటినీ ఇందులో ప్రథమార్థంగా వాడుకున్నారు. క్యారెక్టర్స్‌ని, మేనరిజమ్స్‌ని, అలవాట్లని కూడా ‘గోల్‌మాల్ 3’నుంచే ఇన్‌స్పయిర్ అయ్యారు. ఫస్టాఫ్‌కే ‘గోల్‌మాల్ 3’ సినిమా మొత్తం రౌండ్ ఆఫ్ చేయడంతో ఇక సెకండ్ హాఫ్‌లో ‘కొత్త’ కథ మొదలవుతుంది.
పాండవులు, కౌరవులు, జూదం, వనవాసం… అంటూ ఈ సినిమాని భారతంతో లింక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే నిజానికి ఆ ముసుగులో మళ్లీ ఈ సినిమా కూడా ‘రెడీ’, ‘ఢీ’ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్‌ని తీసుకెళ్లి విలన్స్ ఇంట్లో ఉంచితే… అక్కడ విలన్లని చివరిదాకా బఫూన్లని చేసి హీరోల బృందం ఆడిరచడం అనే రొటీన్ పాయింట్‌నే ఈ చిత్రంలోను వాడుకున్నారు.
ఎక్కడో ఒకటీ అరా కామెడీ సీన్లు మాస్ జనాల్ని ఆకట్టుకుంటాయి మినహా ఇది అవుట్ అండ్ అవుట్ లాఫింగ్ రయట్ అయితే కాదు. ఫస్టాఫ్ అయితే కంప్లీట్‌గా బోర్ కొట్టిస్తుంది. సెకండ్‌హాఫ్‌లో లేడీ గెటప్‌లో మనోజ్, రొటీన్ క్యారెక్టర్‌లో బ్రహ్మానందం అంతో ఇంతో రిలీఫ్ ఇస్తారంతే. ఏ కథని తీసుకున్నా కానీ ‘ఆవు వ్యాసం’ రాసినట్టు మళ్లీ అదే పద్ధతిన దానిని మార్చేసి మొత్తం గ్యాంగ్ అంతటినీ ఓ ఇంట్లో పారేసి చుట్టేస్తున్న ఈ ఫార్ములాని ఇంకెంత కాలం జనం నెత్తిన రుద్దుతారో మరి.
మనోజ్ లేడీ గెటప్ లేకపోతే ఆ కాసిని నవ్వులకి కూడా స్కోప్ ఉండేది కాదు. పైగా ఆ సీన్లు కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. క్లాస్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులని ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇంతమంది హీరోల కాంబినేషన్, మాస్‌కి నచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలే ఈ చిత్రాన్ని బి, సి కేంద్రాల్లో నిలబెడతాయేమో వేచి చూడాలి. ఎంతో పొటెన్షియల్ ఉన్న స్టార్ కాస్ట్‌ని పెట్టుకుని, ఆద్యంతం నవ్వించే కామెడీకి అనువైన సెటప్ ఉంచుకుని కూడా ఓ నాసిరకం సినిమాతో సరిపెట్టేసారు. ఈ రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని మంచు హీరోలు ఏ రేంజ్‌కి తీసుకెళ్తారనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.
బోటమ్ లైన్: ‘పాండవులు’ కాస్త నవ్వించారు, ఇంకాస్త విసిగించారు.